Friday, April 26, 2024

ఏదో అనుకుంటే మరేదో జరిగింది!

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనల సందర్భంగా నిరసనకారులు చేతిలో పట్టుకునే నినాదాలు రాసి ఉన్న అట్టముక్కలు(ప్లకార్డులు) ఒక్కోసారి ఊహించని చిక్కులను తెచ్చిపెడతాయి. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్‌యు)లో ఆదివారం విద్యార్థులు, టీచర్లపై జరిగిన దాడి ఘటనకు నిరసనగా సోమవారం ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద విద్యార్థులు, పౌరసమాజం నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్న మెహక్ మీర్జా ప్రభు అనే 37 ఏళ్ల మహిళకు ఆమె చేతిలో పట్టుకున్న ప్లకార్డ్ చిక్కులు తెచ్చిపెట్టడమే కాక జాతి వ్యతిరేకి అన్న ముద్ర కూడా వేసింది. ఆమె చేసిన తప్పల్లా ఫ్రీ కశ్మీర్ అనే నినాదం రాసి ఉన్న ప్లకార్డ్‌ను పట్టుకోవడమే. ఈ నినాదం చివరకు బిజెపి, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పర్థకు కారణమైంది. చివరకు ఆమె తన చర్యకు సంజాయిషీ కూడా ఇచ్చుకోవలసి వచ్చింది. అసలేం జరిగిందంటే.. జెఎన్‌యు విద్యార్థులకు సంఘీభావంగా సోమవారం ముంబైలో గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద స్థానిక విద్యార్థులు ఒక ప్రదర్శన నిర్వహించారు.

అయితే, ఆ సమయంలో అటుగా వచ్చిన మీర్జా ప్రభుకు అక్కడ కొందరు విద్యార్థులు ప్లకార్డులపై నినాదాలు రాస్తుండడం కనిపించింది. అమె కంటికి ఫ్రీ కశ్మీర్ అనే నినాదం రాసున్న ప్లకార్డ్ చిక్కింది. కశ్మీరులో గత ఏడాది నుంచి ఇంటర్‌నెట్ సర్వీసులను నిలిపివేయడంతో అక్కడి ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడిందని భావించిన ప్రభు తన చేతిలోని నినాదం సందర్భోచితంగా ఉందని భావించింది. ఫ్రీ కశ్మీర్ నినాదంతో ప్రభు ఫోటో ఇంటర్‌నెట్‌లో సెన్సేషన్ సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ముంబైలో ఇటువంటి వేర్పాటువాద శక్తులను ఎలా సహించగలము.. మీ కళ్ల ఎదుటే భారత్ నుంచి కశ్మీరును వేరుచేయాలంటూ జరుగుతున్న భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎలా సహిస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను నిలదీశారు. దీంతో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రతిస్పందించక తప్పలేదు. ఫ్రీ కశ్మీర్ ప్లకార్డు పట్టుకున్న ఆ మహిళ గురించి తమ దృష్టికి కూడా వచ్చిందని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. శివసేన సీనియర్ నాయకుడు, సామ్నా సంపాదకుడు సంజయ్ రౌత్ కూడా దీనిపై స్పందిస్తూ భారత్ నుంచి కశ్మీరును వేరు చేయాలన్న వేర్పాటువాద ప్రచారాన్ని తమ ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని ఆయన కూడా హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. తన చేతిలోని ప్లకార్డు ఇంత రాజకీయ దుమారాన్ని సృష్టించడం పట్ల మీర్జా ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ఒక ఉద్దేశంతో ఆ ప్లకార్డ్‌ను పట్టుకుంటే దానికి వేరే అర్థాలు స్ఫురించడం ఆశ్చర్యంగా ఉందని ఆమె తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేసిన 3 నిమిషాల వీడియోలో వివరణ ఇచ్చారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అన్నది దేశ ప్రజల రాజ్యాంగపరంగా సంక్రమించి ప్రాథమిక హక్కు అని, అది కశ్మీరు ప్రజలకు లేకుండా పోయిందన్న ఆవేదనతోనే తాను ఆ ప్లకార్డ్ పట్టుకున్నానని ఆమె చెప్పారు. ఈ వివాదాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తనకు తెలియడం లేదని ఆమె వాపోయారు. మరి ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Mumbai Woman picked up the Free Kashmir placard

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News