Sunday, May 5, 2024

నూతన క్రిమినల్ చట్టాలు వాటి ప్రభావం!

- Advertisement -
- Advertisement -

దేశ స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం లా కమిషన్లు వరుసగా 1833, 1853, 1861, 1879 సంవత్సరాల్లో వేసి వివిధ చట్టాల రూపకల్పనకు నాంది పలికి ప్రస్తుతమున్న క్రిమినల్ చట్టాలైన భారతీయ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అదే విధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ను రూపొందించడం జరిగింది. కాని ప్రస్తుతం ఇవే చట్టాలను నూతనంగా రూపొందించడానికై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతూ మార్చి 2020 సంవత్సరంలో క్రిమినల్ చట్టాల్లో మార్పుచేర్పులకై ప్రతిపాదనలను, సూచనలను చేయడానికి ఒక ప్యానెల్ ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఇదే ప్యానెల్ చేసిన ప్రతిపాదనలపై ఫిబ్రవరి నెల 2022 సంవత్సరంలో ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశాన్ని ప్రజలందరికీ ఇచ్చి చరిత్రలో మొదటిసారిగా చట్టాల రూపకల్పనలో ఒక ప్రత్యేక విధానం ద్వారా ప్రజల సూచనలను తీసుకోవడం జరిగింది. పైవిధంగా గత, ప్రస్తుత క్రిమినల్ చట్టాల రూపకల్పనకు, మార్పునకై చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే వీటి ప్రభావం సమాజంలో భిన్నమైన రీతిలో ఉండనుంది.

గతంలో వున్న క్రిమినల్ చట్టాలను రూపొందించింది బ్రిటీష్ ప్రభుత్వం కావడం, అంతేకాకుండా దేశ వనరులను దోపిడీ చేసి తమ దేశానికి తరలించడమే ప్రధాన లక్ష్యంగా రూపొందించడం, అదే విధంగా భారతీయులను అణచివేసే కుట్రతో భారతీయులపై తీవ్రమైన వ్యతిరేకత చూపించే భావంతో చట్టాల రూపకల్పన జరిగిందని చెప్పవచ్చు. అంతేకాకుండా వారు చేసిన ఈ క్రిమినల్ చట్టాల్లో దాదాపు 400 సార్లు ‘బ్రిటీష్ క్రౌన్’ అనే పదాన్ని వినియోగించడం జరిగింది.బ్రిటీష్ ప్రభుత్వం చేసిన ఈ క్రిమినల్ చట్టాలు ఇప్పటికీ అంటే దాదాపు 75 సంవత్సరాలుగా ఇంకా అమలులో ఉండడం ఒక చేదు అనుభవంలాంటిదే అని భావించవచ్చు. ఇంకా వీటితో పాటు ఈ చట్టాల్లో చాలా సందర్భాల్లో లింగ తటస్థత లోపించడం కూడా గమనించవచ్చు. అంతేకాకుండా చట్టాల అమలులో క్లిష్టమైన నిర్మాణం వుండడం వల్ల న్యాయస్థానాల్లో తీర్పు ఆలస్యం అవడం జరుగుతున్నది. పై విధంగా గతం లో బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిమినల్ చట్టాలు వివిధ రకాలుగా ప్రస్తుత కాలానికి సరితూగడం లేదని వాటి మార్పు ప్రస్తుతం మన దేశ విధి విధానాలను, భవిష్యత్‌ను అనుసరించే విధంగా వుంటే మంచిదని భావించవచ్చు.

గతంలో వున్న ఇండియన్ పీనల్ కోడ్ 1860లో 576 సెక్షన్స్ ఉండగా ఇందులోని 175 సెక్షన్లను సవరించారు. 8 నూతన సెక్షన్లను తీసుకొచ్చారు, 22 సెక్షన్లను తొలగించారు.ఈ విధంగా ఇదే చట్టం స్థానంలో తెచ్చిన ఈ నూతన భారతీయ న్యాయ సంహిత చట్టంలో 356 సెక్షన్లు వున్నాయి. ఈ చట్టం ప్రధానంగా అసలు ఏది నేరం, నేరం చేసిన నేరస్థులను శిక్షించే పద్ధతి గురించి తెలియచేస్తుంది. అదే విధంగా గతంలో ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో 484 సెక్షన్లు వుండగా ప్రస్తుతం దీని స్థానంలోతెచ్చిన నూతన భారతీయ నాగరిక సురక్షా సంహితలో 533 సెక్షన్లు వున్నాయి. ఈ చట్టం ప్రధానంగా వ్యక్తి నిర్బంధం, విచారణ, నిర్బంధించిన వ్యక్తికి జామీను ఇచ్చు పద్ధతి, కేసు పూర్తి వ్యవహార శైలినీ తెలియచేస్తుంది. అదే విధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో 167 సెక్షన్లు వుండగా ప్రస్తుతం దీని స్థానంలో కొనసాగనున్న నూతన చట్టమైన భారతీయ సాక్ష్య చట్టంలో 170 సెక్షన్లు వున్నాయి. ఈ చట్టం ప్రధానంగా ఒక కేసు లో అనుమతించదగ్గ సాక్ష్యం గురించి, సాక్ష్యం నిరూపణ బాధ్యతను గురించి నిపుణుల అభిప్రాయాల గురించి తెలియచేస్తుంది.

చట్టాల్లో సరికొత్త నేరాలుగా స్నాచింగ్ (అపహరణ), మోబ్ లించింగ్ (ముకోన్మాదం), వివాహం చేసుకోవడం అనే నకిలీ వాగ్దానం. అదే విధంగా ప్రశ్నపత్రాల లీకేజీ, దీనితో పాటు ఎటిఎం దొంగతనం, పొంజి స్కీం వంటి వాటిని నేరాలుగా చేర్చడం జరిగింది. ముఖ్యంగా ఈ నూతన భారతీయ నాగరిక శిక్షా సంహితలో సెక్షన్ 105 ప్రకారం సెర్చ్, సీజర్ ప్రొసీజర్‌ని ఆడియో, వీడియో ద్వారా అనుమతించి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ నూతన భారతీయ సాక్ష్య సంహితలో సెక్షన్ 61 ప్రకారం ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డింగ్‌ని సాక్ష్యంగా అనుమతించడం అనేది ప్రస్తుత కాలంలో ఒక ప్రధాన అంశంగా భావించవచ్చు. అంతేకాకుండా తొలగించిన వాటిలో గతం లో ఇండియన్ పీనల్ కోడ్‌లో వున్న సెక్షన్ 124 రాజద్రోహం, 309 ఆత్మహత్య ప్రయత్నం ప్రధానంగా నిలుస్తున్నాయి. ఈ రెండింటినీ నేర జాబితా నుండి తొలగించడం అత్యంత సరైన నిర్ణయంగా భావించవచ్చు. అదే విధంగా ఈ నూతన చట్టాలు ఉగ్రవాదం, వేర్పాటువాదం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే సాయుధ తిరుగుబాటు అణచివేతకు కఠినమైన విధివిధానలను చట్టాల్లో రూపొందించడం జరిగిందని చెప్పవచ్చు.

ఈ చట్టాల ప్రధాన ఉద్దేశం సరైన న్యాయాన్ని సత్వరంగా అందించడమే అని తెలుస్తున్నది. కారణం కాల పరిమితి విధింపు అంటే ఒక కేసు నమోదు అయినప్పటి నుండి 3 సంవత్సరాలలోనే ఆ కేసును పూర్తిగా విచారణ జరిపించి న్యాయస్థానం నుండి తీర్పు ఇవ్వాలనే విధానాన్ని చట్టంలో చేర్చడం ఈ విధానం వల్ల ఇకపై న్యాయస్థానాల్లో జాప్యం తగ్గడం వల్ల ప్రజల అనేక సమస్యలు అతి తక్కువ కాలంలోనే పరిష్కరించబడతాయి. కావున ప్రజలు న్యాయస్థానాల్లో న్యాయం అతి తక్కువ కాలంలో దొరుకుతుందని నమ్మడం న్యాయస్థానాలపై అత్యంత విశ్వాసాన్ని పెంచుకునే మంచి తరుణం ఏర్పడనుండడం గర్వకారణం. అంతేకాకుండా ఈ చట్టాలు సత్వర న్యాయం, న్యాయమైన విచారణ, న్యాయమైన పరిహారం ప్రజలకు అందించేందుకు రూపొందించడం అత్యంత కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 75 సంవత్సరాల స్వాతంత్య్ర కాలంలో ఇంకా బ్రిటీష్ వారి ప్రాబల్యం మన దేశ చట్టాల్లో ఉండడం అనేది మన దేశ ఔన్నత్యాన్ని తగ్గించే దిశగా వున్నందున ఈ దిశను దానిని పెంపొందించే విధంగా మార్పు చేయడం అనివార్యంగా భావించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News