Monday, April 29, 2024

ఇంగ్లండ్ 253 ఆలౌట్..

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: ఇంగ్లండ్‌తో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించింది. శనివారం రెండో రోజు ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ఆధిక్యం 171 పరుగులకు చేరింది. కాగా, 336/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్ మరో 60 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఈ క్రమంలో టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీని నమోదు చేశారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ 290 బంతుల్లో ఏడు సిక్సర్లు, మరో 19 ఫోర్లతో 209 పరుగులు సాధించాడు. మిగతావారు విఫలం కావడంతో భారత్ ఇన్నింగ్స్ 396 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్‌లు మూడేసి వికెట్లను పడగొట్టారు.

శుభారంభం..
తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ధాటిగా ఆడిన డకెట్ 17 బంతుల్లోనే 4 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. అయితే ప్రమాదకరంగా కనిపించిన డకెట్‌ను కుల్దీప్ వెనక్కి పంపాడు. దీంతో 59 పరుగుల తొలి ఇన్నింగ్స్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కూడా జాక్ క్రాలీ దూకుడును కొనసాగించాడు. ఓలి పోప్ అతనికి అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన క్రాలీ 78 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అతన్ని అక్షర్ పటేల్ ఔట్ చేశాడు.

బుమ్రా జోరు..
ఈ దశలో టీమిండియా స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రా అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. నిప్పులు చెరిగే బంతులతో విజృంభించిన బుమ్రా ఇంగ్లండ్ బ్యాటర్లను హడలెత్తించాడు. అతని ధాటికి జో రూట్ (5), ఓలి పోప్ (23) పెవిలియన్ చేరాడు. అంతేగాక బెయిర్‌స్టో (25) కూడా బుమ్రా పెవిలియన్ బాట పట్టించాడు. బుమ్రా వరుస క్రమంలో వికెట్లను తీయడంతో ఇంగ్లండ్ కోలుకోలేక పోయింది. ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు. టామ్ హార్ట్‌లీ (21) పరుగులతో తనవంతు పాత్ర పోషించారు. జట్టును ఆదుకుంటారని భావించిన వికెట్ కీపర్ ఫోక్స్ (6), రెహాన్ అహ్మద్ (6) విఫలమయ్యారు. అండర్సర్ ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. భారత బౌలర్లలో బుమ్రా 45 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టాడు. కుల్దీప్‌కు మూడు వికెట్లు దక్కాయి. టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News