Tuesday, April 30, 2024

11 రాష్ట్రాల్లో 100కు పైగా ఒమిక్రాన్ కేసులు

- Advertisement -
- Advertisement -
More than 100 Omicron cases in 11 states
అనవసర ప్రయాణాలు వద్దని కేంద్రం హెచ్చరిక

న్యూఢిల్లీ: యావత్ ప్రపంచాన్ని కలవరపడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోను శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు పాకగా, మొత్తం 101 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32 కేసులు, ఢిల్లీలో 22 కేసులు నమోదైనట్లు తెలిపింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో 17, కర్నాటక, తెలంగాణలలో ఎనిమిదేసి, గుజరాత్, కేరళలో అయిదు చొప్పున వెలుగు చూశాయి. ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా తాజా పరిస్థితులపై ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

గతంలో బయటపడిన డెల్టా వేరింట్‌కన్నా ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఇప్పటికే 91 దేశాలకు ఈ వేరియంట్ పాకిందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ నమోదవుతున్న కేసుల్లో 2.4 శాతం ఈ వేరియంట్ కేసులేనని తెలిపారు. ముఖ్యంగా బ్రిటన్, డెన్మార్క్, నార్వే, దక్షిణాఫ్రికాల్లో ఒమిక్రాన్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. శుక్రవారం బ్రిటన్‌లో 11,708 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, డెన్మార్క్‌లో 9,009, డెన్మార్క్‌లో 9,009, lనార్వేలో 1,792 కేసులు నమోదయ్యాయి. ఇక ఒమిక్రాన్ తొలి సారి వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో1,257 కేసులు నమోదయ్యాయి. కాగా అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, బెల్జియం లాంటి పలు దేశాల్లో 500కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి.

జాగ్రత్త తప్పనిసరి

కాగా,ఒమిక్రాన్ వ్యాప్తి వేళ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం కోరింది. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరింది. అనవసర ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిదని తెలిపింది. ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఒక చోట గుమికూడొద్దని తెలిపింది. పండగల వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని, కొత్త సంవత్సర వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించింది.

87.6 శాతం మందికి తొలి డోసు

మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 136 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 87.6 శాతం మందికి తొలి డోసు పూర్తయినట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సినేషన్ రేటు భారత్‌లోనే ఉందని పేర్కొంది. అమెరికాతో పోలిస్తే 2.8 రెట్లు, యుకెతో పోలిస్తే 12.5 రెట్లు వ్యాక్సినేషన్ రేటు భారత్‌లో ఉందని లవ్ అగర్వాల్ వెల్లడించారు. కాగా గత 20 రోజులుగా దేశంలో కొత్త కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే ఉందని లవ్ అగర్వాల్ తెలిపారు. నాలుగు వారాలుగా పాజిటివిటీ రేటు 1 శాతం కంటే తక్కువగా ఉందన్నారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం వైరస్ తీవ్రత ఎక్కువగానే ఉందని తెలిపారు.19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 10 శాతం మధ్య ఉండగా, అయిదు జిల్లాల్లో 10 శాతానికి పైగానే ఉందన్నారు. ఇక యాక్టివ్ కేసుల్లో 40 శాతం ఒక్క కేరళలోనే ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News