Friday, May 3, 2024

మధ్యప్రాచ్యంలో మరో చిచ్చు

- Advertisement -
- Advertisement -

 Israel and Palestine

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కొత్త శాంతిపథకంతో ముందుకు వచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ఇది శాంతియుత పరిష్కారం కానే కాదని పలువురు విశ్లేషించారు. నిజానికి ఇది శాంతిపథకం కాదని, ఒక రియల్ ఎస్టేట్ డీల్ లాంటిదని ఇంకొందరు వ్యాఖ్యానించారు. రెండు పక్షాల్లో ఒకదానికి అన్యాయం చేసే రియల్ ఎస్టేట్ డీల్ లాంటిదనే వాదనలు ముందుకు వచ్చాయి.

ఒక పక్షానికి అన్యాయం చేస్తూ, మరో పక్షం తన దురాక్రమణను విస్తరించడానికి అవకాశం కల్పించే పథకం ఇది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమకు హక్కులేని భూభాగాల్లో ఇజ్రాయెల్ తిష్ట వేసే అవకాశం కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ఈ శాంతి పథకం శతాబ్దంలో అత్యుత్తమ శాంతి పథకంగా ట్రంప్ చెబుతున్నప్పటికీ, నిజానికి ఇది 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న భూభాగాలపై ఇజ్రాయెల్‌కు సార్వభౌమాధికారం కట్టబెట్టే పథకంగా పలువురు వివరించారు. ఇలా దురాక్రమణ చేసుకున్న భూభాగాలపై ఇజ్రాయెల్‌కు సార్వభౌమాధికారం కట్టబెట్టడాన్ని పాలస్తీనా ఒప్పుకుంటే బదులుగా పాలస్తీనాకు కొని తాయిలాలు ఇస్తారు. పాలస్తీనాకు నామమాత్రపు నియంత్రణ ఉన్న మిగిలిన భూభాగాల్లోను ఇజ్రాయెల్ సెటిల్మెంట్లున్నాయి. అంటే పాలస్తీనా శాశ్వతంగా ఇజ్రాయెల్ సైన్యం దాడుల భయంతో బతికే శాంతి పథకం ఇది.

ట్రంప్ ప్రతిపాదించిన శాంతి పథకం రెండు రాజ్యాల పరిష్కారం కానేకాదు. పాలస్తీనా ఒక రాజ్యంగా కాదు కదా కనీసం అర్థరాజ్యంగా కూడా ఈ శాంతి పథకం వల్ల ఏర్పడడం సాధ్యం కాదు. ట్రంప్ పథకం నిజానికి ఇఇజ్రాయెల్ దురాక్రమణలు కొనసాగించడానికి రాజమార్గం వేసే ప్రయత్నం. పాలస్తీనాకు స్వతంత్ర రాజ్యం ఏర్పడే అవకాశాలు ఇక మిగలనే మిగలవు. మిలిటరీ దురాక్రమణలు లేని కనీసపు స్వతంత్ర ప్రతిపత్తి కూడా వారికి లభించదు. కాబట్టి ఈ శాంతి పథకం వల్ల మధ్యప్రాచ్యంలో శాంతిని స్థాపించడం అనేది సాధ్యం కాదు. పైగా ఈ శాంతి పథకాన్ని అమలు చేస్తే, పశ్చమాసియాలో తీవ్రవాదం, ఉగ్రవాదం మరింత పేట్రేగిపోతాయి.

ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు ఇరుగు పొరుగు దేశాలుగా శాంతియుతంగా కొనసాగడం ఉగ్ర శక్తులకు ఎన్నడూ ఆమోదయోగ్యం కాదు. ఈ శాంతి పథకంలోని అన్యాయాన్ని వాడుకుని ఈ శక్తులు బలపడతాయి. విచిత్రమేమంటే, పాలస్తీనా ప్రతినిధులెవ్వరినీ ఈ పథకం చర్చల్లో పిలవలేదు. ట్రంప్ స్వయంగా ఈ పథకాన్ని తయారు చేశారు. తక్షణం ఇజ్రాయెల్ ప్రధాని మహదానందంగా ఒప్పుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రధాని అంత త్వరగా వెంటనే ఒప్పుకున్నాడంటేనే ఈ పథకం ఎలాంటిదో అర్థమవుతుంది.

పాలస్తీనా నేతలు అమెరికాతో అధికారిక సంబంధాలు 2017లోనే తెంచుకున్నారు. జెరుసలేంపై ఇజ్రాయెల్ సార్వభౌమాధికారాన్ని అమెరికా గుర్తించిన తర్వాత పాలస్తీనా నేతలు అమెరికాతో సంబంధాలు తెంచుకున్నారు. అమెరికా దౌత్యకార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరుసలేంకు మార్చేసింది. ఈ నిర్ణయం అమెరికా ఈ వివాదంలో ఎవరి పక్షాన ఉందో స్పష్టంగా చెబుతోంది. అమెరికాతో సంబంధాలు తెంచేసుకోవడం ద్వారా పాలస్తీనా మాట్లాడే అవకాశాలు లేకుండా చేసిందని విమర్శించడం చాలా తేలిక. కాని బాహాటంగా ఇజ్రాయెల్ కొమ్ము కాస్తున్న అమెరికాతో సంబంధాలు పాలస్తీనా కొనసాగిస్తుందని భావించడం పాలస్తీనాను అవమానించడమే అవుతుంది. అధికారిక సంబంధాలు లేకపోయినా అమెరికా చిత్తశుద్ధితో ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తుంటే అనధికారికగా చర్చలు కొనసాగించవచ్చు. కాని అలాంటివి ఏవీ జరగలేదు.

అసలు ట్రంప్ పథకంలో చర్చించే విషయాలు ఏవీ లేవు. ఇజ్రాయెల్‌కు మరింత దురాక్రమణలు కొనసాగించే ప్రోత్సాహం తప్ప మరేమీ లేదు. 1993లో ఓస్లో ఒప్పందం కుదిరింది. ఓస్లో ఒప్పందం కూడా పాలస్తీనా పట్ల సవతి ప్రేమ ప్రదర్శించిన ఒప్పందమే. ఇప్పుడు ట్రంప్ అంతకన్నా మరో అడుగు ముందుకు వేసి, ఓస్లో ఒప్పందాన్ని కూడా మరిచిపోండి, పాలస్తీనాకు అది కూడా దొరకదంటున్నాడు. అంతకన్నా అవమానకరమైన షరతులకు ఒప్పుకోమంటున్నాడు.

ఓస్లో ఒప్పందం ప్రకారం ఐదేళ్ళ కాలపరిమితితో పాలస్తీనా స్వయం పరిపాలనా మండలి ఏర్పడాలి. ఆ తర్వాత రెండు రాజ్యాల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి. ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం ఈ రెండు రాజ్యాలు ఏర్పడాలి. యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న భూభాగాల నుంచి సైన్యం వెనక్కు మరలాలి. కాని దురదృష్టవశాత్తు ఓస్లో ఒప్పందం అమలులోకి రాలేదు. నిజానికి శాంతి స్థాపనకు ఒక మంచి అవకాశం అది. అప్పుడు కూడా ఇజ్రాయెల్ మొండితనమే ఒప్పందానికి అడ్డంకి అయ్యింది. ఇప్పుడు ట్రంప్ శాంతి పథకంలో అసలు రెండు రాజ్యాల పరిష్కారం అనేదే లేదు. ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న భూభాగాలపై ఇజ్రాయెల్ కు హక్కులు కట్టబెట్టడం, జోర్డాన్ వ్యాలీ కూడా ఇజ్రాయెల్ కు ధారాదత్తం చేయడం మాత్రమే.

ఇజ్రాయెల్ అప్పుడే ఈ ప్రాంతాలను ఆక్రమించుకుంటామని ప్రకటించింది. ట్రంప్ ప్రభుత్వం వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను కూడా గుర్తిస్తుంది. నిజానికి అమెరికా ఇంతవరకు అనుసరిస్తూ వచ్చిన విధానం ప్రకారం ఈ సెటిల్మెంట్లు అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమైనవి. ట్రంప్ ప్రభుత్వం ఇజ్రాయెల్ మతతత్వ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందన్నది స్పష్టం. అమెరికా అధ్యక్షుడుపై అభిశంసన కొనసాగుతుంటే, ఇజ్రాయెల్ ప్రధాని అవినీతిపై మరోవైపు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు శాంతి పథకాన్ని ఒకరు ప్రతిపాదించడం, మరొకరు ఆనందంగా ఒప్పుకుని ఆలింగన చేసుకోవడం జరిగింది. వివాదంలో ఒక పక్షంగా ఉన్న పాలస్తీనా ప్రతినిధులెవ్వరూ ఇందులో లేరు. ఈ కార్యక్రమలో కొన్ని అరబ్బు దేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ దేశాలన్నీ నిజానికి అమెరికా క్లయింట్ల వంటివి. బహ్రెయిన్, యుఎఇ దేశాలకు ఈ పథకం పట్ల పెద్ద ఆసక్తి లేదు, అభ్యంతరమూ లేదు.

ఈజిప్టు, సౌదీ, జోర్డాన్ దేశాల ప్రతినిధులు హాజరు కాలేదు. గమనించవలసిన విషయమేమంటే, ఈజిప్టు, జోర్డాన్ దేశాలు మాత్రమే అరబ్బు దేశాల్లో ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందాలు చేసుకున్న దేశాలు. పాలస్తీనా ప్రయోజనాలను అణచివేసే ఈ శాంతిపథకాన్ని ఈజిప్టు, జోర్డాన్ దేశాలు ఆమోదిస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని తెలుసు. 1995లో యూద జాత్యాహంకారి ఒకడు ఇజ్రాయెల్ ప్రధాని ఇజాక్ రాబిన్‌ను హత్య చేశాడు. ఆ తర్వాతి నుంచి శాంతిప్రక్రియ ఆగిపోయింది. రాబిన్ మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన నెతన్యాహు శాంతి పథకానికి అవకాశం లేని మొండి వైఖరి ప్రదర్శిస్తూ వచ్చాడు. అప్పట్లో పాలస్తీనా నాయకుడు యాసర్ అరఫాత్, ఇజ్రాయెల్ నాయకుడు ఇజాక్ రాబిన్ ఇద్దరు వైట్ హౌస్‌లో కలుసుకుని కరచలనం చేసిన దృశ్యం ఇప్పుడు మరలా చూడడం అసాధ్యం. ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారాయి. ట్రంప్ శాంతి పథకం ఈ పరిస్థితిని మరింత చిక్కుముడి పడేలా చేస్తోంది.

New peace talks between Israel and Palestine
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News