Saturday, April 27, 2024

కాలం చెల్లిన చట్టాలు రద్దు!

- Advertisement -
- Advertisement -
new law with revenue code in telangana
రెవెన్యూ కోడ్‌తో కొత్త చట్టం, శాసనసభ సమావేశాల్లో ఆమోదముద్ర?, తహసీల్దార్‌ల అధికారాల్లో భారీగా కోత, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, వ్యవసాయ శాఖలకు కీలక అధికారాలు

హైదరాబాద్ : వచ్చే నెల జరగనున్న శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదముద్ర వేయనున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ కాలం చెల్లిన చట్టాలను రద్దు అయ్యేలా ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించినట్టుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి తుది ముసాయిదా రెడీ అయ్యిందని, ఈ సమావేశాల్లోనే దీనిని ఆమోదించుకోవాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళుతున్నట్టుగా సమాచారం. నూతన చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, బలంగా ఉన్న చట్టాలు, రూల్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా కీసర తహసీల్దార్ నాగరాజు ఉదంతంతో కొత్త చట్టంలో తహసీల్దార్‌ల అధికారాలకు భారీగా కోత పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. గడిచిన మూడేళ్లుగా ఏసిబి నమోదు చేసిన కేసుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు చెందిన వారే ఉండడంతో ఈ శాఖను ప్రక్షాళన చేయాలన్న దిశగా ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని రూపొందించినట్టుగా సమాచారం.

అధికారులకు ఉన్న విశేషాధికారాలకు కోత…

కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా రెవెన్యూ శాఖను పలు శాఖల్లో విలీనం చేసి, అధికారులకు ఉన్న విశేషాధికారాలకు కోత పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే కొ త్త చట్టంలో తహసీల్దార్‌లకు ఆదాయ ధ్రువీకరణ పత్రా లు, జనన, కుల, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు పలు సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల గుర్తింపు, ఫ్రొటోకాల్ వంటి వాటికే వారి అధికారాలను పరిమితం చేయనున్నట్టుగా తెలిసింది. కీలక అధికారాలను పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, వ్యవసాయ శాఖలకు ప్రభుత్వం అప్పగించనున్నట్టుగా సమాచారం.

టైటిల్ గ్యారంటీ చట్టం పక్కకు…

కొందరు అధికారుల అవినీతిపరుల పనితీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది. మ్యుటేషన్లు, పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్‌లు ప్రజలను మండల కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంవత్సర కాలంగా కొత్త రెవెన్యూ చట్టంలో పొందుపరచాల్సిన అంశాలకు సంబంధించి కలెక్టర్లు, న్యాయ నిపుణులతో సేకరించిన అభిప్రాయాలను ప్రభుత్వం క్రోడీకరించినట్టుగా తెలిసింది. అందులో భాగంగా రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడటం తదితర పనులకు ప్రభుత్వం తుదిరూపునిచ్చినట్టుగా తెలిసింది. అయితే గతంలో తెరపైకి వచ్చిన టైటిల్ గ్యారంటీ చట్టం ఆలోచనను దాదాపుగా విరమించుకున్న ప్రభుత్వం రెవెన్యూ కోడ్‌ను అమలు చేసే అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది.

రెవెన్యూ కోడ్‌కు మార్పులు, చేర్పులు..

1999 సంవత్సరంలోనే రెవెన్యూ కోడ్‌కు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసినా కేంద్రం ఓకే చెప్పకుండా 44 ప్రశ్నలు సంధిస్తూ తిప్పిపంపింది. దీనికే కొన్ని మార్పులు, చేర్పులు చేసి తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్- 2020ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల స్థానంలో రెవెన్యూ కోడ్‌తో ఒకే చట్టం మనుగడలోకి రానున్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు భూ పరిపాలనకు మూలాధారంగా భావించే ల్యాండ్ రెవెన్యూ చట్టం-1907ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ నిర్వహణ చట్టం -2020 ప్రవేశపెట్టే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలిసింది. భూ పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశించే ఈ పాత చట్టాలు దెబ్బతినకుండా ప్రభుత్వం కొత్త చట్టానికి తుదిరూపు ఇచ్చినట్టుగా తెలిసింది. ఇందులో 124 చట్టాలు, నియమాలకు బదులు రెవెన్యూచట్టం-1907, భూ ఆక్రమణ చట్టం, అసైన్‌మెంట్, రెవెన్యూ రికవరీ, ల్యాండ్ గ్రాబింగ్, సర్వే, సరిహద్దులు, రక్షిత కౌలుదారు తదితర చట్టాలతో ముసాయిదా రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్టుగా సమాచారం.

54 అధికారాల్లో కీలకమైన వాటిని తొలగించి 20 అధికారాలు మాత్రమే…

కొత్త చట్టంలో తహసీల్దార్లు, ఆర్డీవోల అధికారాల కత్తెర, వీఆర్వోల విలీనం, హోదాల మార్పుపై కసరత్తు చేస్తున్న సర్కారు.. సబ్ రిజిస్ట్రార్లకు కీలక బాధ్యతలు అప్పగించనుందని ప్రచారం జరుగుతోంది. దీంట్లో భాగంగా భూముల రిజిస్ట్రేషన్ జరిగిన మరుక్షణమే మ్యుటేషన్, ఇన్‌స్టంట్ పాస్‌పుస్తకాన్ని జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ భూములపై వివాదాలు, ఇతరత్రా వ్యాజ్యాల పరిష్కారానికి జిల్లా స్థాయిలో అధీకృత అధికారి, ట్రిబ్యునల్‌ను నియమించే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న కలెక్టర్, అదనపు కలెక్టర్(రెవెన్యూ)కు ప్రత్యామ్నాయంగా రెవెన్యూ వివాదాలను పరిష్కరిస్తారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థలో ఉన్న ఏడంచెల అధికార వ్యవస్థను కుదించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌కు రిటైర్డ్ జడ్జిలను నియమించే అవకాశమున్నట్లుగా సమాచారం. దీంతోపాటు తహసీల్దార్‌లకు ఉన్న 54 అధికారాల్లో కీలకమైన వాటిని తొలగించి 20 అధికారాలను మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. సిసిఎల్‌ఏ పోస్టు, సర్వే సబ్ డివిజన్ ఏర్పాటు అధికారానికి కోత, రక్షిత కౌలుదారు చట్టం వంటివి కొత్త చట్టం రాకతో రద్దుకానున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News