Tuesday, May 7, 2024

సాగర్ అభ్యర్థి ఎంపికపై టిఆర్‌ఎస్ ముమ్మర కసరత్తు

- Advertisement -
- Advertisement -

సాగర్ అభ్యర్థి ఎంపికపై టిఆర్‌ఎస్ ముమ్మర కసరత్తు
క్షేత్రస్థాయి పరిస్థితులు…బలాబలాలపై సమీకరణలు
2018లో 7,771 ఓట్ల మెజారిటీతో నోముల విజయబావుటా
సిట్టింగ్ సీటును దక్కించుకునేలా వ్యూహాలు

మనతెలంగాణ/హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై టిఆర్‌ఎస్ పార్టీ దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం మధ్య సమన్వయం తదితర అంశాలపై పార్టీ అధిష్టానం గత కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 17వ తేదీన సాగర్ ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో అన్ని కోణాల్లోనూ లెక్కలు కడుతూ కసరత్తును ముమ్మరం చేసింది. పార్టీ టికెట్ కోసం స్థానికంగా పోటీ పడుతున్న నేతలు, కాంగ్రెస్, బిజెపి తరపున పోటీ చేసే అవకాశమున్న అభ్యర్థులు, వారి బలాబలాలు, నియోజకవర్గంలో సామాజికవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యా బలం తదితరాలను ప్రాతిపదికగా తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే నిర్వహించిన అంతర్గత సర్వేల నివేదికల ఆధారంగా సాగర్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి, టికెట్ ఆశిస్తున్న నేతల బలాబలాలపై లోతుగా అధ్యయనం చేసి అభ్యర్థిని ఖరారు చేయనున్నట్ల తెలిసింది. పార్టీ సంస్థాగత బలం, సామాజిక వర్గాల ఓట్ల సంఖ్య తదితరాల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయాలని టిఆర్‌ఎస్ భావిస్తున్నట్లు తెలిసింది.. మరో వైపు అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇటీవల నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతల అభిప్రాయాలను కూడా ప్రభుత్వ మాజీ విప్, పార్టీ ఇన్‌చార్జి నేతృత్వంలోని బృందాలు వేర్వేరుగా సేకరించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో 2.16 లక్షల ఓట్లకుగాను బిసి సామాజిక వర్గం నుంచి ప్రధానంగా యాదవులు పెద్ద సంఖ్యలో ఉండగా, రెడ్డి, ఎస్‌టి సామాజిక వర్గాల ఓటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అభ్యర్థి ఎవరైనా కేడర్ మద్దతు అతనికి పూర్తిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మండలాలు, మున్సిపాలిటీల వారీగా త్వరలోనే పార్టీ ఇన్‌చార్జీలను నియమించే అవకాశం ఉంది.
విపక్ష పార్టీ అభ్యర్థులపై నజర్
టిఆర్‌ఎస్ పార్టీ సొంత పార్టీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తూనే విపక్ష పార్టీల అభ్యర్థులపై దృష్టి సారిస్తోంది. సిట్టింగ్ సీటును కచ్చితంగా దక్కించుకునేలా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి లేదా ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి, బిజెపి నుంచి నివేదితరెడ్డి లేదా కడారి అంజయ్య యాదవ్ పోటీలో ఉంటే ఎదురయ్యే పరిస్థితులను కూడా టిఆర్‌ఎస్ బేరీజు వేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్, బిజెపి పార్టీ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థిని నాగార్జునసాగర్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేయనున్నారు. స్థానికత, సానుభూతి వంటి నినాదాల నేపథ్యంలో పార్టీ అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఔత్సాహికుల వడపోతను టిఆర్‌ఎస్ పూర్తి చేసినట్లు సమాచారం. ప్రధానంగా నలుగురి పేర్లు పరిశీలనలో ఉండటంతో క్షేత్రస్థాయిలో వారికి ఉండే బలాబలాలపైనా వివిధ కోణాల్లో కసరత్తు చేసి వారంలోగా రోజుల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2009లో తొలిసారి ఎన్నికలు
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన నాగార్జునసాగర్ స్థానానికి తొలిసారి 2009లో ఎన్నికలు జరిగాయి. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సిపిఎం నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన నోముల నర్సింహయ్య 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నుంచి నోముల నర్సింహయ్య 7,771 ఓట్ల మెజారిటీతో విజయబావుటా ఎగురవేశారు. అయితే అనారోగ్యంతో నోముల మృతి చెందడంతో నాగార్జునసాగర్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది.

Nagarjuna Sagar by-elections to held on April 17

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News