Friday, May 3, 2024

ఎంఐఎం మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తుంది: అసదుద్దిన్ ఓవైసి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు మద్దతు విషయంపై ప్రస్తుతం ఆలోచిస్తున్నామని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేయడమే లక్షంగా పెట్టుకున్నామని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దిన్ ఓవైసి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మెజార్టీ స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని, తొందరలోనే ఆ వివరాలను వెల్లడిస్తామన్నారు. బిఆర్‌ఎస్‌తో తమ పార్టీకి దోస్తీ ఏమి లేదని కేవలం అభివృద్ధి చేస్తుందని మద్దతు మాత్రం ఇచ్చామన్నారు. ప్రస్తుతం బిఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే విషయం ఆలోచించడం లేదని, ముందు పార్టీని బలోపేతం చేసుకుంటామన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌తో ఎంఐఎం పార్టీకి దోస్తీ ఉందని బిజెపి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.

రెండు రోజుల క్రితం బీహార్‌లోని పాట్నాలో ఎన్డీయేకి చెందిన ప్రతిపక్ష పార్టీలు సమావేశమాయ్యారని, ఆ సమావేశానికి ఎంఐఎం పార్టీని పిలవలేదన్నారు. ప్రధాని మోడీ మూడోసారి ప్రధాన మంత్రి కాకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. అసలు దేశంలో బిజెపి ఎందుకు గెలుస్తుందో ప్రతిపక్షాలు ఏనాడైనా ఆలోచించాయానని ఆయన ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి మాయావతి పెద్ద నాయకురాలని, దళితుల ఓటు బ్యాంకు ఉన్నందునే అక్కడ నిలబడిందన్నారు. అక్కడే యుపిలో ముస్లింలు అధికంగా ఉన్నందున ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుందన్నారు. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో వివిధ రాష్ట్రాలలో పోటీ చేస్తామన్నారు. సెక్యూలర్ పార్టీలు ముస్లిం పార్టీలను దూరం పెట్టడం సరైంది కాదని, ఎన్డీయే పక్షాలు పిలిస్తే ఆలోచిస్తామన్నారు.

ప్రధాని మోడీ, అమెరికా పర్యటనకు వెళ్లారని, ఇది సంతోషిదగిన విషయమన్నారు. కానీ అక్కడ ముస్లింలను కించపరిచే విధంగా మోడీ వ్యాఖ్యానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనకు తాము మద్దతు ఇచ్చామే తప్పా బిఆర్‌ఎస్‌కు దోస్తీ ఏమి లేదని పరోక్షంగా పేర్కొన్నారు. దళితులకు రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు ఇస్తుందని, మైనారిటీలకు సైతం మైనారిటీ బంధు ఇవ్వాలని, గత సంవత్సరం సెప్టెంబర్‌లో తీర్మానం చేసి ముఖ్యమంత్రి కెసిఆర్‌కి పంపడం జరిగిందని, ఇంతవరకు ఎలాంటి స్పందన లేదన్నారు. ఏదేమైనా రాబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారాయని, ఎన్నికలు గట్టి పోటీనిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇక నిజామాబాద్‌లోని బోధన్ నియోజక వర్గంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంఐఎంకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లపై బూటకపు కేసు పెట్టారని, ఇది మూమ్మాటికి కక్ష సాధింపు చర్యేనని అన్నారు.

ఈ ఇద్దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే షకీల్ వద్దకు నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించేందుకు వెళితే అక్రమ కేసు పెట్టారని, దీన్ని ఎంఐఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే షకీల్, ఎంపిగా పోటీ చేసిన కవితకు ఎంఐఎం మద్దతు ఇస్తే ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎంఐఎంపై కుట్ర కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని అన్నారు. బోధన్ ఎసిపి, ఎస్‌హెచ్‌వోలను హైదరాబాద్ పంపిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు. ఎవరిపైనా (ఎమ్మెల్యే షకీల్) ఆరోపణలు వచ్చాయో వారిపై విచారణ జరిపించడం లేదని అన్నారు. నాలుగైదు నెలల్లో బిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలే జవాబు చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు షకీల్ అహ్మద్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

కార్పొరేటర్లను పరామర్శించిన ఓవైసి
ఎమ్మెల్యే షకీల్‌పై హత్యాయత్నం కేసులో అరెస్టు అయి జిల్లా కేంద్రంలోని సారంగపూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లను ఎంపి అసదుద్దిన్ ఓవైసి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను కలిసి యోగా క్షేమాలను తెలుసుకున్నారు. ఓవైసి వెంట డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, ఎంఐఎం అధ్యక్షుడు షకీల్ అహ్మద్, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News