Saturday, May 4, 2024

ఆపరేషన్ సోనియా ఆరంభం.. పిసిసి నేతగా సిద్ధూ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Navjot Singh Sidhu quits as Punjab Congress Chief

చండీగఢ్: పంజాబ్ పిసిసి అధ్యక్షులు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ తమ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం సిద్ధూ ప్రకటించారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీకి చేదు అనుభవం మిగిల్చాయి. ఈ ఐదు రాష్ట్రాల పిసిసి అధ్యక్షులను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బర్తరఫ్ చేశారు. ఈ విధంగా భారీ ప్రక్షాళనకు దిగారు. ఈ నేపథ్యంలో సిద్ధూ పంజాబ్ పిసిసి నేత బాధ్యతల నుంచి వైదొలిగారు.నాయకురాలి ఆదేశాల మేరకు తాను రాజీనామాను సమర్పిస్తున్నట్లు పేర్కొన్న ఈ క్రికెటర్ అయిన రాజకీయ నేత తన లేఖను పార్టీ అధ్యక్షురాలికి పంపించారు. దీని ప్రతిని మీడియాకు విడుదల చేశారు. ఇటీవలే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరిగింది. పరాజయంపై పోస్టు మార్టం నిర్వహించారు.

పార్టీ పునర్వస్థీకరణకు వీలుగా ఆయా రాష్ట్రాల పిసిసి నేతలు వైదొలగాలని సోనియా ఆదేశాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీటు వెలువరించారు. ఈ క్రమంలో యుపి, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల పిసిసి నేతలపై వేటు పడింది. ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ పరాజయం చెందింది. పంజాబ్‌లో పార్టీ ఓటమి చెంది, ఆప్ అధికారంలోకి వచ్చిన దశలో సిద్ధూ పంజాబీల మొగ్గు పట్ల అభినందనలు తెలియచేయడం వివాదాస్పదం అయింది. పిసిసి అధ్యక్షుడిగా ఉంటూనే ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించడంపై విమర్శలు తలెత్తాయి. అయితే తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు శిరోధార్యం అని, వారు విజ్ఞతతోనే ఆలోచించి ఉంటారని పేర్కొన్నారు. పిసిసి నేతగా ఉంటూ వచ్చిన సిద్ధూ రాష్ట్రంలో పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీశాడనే అపవాదు మూటకట్టుకున్నారు. మరో వైపు అమృత్‌సర్ ఈస్ట్ స్థానం నుంచి ఆప్ అభ్యర్థిని జీవన్ జ్యోత్ కౌత్ చేతిలో ఓడారు.

Navjot Singh Sidhu quits as Punjab Congress Chief

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News