Sunday, May 5, 2024

దేశంలో కొత్త రకం స్ట్రెయిన్‌లు: కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన

- Advertisement -
- Advertisement -

18 రాష్ట్రాల్లో కొత్త రకం స్ట్రెయిన్‌లు
ఇంతకు ముందు వాటికన్నా భిన్నంగా ఉన్నాయి
కలవర పెడుతున్న కరోనా ఉధృతి: కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన

New Strain Cases found in 18 States says Centre

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ కొత్త రకం స్ట్రెయిన్‌లు కలవరపెడుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 18 రాష్ట్రాల్లో కొత్తరకం స్ట్రెయిన్లను గుర్తించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. వీటిలో విదేశాల్లో బైటపడిన కొత్త రకాలే కాకుండా మరిన్ని స్ట్రెయిన్లు ఉన్నట్లు పేర్కొంది. అయితే పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభణకు ఈ కొత్తరకం స్ట్రెయిన్లే కారణమని తెలిపే సమాచారం మాత్రం వెల్లడి కాలేదని తెలిపింది. విదేశాల నుంచి భారత్ వస్తున్న ప్రయాణికుల్లో పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన 10,787 శాంపిళ్లను కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ఇన్సాకాగ్ (insacog) విభాగం విశ్లేషించింది. వీటిలో 736 శాంపిళ్లలో బ్రిటన్ రకం(B.1.1.7), 34 శాంపిళ్లలో దక్షిణాఫ్రికా (B.1.351), బ్రెజిల్‌కు చెందిన (P.1) రకం ఒక శాంపిల్‌లో గుర్తించినట్లు ఇన్సాకాగ్ పరిశోధనలో వెల్లడైంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ కొత్తరకాలు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా గత డిసెంబర్‌లో మహారాష్ట్రలో విశ్లేషించిన నమూనాలతో పోల్చి చూసినట్లయితే E484Q, L452R నమూనాల్లో గణనీయమైన వృద్ధి కనిపించినట్లు కేంద్రం తెలిపింది.

గతంలో గుర్తించిన మ్యుటేషన్ రకాలతో ఇవి సరిపోలడం లేదని, రోగనిరోధకతను తట్టుకొని, వైరస్ తీవ్రత పెరుగుదలకు ఇలాంటి మ్యుటేషన్లు కారణమవుతాయని కేంద్రం అభిప్రాయపడింది. దేశంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వైరస్ తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు పది జాతీయ పరిశోధనా కేంద్రాలతో కూడిన ‘ది ఇండియన్ సార్స్‌కోవ్2 కన్సార్టియం ఆన్ జినోమిక్స్’ (insacog)ని కేంద్ర ఆరోగ్య శాఖ గత ఏడాది ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దేశంలో వ్యాపిస్తున్న కొవిడ్-19 వైరస్‌లను విశ్లేషిస్తున్న ఆ కన్సార్టియం వాటి జినోమ్ సీక్వెన్సింగ్‌ను చేపడుతోంది. ఇదిలా ఉండగా మార్చి 18 నాటికి దేశంలో 400గా ఉన్న ఈ కొత్తరకం కేసులు ఈ అయిదు రోజుల వ్యవధిలో రెట్టింపు అయ్యాయి. ఒక వైపు దేశంలో కరోనా రెండోదఫా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త రకాలు మరింత వ్యాప్తిచెందడం ఆందోళనకరమైన విషయమేనని నిపుణులు అంటున్నారు. ఈ కొత్త రకాలకు వేగంగా వ్యాప్తిచెందే లక్షణం ఉండడంతో ప్రజలు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

New Strain Cases found in 18 States says Centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News