Monday, April 29, 2024

నిరాశాజనకం

- Advertisement -
- Advertisement -

Central Budget

 

చిలకరింపుల మాదిరి కొద్దిపాటి రాయితీలు తప్పిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికిగాని, నిరుద్యోగం తగ్గడానికిగాని, మొత్తంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికిగాని ఉపయోగపడే చెప్పుకోదగిన నిర్ణయమేదీ లేని అత్యంత నిరాశాజనకమైన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించారు. గత 11 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని మాంద్యాన్ని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో పరుగులెత్తించడానికి, అధిక ధరల మంటల్లో మాడిపోతున్న ప్రజలకు ఊరట కలిగించడానికి, మంచమెక్కిన కార్ల తదితర పరిశ్రమలను కాపాడడానికి విప్లవాత్మక చర్యల ఊసు మచ్చుకైనా లేదు. ఆదాయపు పన్నుకి ప్రత్యామ్నాయ విధానం ప్రకటించిన బడ్జెట్ నికారాదాయ పన్ను చెల్లింపుదార్లను అయోమయంలోకి నెట్టివేసింది. పాత కొత్త విధానాలు రెండింటిలో దేనినైనా ఎంచుకునే స్వేచ్ఛను పన్ను చెల్లింపుదార్లకు కలిగిస్తూనే ముందు నుయ్యి వెనుక ఊబి మాదిరి పరిస్థితిలోకి వారిని నెట్టేసింది.

రిబేటు సౌకర్యం వల్ల ఏటా 5 లక్షల రూపాయలకు మించని ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు ఉంటుం ది. అంతకు మించి చెప్పుకోదగిన ప్రయోజనం లేకపోగా గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన రాబడి పన్ను చెల్లింపు ప్రత్యామ్నాయ విధానంలో తక్కువ పన్ను రేట్లు ఉంటాయి. కాని దాని వైపు మొగ్గేవారు 70 శాతం మినహాయింపులను కోల్పోవలసి ఉంటుంది. అందుచేత పాత కొత్త పద్ధతుల్లో దేనిని ఎంచుకోవాలనేది పన్ను చెల్లించే వేతన తదితర నికరాదాయ వర్గాలకు క్లిష్ట సమస్యగా మారుతుంది. ఆదాయపు పన్ను రేట్లలో మార్పు పన్ను చెల్లింపుదార్ల రాబడిని పెంచడం ఆ మేరకు వారి కొనుగోలు శక్తి పెరగడమనేవి జరగని పనులేనని ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి పెంచడమే లక్షమని చెప్పుకున్న ఆర్థిక మంత్రి ఆ వైపుగా తీసుకున్న గట్టి నిర్ణయం ఒక్కటీ లేదు.

డివిడెండ్ చెల్లింపుపై కంపెనీలకు ఇచ్చిన రాయితీ ఆ వర్గాలను పెద్దగా సంతృప్తి పరచలేదని బడ్జెట్ వెలువడగానే స్టాక్ మార్కెట్లు స్పందించిన తీరు నిరూపించింది. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక మంత్రి ప్రకటించిన రాయితీలు కూడా నామమాత్రమే. ఈ ఏడాది కేంద్రం ఆదాయం గత సంవత్సరం కంటే తక్కువగా ఉండవచ్చుననే అంచనాను ప్రకటించిన బడ్జెట్ ఆ మేరకు రాష్ట్రాలకు కేటాయింపులను తగ్గించి వాటిని నిరాశపుచ్చింది. కేంద్రం పన్ను రాబడిలో రాష్ట్రాలకిచ్చే దానిని 42 నుంచి 41 శాతానికి తగ్గించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావలసిన నిధులు దారుణంగా తగ్గిపోయాయని పట్టణాల అభివృద్ధికి కేటాయింపులలో భారీ కోత విధించారని జిఎస్‌టి చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని వ్యవసాయ రంగానికి కూడా మొండి చేయి చూపారని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యానం గమనించదగినది.

చిరకాలంగా మధ్య తరగతి ప్రజల జీవన భద్రతకు హామీగా నిలిచిన జీవిత బీమా సంస్థను ప్రైవేటుకు అప్పజెప్పే ప్రతిపాదన పిడుగుపాటు వంటిది. 150 రైళ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు రంగానికి ఇవ్వాలన్న ఆలోచన కూడా అటువంటిదే. ప్రభుత్వ ఆస్తులతో ప్రైవేటును బాగు చేసే ఉద్దేశం ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నది. పబ్లిక్ రంగ బ్యాంకులకు మూలధన సాయం కింద రూ. 3.5 లక్షల కోట్లు కేటాయించిన బడ్జెట్ వాటిని మోసగాళ్ల నుంచి, నిరర్థక ఆస్తులు పేరుకుపోడం నుంచి ఎలా కాపాడదలచిందో చెప్పలేదు. అయితే డిపాజిట్‌దార్ల సొమ్ముకు హామీగా డిపాజిట్‌లపై బీమాను లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచి వారికి కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేసింది. రుణ భారాన్ని తగ్గించామని చెప్పుకున్న ఆర్థిక మంత్రి మౌలిక సదుపాయాల రంగానికి ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా ప్రజల ఉపాధి అవకాశాలను కొనుగోలు శక్తిని మెరుగుపర్చడం గురించి ప్రస్తావించలేదు.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో కూడా ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచి ప్రజల ఆదాయాలను కొనుగోలు శక్తిని మెరుగుపరిచిన సందర్భాలున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతిష్ఠాత్మకమైన ఆదర్శప్రాయమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ నుంచి ఎటువంటి సాయం లభించకపోడం శోచనీయం. కేంద్ర ప్రభుత్వ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు అనేక పరీక్షలు నిర్వహించడానికి బదులు ఒకే పరీక్షను పెట్టడం, 150 ఉన్నత విద్యా సంస్థల్లో వివిధ వృత్తులకు సంబంధించిన అప్రంటిస్‌షిప్ ప్రధానమైన డిగ్రీ, డిప్లొమా కోర్సులు ప్రవేశపెట్టదలచడం హర్షించవలసిన నిర్ణయాలు. అక్కడక్కడా ఇటువంటి చిన్న చితక మెరుపులు తప్ప నిర్మలా సీతారామన్ బడ్జెట్ శుష్కప్రియాలు శూన్య హస్తాలుగానే రుజువు చేసుకున్నది. అపూర్వమైన ఆర్థిక సంక్షోభంలోనూ మాంద్యం, నిరుద్యోగం, అధిక ధరలు, ఆహార ద్రవ్యోల్బణంలో కూరుకుపోయిన దేశానికి ఎంతమాత్రం ఊరట కలిగించ లేదు.

Frustrating Central Budget
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News