Tuesday, April 30, 2024

ఆస్ట్రేలియా ఓపెన్ ‘క్వీన్’ నవోమి ఒసాకా

- Advertisement -
- Advertisement -

Naomi Osaka beats Brady to lift title

 

ఫైనల్లో బ్రాడీ ఓటమి

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను జపాన్ స్టార్ నవోమి ఒసాకా సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ ఒసాకా అమెరికాకు చెందిన 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీను 64, 63తో ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. ఒసాకాకు ఇది రెండో ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఓవరాల్‌గా ఒసాకాకు కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్ స్లామ్ ట్రోఫీ. బ్రాడీతో జరిగిన ఫైనల్ సమరంలో ఒసాకా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఒసాకా ఊహించినట్టే అలవోక విజయంతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఒసాకా ఏ దశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వలేదు. అయితే తొలి సెట్‌లో బ్రాడీ కాస్త మెరుగైన ఆటను కనబరిచింది.

కీలక సమయంలో పుంజుకున్న బ్రాడీ వరుసగా రెండు గేమ్‌లను సాధించింది. అయితే ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమైన బ్రాడీ వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన ఒసాకా తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో మాత్రం ఒసాకాకు ఎదురే లేకుండా పోయింది. ఆరంభం నుంచే చెలరేగి పోయింది. కళ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడిన ఒసాకా ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా లక్షం దిశగా అడుగులు వేసింది. చివరి వరకు జోరును ప్రదర్శించిన జపాన్ స్టార్ సునాయాసంగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. మరోవైపు తొలి ప్రయత్నంలోనే గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాలని భావించిన బ్రాడీకి నిరాశే మిగిలింది. అయినా ఏమాత్రం ఆశలు లేకుండా ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగిన బ్రాడీ ఏకంగా ఫైనల్‌కు చేరి పెను సంచలనమే సృష్టించింది.

ఆనందంగా ఉంది..

మరోవైపు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను సాధించడంపై నవోమి ఒసాకా ఆనందం వ్యక్తం చేసింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ గెలుచుకోవడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని తెలిపింది. రానున్న టోర్నీల్లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ విజయం దోహదం చేస్తుందని పేర్కొంది. ఇక ఫైనల్లో ప్రత్యర్థి క్రీడాకారిణి బ్రాడీ అద్భుతంగా ఆడిందని ప్రశంసించింది. తొలి సెట్‌లో తనకు గట్టి పోటీ ఇచ్చిందని, ఒక దశలో తాను ఒత్తిడికి కూడా గురయ్యానని తెలిపింది. ఈ మ్యాచ్‌లో ఓడినా బ్రాడీకి మంచి భవిష్యత్తు ఉందని ఒసాకా అభిప్రాయపడింది.

నేడు మెద్వెదేవ్‌తో జకోవిచ్ ఢీ

పురుషుల సింగిల్స్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), రష్యా సంచలనం, నాలుగో సీడ్ డానిల్ మెద్వెదేవ్‌ల మధ్య ఆదివారం తుది సమరం జరుగనుంది. జకోవిచ్ ఇప్పటికే 17 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నాడు. మరోవైపు డానిల్ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మకమైన పురుషుల ఎటిపి మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించి జోరు మీదున్న మెద్వెదేవ్ ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌పై కన్నేశాడు. ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించడం ద్వారా తన ఖాతాలో తొలి గ్రాండ్‌స్లామ్ జమ చేసుకోవాలని భావిస్తున్నాడు.

అయితే అపార అనుభవం కలిగిన సెర్బియా యోధుడు జకోవిచ్‌ను ఓడించి టైటిల్ సాధించడం అనుకున్నంత తేలికేం కాదు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా చివరి వరకు పోరాడే సత్తా జకోవిచ్ సొంతం. ఫెదరర్, నాదల్ వంటి దిగ్గజాలను ఓడించి పలు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించిన జకోవిచ్ ధాటికి తట్టుకొని నిలవడం డానిల్ సవాల్ వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ డానిల్ మాత్రం తన మార్క్ ఆటతో చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. జకోవిచ్‌ను ఓడించడం ద్వారా పురుషుల టెన్నిస్‌పై తనదైన ముద్ర వేయాలనే లక్షంతో ఫైనల్‌కు సిద్ధమయ్యాడు. ఇటు జకోవిచ్ అటు మెద్వెదేవ్ టైటిల్ సాధించడమే లక్షంగా పెట్టుకోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News