Wednesday, May 8, 2024

కొవిడ్ ఆటకట్టుకు నోటి మందు

- Advertisement -
- Advertisement -

New oral drug inhibits Corona within 24 hours in ferret model

 

క్షీరదాల్లో తేలిన సామర్థం

వాషింగ్టన్ : కరోనా వైరస్ ఆటకట్టుకు టీకా మందుపై పోటాపోటీ యత్నాలు సాగుతున్నాయి. ఇప్పుడు అమెరికా పరిశోధకులు ఈ వైరస్ పూర్తిస్థాయి నియంత్రణకు నోటి మందు మోల్నూపిరవిర్‌ను రూపొందించారు. ముందుగా దీనిని క్షీరదాలలో ప్రయోగించి చూడగా, ఈ యాంటీవైరల్ మందు సమర్థవంతంగా పనిచేసిందని నిర్థారణ అయింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ ఫెరెట్ క్షీరదాలలో వైరస్‌ను నియంత్రించిందని అధ్యయనాలలో వెల్లడైంది. దీనికి సంబంధించిన వివరాలను జర్నల్ నేచర్ మైక్రోబయాలజీలో ఇప్పుడు ప్రచురించారు.

జార్జియా స్టేట్ యూనివర్శిటీతో పాటు పలువురు పరిశోధకులు తమ అధ్యయన క్రమంలో ఈ నోటి మందును రూపొందించారు. దీనికి శాస్త్రీయంగా ఎంకె 4482/ఇఐడిడి 2801 అని పేరు పెట్టారు. సాధారణంగా ఇంఫ్లూయెంజా వైరస్‌ల నిరోధకానికి బాగా పనిచేస్తున్నట్లు తేలిన ఈ ఓరల్ డ్రగ్గ్ ఇప్పుడు కొవిడ్ వైరస్ వ్యాప్తిని కూడా అత్యంత వేగవంతంగా అరికడుతుందని నిర్థారించారు. శరీరంలోకి పాకిన వైరస్ వ్యాప్తిని నోటి ద్వారా పంపించే ఈ మందుతో అరికడుతుందని, ఈ విధంగా కరోనా వైరస్ నివారణ క్రమంలో సరికొత్త వైద్యచికిత్సకు రంగం సిద్ధం అయినట్లుగా భావిస్తున్నట్లు జర్నల్‌లో తెలిపారు.

ఇప్పటివరకూ కరోనా కట్టడికి కేవలం టీకా మందునే మార్గంగా ఎంచుకున్నారు. ఈ దిశలోనే ప్రయోగాలు పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాము ఎంచుకున్న ఈ నోటి మందుతో ఇప్పటివరకూ ఉన్న వైరస్ చికిత్సలో అపూర్వ మార్పు చోటుచేసుకుంటుందని అధ్యయనకర్తలలో ఒకరైన పరిశోధకులు రిచర్డ్ ప్లెంపెర్ తెలిపారు. అయితే దీనిని మనుష్యులలో పరీక్షించి ఫలితాన్ని చూడాల్సి ఉంటుంది. అయితే ఈ దశలోనూ దీని సమర్థత నిర్థారణ అవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు సామూహిక వ్యాక్సిన్ చేరే లోపల ముందు వైరస్ కమ్యూనిటీ వ్యాప్తిని నియంత్రించడం కీలకమైన అంశం అని , ఇందుకు మార్గంగా ఇప్పటి ఆవిష్కరణ పనికి వస్తుందని అధ్యయన పత్రంలో తెలిపారు.

శ్వాసకోశ సంబంధిత ఆర్‌ఎన్‌ఎ వైరస్‌ల నిరోధానికి ఈ మందు విస్తృత ప్రాతిపదికన పనిచేస్తుందని గమనించినట్లు , జంతువులలోకి నోటిద్వారా దీనిని పంపించగా వాటిలో వైరస్ కణాలు గణనీయంగా క్షీణించిపోయినట్లు తేలిందని పేర్కొన్నారు. ఇది చిట్టచివరికి వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తుందని తెలిపారు. క్షీరదాలలో జరిపిన ప్రయోగ ఫలితాలు మనుష్యులపై కూడా రాబట్టుకున్నట్లు అయితే కేవలం ఒక్కరోజులోనే కొవిడ్ లక్షణాలు లేకుండా పోతాయని పేర్కొన్నారు. ఈ డ్రగ్ ఇప్పుడు రెండో మూడో క్లినికల్ పరీక్షలలో దశలో ఉంది. ఇవి పూర్తి అయితే కరోనా నియంత్రణ విధానాలలో కీలక ఘట్టం ఆరంభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News