Tuesday, May 7, 2024

ఈ నెల 9 నుండి జాతీయ పుస్తక ప్రదర్శన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు -జూలూరు గౌరీశంకర్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగు భాషకు పట్టం కడుతూ అన్ని భాషలకు ప్రాధాన్యం కల్పిస్తూ హైదరాబాద్‌లోని గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి నిలువుటద్దంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిలిచిందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఫిబ్రవరి 9 నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్‌టిఆర్ స్టేడియం (తెలంగాణ కళాభారతి) ప్రాంగణంలో జరిగే పుస్తక ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. ఈ పుస్తకప్రదర్శనలో పాలుపంచుకోవాలని, జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి ప్రతీ ఒక్కరు తమ వంతుగా కృషి చేయాలన్నారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జూలూరు మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చగల శక్తి పుస్తకానికుందన్నారు. భావితరాల్ని తీర్చిదిద్దే శక్తి తరగతి గదికి ఉందని, మకిలపట్టిన సమాజం బూజు దులిపే పనిముట్లుగా పుస్తకాలు ఉపయోగపడతాయన్న అచంచల విశ్వాసంతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ దశాబ్ద కాలంగా ముందుకు సాగుతుందన్నారు. జ్ఞానతెలంగాణ నిర్మాణానికి పుస్తక ప్రదర్శనలు ఒకమెట్టుగా ఉపయోగపడాలన్న ధ్యేయంతో ముందుకు సాగటం వల్ల రాష్ట్ర అవతరణ తర్వాత పుస్తక ప్రదర్శనలు భారీగా విజయవంతం అవుతూ వస్తున్నాయన్నారు. గత పదేళ్ళుగా హైదరాబాద్ పుస్తక ప్రదర్శన టీమ్ వర్కుగా ముందుకు సాగటం వల్ల ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా రూపుదాల్చిందని చెప్పారు.

మా టీమ్కు గత రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సంపూర్ణంగా సహకరిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పుస్తక ప్రదర్శనలకు అండదండగా నిలిచి ఎన్టీఆర్ స్టేడియం తెలంగాణ కళాభారతి స్థలాన్ని 20 రోజులు ఉచితంగా ఇవ్వటం పెద్ద ప్రోత్సాహంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో బుక్ ఫెయిర్ కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, కోయ చంద్రమోహన్ , కోశాధికారి పి.రాజేశ్వరరావు, సహాయ కార్యదర్శి శోభన్‌బాబు, కార్యవర్గ సభ్యులు కవి యాకూబ్, జనార్థన్ గుప్తా, బాల్‌రెడ్డి, శ్రీకాంత్, మాటూరి సూర్యనారాయణ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News