Sunday, April 28, 2024

కెసిఆర్ నేతృత్వంలో స్వాతంత్య్రతా సాకారం!

- Advertisement -
- Advertisement -

‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ పేరుతో 75 సంవత్సరాల స్వేచ్ఛా స్వాతంత్య్రాల సంబురం జరుపుకుంటున్నది దేశం. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా ఇంటింటా జాతీయ జెండాలు రెపరెపలాడినయి. నిలువెత్తు సాధికారతకు, సార్వభౌమతకు, స్వయం పాలనకు, ఆత్మగౌరవానికి రూపమైన జెండా నీడలో భద్రంగా ఉండే ఆ సంబురం దేశంలోని అన్ని ప్రాంతాల్లో కంటే తెలంగాణలో గొప్ప పండుగ వాతావరణంలో జరిగింది. కెసిఆర్ నేతృత్వంలో ‘ఔరా’ అని అందరూ నివ్వెరపోయేలా మన భారతీయత ప్రజ్వరిల్లింది.

CM KCR announced the National Party

‘సాధించిన దానికి సంతృప్తిని పొంది… అదే విజయమనుకుంటే పొరపాటోయీ’ అంటరు మహాకవి శ్రీశ్రీ. ఈ డ్బ్భై అయిదు యేండ్లలో ఎంతో సాధించినా సకల సంపదలు గల్ల దేశంలో ఇంకా దరిద్రం తాండవిస్తూనే ఉన్నది. అయితే ఇది కేవలం ఆర్ధిక దారిద్య్రం మాత్రమే కాదు. అంతకు మించిన భావ దారిద్య్రం! ఎన్నో సందర్భాల్లో కెసిఆర్ ఉటంకించిన అంశాలు -సంక్షోభంలో రైతన్నలు, తగ్గుతున్న తలసరి ఆదాయం, రూపాయి పతనం, పెరుగుతున్న పేదరికం, తీవ్రమవుతున్న సామాజిక అసమానతలు, బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నా… నీళ్ళు సముద్రంలో కలిసిపోతున్నా చేతులు కట్టుకుని గత పాలకులు చూసిన చోద్యం, పుష్కల అవకాశం ఉన్నా విద్యుత్ ఉత్పత్తి చేయడంలో కొరవడిన చొరవ… ఇవి స్వాతంత్య్ర లక్ష్యాలకు తీవ్ర విఘాతం. దీనికి కారణం వనరుల లేమి కాదు, చిత్తశుద్ధి, దీర్ఘ దృష్టి లేకపోవడం!

నాడు స్వాతంత్య్ర పోరాటంలో నినాదాలు ఎన్ని ఉన్నా, లీడ్ చేసిన నాయకుల విధానాలు బహుళంగా ఉన్నా, అందరి లక్ష్యం ఒక్కటిగా ఉండింది- భారతదేశం సర్వసత్తాక దేశంగా స్వయం పాలన చేసుకోవాలని, సాధికారత సాధించాలని, ఈ లక్ష్య ప్రకటనకు సారాంశరూపమేకింద ఇచ్చిన భారత రాజ్యాంగపు పీఠిక.
భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని
సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య
గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి,
పౌరులందరికీ:
-సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని;
-ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం,
ఆరాధనల స్వాతంత్య్రాన్ని ;
-అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ,
సమానత్వాన్ని చేకూర్చడానికి;
-వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను
సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి;

దేశంలో పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న యే పార్టీ మేనిఫెస్టో అయినా, పార్లమెంటరీ వ్యవస్థను నమ్మని విప్లవకారుల నినాదాలు అయినా – అన్నీ ఇందులో ఇమిడిపోయేవే. మరి ఇపుడు ఏమి జరుగుతున్నది? ఏడున్నర దశాబ్దాల పాటు ఎన్ని పార్టీలు, ఎన్ని మేనిఫెస్టోలు, ఎంతమంది నాయకులు చేయగలిగినంత చేయలేదనే కదా? మరీ ముఖ్యంగా గత ఎనిమిదేండ్ల బిజెపి పాలన దేశాన్ని అన్ని సూచీలలో అథమ స్థాయికి నెట్టివేసింది. యువతను మతం మత్తులో ముంచి వారి జీవితాలతో ఆడుకుంటున్న బిజెపి రాజ్యాంగ హామీలను తుంగలో తొక్కుతున్నది. కాంగ్రెస్ కానీ, మరే ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలు కానీ ఇంతకాలం కనీసంగానైనా గొంతు ఎత్తలేకపోయినయి. కాబట్టే కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి మనందరినీ నడిపించబూనిన్రు. ఆయన నేతృత్వంలో తెలంగాణ తెచ్చుకున్న, దాన్ని బంగారంగా నిలబెట్టిన మనందరం ఇపుడు దేశాన్ని బాగు చేసే పనిలో పడాలి.

అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవ జీవనం ప్రజలందరికీ అందడమే సమానత్వం అంటే. మన దేశం ప్రపంచలోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక శక్తి. అయితే ఈ సంపద మొత్తం గుజరాతీ వ్యాపారుల దగ్గర పోగు పడింది. ఆర్ధిక దోపిడీని ప్రశ్నిస్తే దేశాన్ని, దేశభక్తిని ప్రశ్నించినట్టు, దేశద్రోహం అన్నట్టు హుంకరిస్తున్నారు. తమ అనుంగు కార్పొరేట్లకు లక్షల కోట్లలో దొబ్బబెడుతూ, సంపదను సముద్రాలు దాటిస్తూ; ప్రజల సంక్షేమం విషయంలో మాత్రం ‘ఉచితాలు’ వద్దు అంటూ బోడి సలహాలు ఇస్తున్నది మోడీ ప్రభుత్వం. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేవి సంక్షేమ పథకాలు. ఏదో ఒక రూపంలో ప్రజల చేతిలో నగదు ఆడితే, అభివృద్ధి చక్రం తిరుగుతుంది అనేది ప్రపంచ వ్యాప్త ఆర్ధిక నిపుణులు చెప్పే విషయం. ప్రజల దగ్గర సొమ్ము ఉంటే వారు వస్తు, సేవల కోసం ఖర్చు పెడతారు. ఆ డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తులు పెరుగుతాయి.

KCR enter into national politics

ఉత్పత్తి పెంచడానికి ఉద్యోగులు అవసరం అవుతారు. అట్లా నిరుద్యోగిత తగ్గుతుంది. ఇదొక చక్రం. ఇందులో యే ఊచ విరిగినా పరుగు కుంటుపడుతుంది. పై అన్నీ ఉండాలంటే శాంతి- భద్రతలు పటిష్టంగా ఉండాలి. మతం పేరుతో, కులం పేరుతో కొట్లాటలలోనే జీవితాలు తెల్లారిపోతే ఇంక మనుషులెక్కడ? దేశం ఎక్కడ? మౌలికమైన ఈ అంశాలు గమనంలో ఉంచుకుని, ప్రజల శ్రమ ద్వారా పెరిగిన సంపద వారికి దక్కేలా చూసి, అన్ని వివక్షల నిర్మూలనా మార్గాలు పాటించే అసమానతలు లేని పాలన ద్వారానే స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం కాపాడుకోగలం. తెలంగాణలో ఈ విజయగాథలు పుష్కలం. ఈ మోడల్ ను దేశ వ్యాపితం చేయడం అవసరం. తథ్యం కూడా!

మతాలతో పాటు నేడు సమాజం కులాలుగా కూడా నిలువునా చీలిపోతున్నది. ఇది ఆందోళన, ఆవేదన కలిగించే పరిణామం. ప్రతి దినమూ కులపరమైన వివక్షలు, హత్యలు, పరువు హత్యలు జరుగుతున్నాయి. కాస్తో కూస్తూ చదువుకున్న వారు, ఇతరత్రా ప్రజాస్వామ్యం, ప్రగతిశీలం అంటూ మాట్లాడేవారు కూడా తమ కులానికి సంబంధించిన వివక్ష సందర్భాల్లో మౌనంగా ఉంటున్నారు. ఇది రాజ్యం చేసే నష్టం కంటే కూడా ఎక్కువ. కుల స్పృహ, కుల వివక్ష పట్ల ప్రతిఘటన, హక్కుల సాధన వేరు- కుల మౌడ్యంలో కూరుకుపోవడం వేరు. కులం అంటే సమూహం. విశిష్ట సంస్కృతి కలిగిన సముదాయం. ఆ భిన్నతను కాపాడుకుంటూనే, కులాల పేర పెడ ధోరణలు పెచ్చరిల్లినపుడు అందరూ ఒకటై నిలవాల్సిన అవసరం ఉంది. అది మనమే చేయగలం.

భారతదేశం వేల ఏళ్ళుగా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన దేశం. మనిషి పుట్టుక, జీవన సార్థకత, వసుధకై కుటుంబం, సర్వజన హితం అన్నీ కూడా ఈ నేల మూలాల్లో ఉన్నవి. సర్వసమత బోధించిన వైతాళికులు కోకొల్లలుగా పుట్టివున్నారు ఈ దేశంలో. అది సనాతన ధర్మం అయినా, వైష్ణవం అయినా, శైవం అయినా, బౌద్ధ జైన సిక్కు మతాలు అయినా అన్నీ నేర్పింది ఒక్కటే. రాముడు, కృష్ణుడు చెప్పింది ఒక్కటే అందరూ కలిసి మెలిసి జీవించమని. ఇంతకు మించి ధర్మం లేదు. ‘దేశం కోసం ధర్మం కోసం’ అంటే అసలైన అర్థం ఇదే. బిజెపి చెప్పే వక్ర భాష్యం కాదు, వికృత కార్యాచరణ కాదు.

ఠాగోర్, గాంధీ, శాస్త్రి, అంబేడ్కర్‌ల తాత్వికత, దార్శనికత, పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నరు కెసిఆర్. తానే స్వయంగా చెప్పినట్టు కెసిఆర్ వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నరు. అయితే, ఇది వైరాగ్యం కాదు. ఆయన సర్వసంగ పరిత్యాగి కాదు. ఆయన ఒక రాజర్షి. ఏకకాలంలో సమరం చేయ గల రాజు, సర్వమానవ శాంతీ సౌఖ్యాల కోసం మార్గాలు వెతికే ఋషి కూడా. అందుకనే నిశ్చయంగా చెప్పుకోవచ్చు మనం. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందించగలమని. కానీ అవి సాదించాలంటే కెసిఆర్ మరికొద్ది గంటల్లో ప్రకటించబోయే జాతీయ పార్టీకి ప్రాంతాలు, కులాలు, మతాలు, రాజకీయ శిబిరాల తేడా లేకుండా అందరి మద్దతు అవసరం. మేధావులు మౌనం వీడాలి. చర్చ జరగాలి. దేశాన్ని బాగు చేసుకోవాలి. తీసుకుందామా మరి ఆ శుభ సంకల్పం, నేడే!
జై భారత్.

శ్రీశైల్ రెడ్డి పంజుగుల
9030997371

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News