Monday, April 29, 2024

న్యూజిలాండ్‌లో నేషనల్ పార్టీ గెలుపు..

- Advertisement -
- Advertisement -

ఆక్లాండ్ : న్యూజిలాండ్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కన్సర్వేటివ్ నేషనల్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. శనివారం ఫలితాలు వెలువడ్డాయి. ఆరు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న లేబర్ పార్టీ ప్రభుత్వానికి బదులుగా ప్రజలు తమ ఓటుతో తీసుకువచ్చిన మార్పుతో మధ్యే మితవాద నేషనల్ పార్టీకి చెందిన మాజీ వ్యాపారవేత్త క్రిస్టోఫర్ లక్సన్ (53 సంవత్సరాలు) న్యూజిలాండ్ తదుపరి ప్రధాని కానున్నారు. శనివారం సాయంత్రం వరకూ వెల్లడయిన ఫలితాలతో తదుపరి ప్రధానిగా దేశంలోని ఎయిర్‌లైన్స్ మాజీ అధినేత అయిన లక్సన్ దేశ ప్రధాని అయ్యేందుకు రంగం సిద్ధం అయింది. ప్రస్తుత ప్రధాని క్రిస్ హిప్కిన్స్ తమ ఓటమిని అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని పదవికి లక్సన్‌ను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. గత ఎన్నికలలో జెసిండా అర్డెర్న్ ఘన విజయం సాధించారు. అయితే కోవిడ్ దశలో ప్రభుత్వం విధించిన ఆంక్షలు. తరువాతి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెచ్చిపెట్టింది.

దీనిని తట్టుకునే శక్తి తనకు లేదని పదవినుంచి ఆమె వైదొలిగారు. కాగా ఈ ఏడాది జనవరిలోనే క్రిస్ హిప్కిన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఇటువంటి ఫలితాలను తాను ఆశించలేదని తెలిపిన హిప్కిన్స్ , తాము గత ఆరు సంవత్సరాలలో తమ పార్టీ సాధించిన విజయం తమకు గర్వకారణం అని తెలిపారు. మొత్తం మీద నేషనల్ పార్టీకి 55, లేబర్ పార్టీకి 33, గ్రీన్స్ పార్టీకి 13, యాక్ట్‌కు 12, ఎన్‌జడ్ ఫస్ట్‌కు 8, టె పతి మావోరికి నాలుగు సీట్లు వరకూ వస్తాయని న్యూజిలాండ్ హెరాల్డ్ తెలిపింది. లక్సన్ నేషనల్ పార్టీకి మొత్తం ఓట్లలో దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయి . లేబర్ పార్టీకి కేవలం 25 శాతం ఓట్లు దక్కాయి. అర్డెర్న్ హయాంలో వచ్చిన ఓట్లతో పోలిస్తే ఇది సగమే. దేశంలోని నిష్పత్తియుత ఓటింగ్ పద్ధతి ప్రకారం లిబర్టేరియన్ యాక్ట్ పార్టీతో లక్సన్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News