Monday, May 6, 2024

నీరవ్ మోడీ ఆటకట్టు

- Advertisement -
- Advertisement -

Nirav Modi can be extradited to India: U.K. court

భారత్‌కు అప్పగించాలని
బ్రిటన్ కోర్టు తీర్పు మనీ
లాండరింగ్ వాస్తవమే
ఆయన వాదనలన్నీ
అబద్ధాలే : కోర్టు స్పష్టీకరణ

లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్( పిఎన్‌బి)కు రూ.14 వేల కోట్లు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి అక్కడి కోర్టు షాకిచ్చింది. భారత్‌కు తిరిగి రాకుండా ఉండేందుకు నీరవ్ చేసిన ప్రయత్నాలన్నిటికీ అడ్డుపుల్ల వేసింది. మనీ లాండరింగ్ అభియోగాలన్నీ రుజువయిన నేపథ్యంలో భారత్‌కు అప్పగించాలని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సామ్యూల్ గూజీ తీర్పు వెలువరించారు. భారత్‌లో తనకు న్యాయం జరగదని, తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని నీరవ్ మోడీ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. భారత్‌కు అప్పగించినంత మాత్రాన అన్యాయం జరగదని పేర్కొంది. మానసిక పరిస్థితి సరిగా లేదన్న వాదననూ కొట్టిపారేసింది.

మనీలాండరింగ్ విషయంలో భారత్ సమర్పించిన ఆధారాలు సరిపోతాయని అభిప్రాయపడిన కోర్టు.. అతడిని భారత్‌కు అప్పగించాలని తీర్పు వెలువరించింది. తన ఉత్తర్వులపై అపీలు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. నీరవ్ చట్టబద్ధంగా వ్యాపారం చేశారనడాన్ని తాను నమ్మడం లేదని, లావాదేవీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తాను విశ్వసిస్తున్నటు ్లన్యాయమూర్తి పేర్కొన్నారు.49 ఏళ్ల నీరవ్ బోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాండ్స్‌వర్త్ జైలునుంచి న్యాయమూర్తి ఎదుట హాజరయ్యాడు.

2018 జనవరిలో పిఎన్‌బి కుంభకోణం వెలుగు చూడగా, సిబిఐ ఈ కేసు దర్యాప్తు ప్రారంభించింది. అదే ఏడాది ఇడి కూడా రంగంలోకి దిగి నీరవ్ మోడీకి చెందిన పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది.2018 డిసెంబర్‌లో నీరవ్ మోడీ తమ దేశంలో ఉన్నాడని బ్రిటన్ భారత్‌కు తెలియజేసింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది.ఈ క్రమంలో 2019 మార్చిలో నీరవ్ మోడీని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి అక్కడి వాండ్స్‌వర్త్ జైలులో ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకు బెయిలు మంజూరు చేయాలని పలు మార్లు నీరవ్ మోడీ విజ్ఞప్తి చేసినప్పటికీ కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. కాగా కోర్టు తీర్పుతో బ్రిటన్ మోడీని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అయింది. అతడిని భారత్‌కు అప్పగించే ఉత్తర్వులపై బ్రిటన్ హోం శాఖ మంత్రి సంతకం చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మంత్రి నిర్ణయం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉండవు. అయితే ఈ తీర్పుపై 14 రోజుల్లోగా మోడీ పైకోర్టుకు అపీలు చేసుకునే అవకాశం ఉన్నందున అతను ఏం చేస్తాడో వేచి చూడాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News