Tuesday, April 30, 2024

రాజ్యసభలో రచ్చ.. రచ్చ

- Advertisement -
- Advertisement -

వ్యవసాయ బిల్లులపై ఓటింగ్‌కు విపక్షాల పట్టు
తోసిపుచ్చిన డిప్యూటీ చైర్మన్, మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోదం
వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల నినాదాలు
బిల్లు ప్రతులను చించేసి చైర్మన్‌పైకి విసిరేసిన టిఎంసి సభ్యుడు ఒ బ్రియాన్
మైకులను విరగ్గొట్టేందుకు విపక్ష సభ్యుల యత్నం

MPs created ruckus tore papers in rajya sabha

న్యూఢిల్లీ: విపక్షాల తీవ్ర ఆవదోళనల మధ్య వ్యవసాయానికి సంబంధించిన రెండు కీలక బిల్లులను ఆదివారం రాజ్యసభ ఆమోదించింది. మూజువాణి ఓటుతో బిల్లులకు పెద్దల సభ ఆమోదం తెలిపింది. రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని, వ్యవసాయ సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ బిల్లులపై చర్చ సందర్భంగా చెప్పారు. అయితే మంత్రి వ్యాఖ్యలను విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలువురు విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.

పోడియం వద్దకు దూసుకుపోయి బిల్లు ప్రతులను చించి వేశారు. వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య వ్యవసాయ బిల్లులకు సభ ఆమోదం తెలిపిందని ప్రకటించిన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ సభను సోమవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు విపక్ష సభ్యులు బిల్లుపై ఓటింగ్‌ను అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. బిల్లులను ఆమోదించడానికి వీలుగా సభ సమావేశం సమయాన్ని పొడిగించడంతో గొడవ మొదలైంది. అయితే ఏకాభిప్రాయం ద్వారా మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని వాదించిన ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తూ వెల్‌లోకి దూసుకు పోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించాయి.

దీంతో మంత్రి తన సమాధానాన్ని మధ్యలోనే ఆపేయగా, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ బిల్లులను ఆమోదానికి చేపట్టారు. అయితే ఈ బిల్లులను సభా కమిటీకి పంపించాలంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం, డిఎంకెలు ప్రతిపాదించిన తీర్మానాలను మూజువాణి ఓటుతో తిరస్కరించారు. దీంతో ఆ పార్టీలు ఈ బిషయంపై ఓటింగ్ జరపాలని పట్టుబట్టాయి. అయితే సభ్యులు తమ స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని డిప్యూటీ చైర్మన్ స్పష్టం చేస్తూ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరిక్ ఒ బ్రియాన్ బిల్లు ముసాయిదా ప్రతులను చించి వేసి పోడియంపైకి విసిరేశారు. అలాగే రూల్‌బుక్‌ను డిప్యూటీ చైర్మన్‌పైకి విసిరేయబోగా మార్షల్స్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. డిప్యూటీ చైర్మన్ వద్ద ఉన్న మైకులను విరగగొట్టడానికి సైతం కొందరు సభ్యులు యత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. డెరిక్ ఒ బ్రియాన్‌తో పాటుగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ తీర్మానాలు ప్రతిపాదించిన డిఎంకు సభ్యుడు తిరుచ్చి శివ, కాంగ్రెస్‌కు చెందిన కెసి వేణుగోపాల్, సిపిఎంకు చెందిన కెకె రాఘవ్‌లు బిల్లు ప్రతులను చించివేసి గాలిలోకి ఎగరేశారు.

కొవిడ్ నిబంధనల కారణంగా వెల్‌లోకి దూసుకు రావద్దని, తమ స్థానాల్లోకి తిరిగి వెళ్లాలని గొడవ చేస్తున్న సభ్యులను డిప్యూటీ చైర్మన్ కోరినా ఫలితం లేకపోవడంతో ఆయన మొదట ఆడియో, లైవ్ కవరేజిలను ఆపి వేశారు. అయినా గొడవ ఆగకపోవడంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు గొడవ చేయడం ఆపలేదు. అయితే గొడవ మధ్యలోనే డిప్యూటీ చైర్మన్ బిల్లులను మూజువాణి ఓటుకు ఉంచారు. మొదటి బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదించిన తర్వాత కనీసం ఇద్దరు సభ్యులు రాజ్యసభ అధికారుల టేబుల్‌పైకి ఎక్కడానికి ప్రయత్నించడం కనిపించింది. అయితే వారిని మార్షల్స్ లాగేశారు. రెండు బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదించిన సభ ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలను తిరస్కరించడంతో డిప్యూటీ చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News