Monday, May 6, 2024

మహిళల సంఖ్యాధిక్యత!

- Advertisement -
- Advertisement -

US and NATO pull-out of afghan raises tremendous

ఎక్కడ స్త్రీలు చదువుకుంటారో అక్కడ వారు మెరుగైన జీవితాన్ని, గౌరవాన్ని పొందుతారు. ఆ మేరకు దేశాభివృద్ధికి, సమాజ ప్రగతికి తోడ్పడతారు. భావి పౌరులను తీర్చి దిద్దడంలో, వారిలో స్త్రీ, పురుష సమానత్వ స్పృహ కలిగించడంలో పదునైన సాధనాలుగా ఉపయోగపడతారు. మహిళలు పూజింపబడం కంటే అక్షరాస్యులు, ఉన్నత విద్యావంతులు కావడమే ముఖ్యం. దాని కంటే ముందు వారిని బతకనివ్వడం అత్యంతావశ్యకం. తండ్రికి, సోదరుడికి, ప్రియుడికి, భర్తకి ఏ మగాడికి ఆగ్రహం కట్టలు తెంచుకున్నా ఆమె దారుణ హత్యకు గురి కావడం విరివిగా జరిగిపోతున్న మన వంటి దేశంలో మహిళల జనాభా పెరగడం, పురుషుల కంటే అధికంగా నమోదు కావడం అత్యంత ఆనందదాయకమైన పరిణామం.ప్రస్తుతం దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు 1020 మంది మహిళలున్నారని తాజాగా జరిపిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది.

ఐదేళ్ల క్రితం 201516లో ప్రతి 1000 మంది మగవారికి 919 మంది ఆడవారే ఉన్నట్టు అప్పటి సర్వే తెలియజేసింది. దీనిని బట్టి ఇప్పుడు మహిళలు గతంలో కంటే ఏ కొంచెమైనా మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నారని భావించడానికి ఆస్కారం కలుగుతున్నది. వారిప్పుడు ఎక్కువ కాలం జీవిస్తున్నారని స్పష్టపడుతున్నది. మహిళలకు వైద్య వసతుల అందుబాటు పెరిగిందని, అదే పనిగా పిల్లలను కనే యంత్రాలుగా బతికే దుస్థితి నుంచి విముక్తి పొందుతున్నారని, కుటుంబ నియంత్రణ పాటింపు ఎక్కువైందని విశదమవుతున్నది. అలాగే ఆడ పిల్లలను చదివించే విషయంలో తలిదండ్రుల్లో చైతన్యం పెరగడం వంటి కారణాల వల్ల పిన్న వయసు పెళ్లిళ్లు తగ్గాయని అందువల్ల మహిళ జీవిత కాలం ఎక్కువైందని అనుకోవలసి వుంది.

ప్రతి 1000 మంది పురుష జననాలకు స్త్రీ శిశు జననాల రేటు పెరగడం ఇంకా మందకొడిగానే వుంది. గర్భస్థ శిశువు ఆడో మగో ముందుగానే తెలుసుకొని ఆడ శిశువైతే వదిలించుకోడం, పుట్టిన తర్వాత ఆ పసి గుడ్డును ఏ నూతిలోనో, గోతిలోనో పారేయడం, పెంట కుప్పలకు అంకితం చేయడం వంటి అమానుషాలు కొనసాగుతూనే వున్నాయి. అదే సమయంలో కీకారణ్యంలో పొడిచిన తొలి సూర్య కిరణపు జాడలా స్త్రీ, పురుష జననాల నిష్పత్తి గతంలో కంటే ఇప్పుడు స్వల్పంగా మెరుగుపడింది. ఐదేళ్ల క్రితం జరిగిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే4 లో ప్రతి 1000 మంది మగ శిశువులకు ఆడ శిశు జననాలు 919 కాగా, ఇప్పుడిది (సర్వే 5) 929కి చేరింది. అయితే కేరళ, తమిళనాడు, ఒడిశా, బీహార్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో ఈ నిష్పత్తి తగ్గడం ఆందోళనకరం.

ఇది దేశంలో స్త్రీ, పురుష జననాల రేటు గాలి వాటంగా పెరగడం గానే కనిపిస్తున్నది గాని, స్త్రీని కనడం పట్ల పురుషుల్లో ఆసక్తి, లింగ సమానత్వ చైతన్యం అధికమైనందువల్ల కాదని స్పష్టపడుతున్నది. పై పెచ్చు కేరళ వంటి ప్రగతిశీల రాష్ట్రాల్లో ఆడ శిశువును కనాలనే దృష్టి తరిగిపోతున్నదా అనే భయానుమానాలకు కూడా తావిస్తున్నది. గత సర్వేలో కేరళలో ప్రతి 1000 పురుష జననాలకు 1047 స్త్రీ శిశువులు నమోదు కాగా, ఇప్పుడక్కడ 951 ఆడ శిశు జననాలే రికార్డయ్యాయి. తమిళనాడులో గతంలో ఈ రేటు 954 కాగా ఇప్పుడు 878కి పడిపోయింది. బీహార్, ఒడిశా, హిమాచల్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరాఖండ్, ఢిల్లీలో స్త్రీ జనన రేటు పెరగడం మంచి సూచిక. అయితే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కలకూ జనాభా లెక్కలలోని గణాంకాలకు తేడా వుంటున్నదని అంతిమంగా జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పురుషుల కంటే స్త్రీల సంఖ్య పెరగడం ఒక్కటే మహిళల పురోగతికి తిరుగులేని నిదర్శనం కాదు. స్త్రీ విద్య, మహిళల నిర్ణయ స్వేచ్ఛ పెరిగిన సమాజాల్లోనే వారికి, ఆ సమాజాలకు మేలు జరుగుతుంది. దేశాభివృద్ధికి విద్య అత్యంత కీలకమైనది. మన దేశంలో స్త్రీ పురుషులిద్దరి అక్షరాస్యత రేటు అత్యంత దయనీయంగా వుంది. మహిళల్లో అక్షరాస్యత మరింత అధ్వానం.

2001 జనాభా లెక్కల ప్రకారం మహిళల అక్షరాస్యత 54.16 శాతం, అంటే మొత్తం మహిళల్లో సగం కంటే ఒక పిసరు ఎక్కువ మంది మాత్రమే అక్షరాస్యులు. ఇది 2011 జనాభా లెక్కల్లో 65.46 శాతానికి పెరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ స్త్రీల అక్షరాస్యత రేటు పురుషుల కంటే బహు తక్కువగా వుంది. కేరళ, మిజోరం, మేఘాలయ రాష్ట్రాల్లో మాత్రమే పురుషులు స్త్రీల అక్షరాస్యతలో తేడా 5 శాతం కంటే తక్కువగా వుంది. అక్షరాస్యత విషయంలోనూ భిన్న అవగాహనలున్నాయి. కేవలం అక్షరాలు నేర్చుకొని ప్రాథమిక తరగతుల పాఠాలు చదవగలిగితే దానిని అక్షరాస్యతగా భావిస్తున్నారు. ఇది సరికాదు. చదవడం, రాయడంతో పాటు పలు విషయాల పట్ల ప్రగతిశీల అవగాహన, చైతన్యం కలిగి వుండడమే నిజమైన అక్షరాస్యత. దానిని సాధించినప్పుడే మన ప్రజలు తమ ఓటు హక్కును కూడా సవ్యంగా వినియోగించుకోగలుగుతారు. ముఖ్యంగా స్త్రీల విషయంలో ఈ చైతన్యం అవసరం అమితంగా వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News