Sunday, April 28, 2024

ఫైనల్లో ముంబై ఇండియన్స్

- Advertisement -
- Advertisement -

బుమ్రా, బౌల్ట్ మ్యాజిక్ , హార్దిక్ విధ్వంసం  ఢిల్లీపై రోహిత్ సేన ఘన విజయం

దుబాయి: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వాలిఫయర్1లో ముంబై 57 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో ముంబైకి ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓడినా ఢిల్లీకి మరో ఛాన్స్ మిగిలే ఉంది. బెంగళూరుహైదరాబాద్ మధ్య జరిగే ఎలిమినేటర్ విజేతతో రెండో క్వాలిఫయర్‌లో ఢిల్లీ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. బౌల్ట్ తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి ఢిల్లీకి కోలుకోలేని దెబ్బతీశాడు. బుమ్రా కూడా తన మొదటి ఓవర్‌లోనే వికెట్ తీయడంతో ఢిల్లీ ఖాతా తెరవకుండానే మూడు వికెట్లు కోల్పోయింది. కాగా మార్కస్ స్టోయినిస్ (65), అక్షర్ పటేల్ (42) మాత్రమే కాస్త రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు, బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టారు.
ఆదుకున్న డికాక్, సూర్య
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి మరో ఓపెనర్ డికాక్ ఇన్నింగ్స్‌ను కుదుటు పరిచాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన డికాక్ ఐదు ఫోర్లు, సిక్సర్‌తో వేగంగా 40 పరుగులు చేశాడు. మరోవైపు సూర్యకుమార్ తన అద్భుత ఫామ్‌ను ఈసారి కూడా కొనసాగించాడు. ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా దూకుడును ప్రదర్శించాడు. ఇటు సూర్య, అటు కిషన్ కుదురుగా ఆడడంతో స్కోరు వేగాన్ని అందుకుంది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 51 పరుగులు చేశాడు.
హార్దిక్ మెరుపులు
ఇక ఆఖరి ఓవర్లలో ముంబై బ్యాట్స్‌మన్ చెలరేగి ఆడారు. ఇటు ఇషాన్, అటు హార్దిక్ పాండ్య విధ్వంసక బ్యాటింగ్‌తో స్కోరును పరిగెత్తించారు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన హార్దిక్ వరుస సిక్సర్లతో అలరించాడు. అతని ధాటికి ఢిల్లీ బౌలర్లు పూర్తిగా డీలా పడిపోయారు. అసాధారణ ఇన్నింగ్స్‌ను ఆడిన హార్దిక్ 14 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 30 బంతుల్లోనే మూడు సిక్స్‌లు, మరో నాలుగు ఫోర్లతో 55 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో ముంబై స్కోరు 200 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News