Sunday, April 28, 2024

ప్రగతి మాట ప్రైవేటు బాట

- Advertisement -
- Advertisement -

                                       పసలేని నిర్మల టీకా…

మొదటిసారి కాగితం లేని బడ్జెట్
వరుసగా మూడోసారి నిర్మల పద్దు
మౌలిక సదుపాయల కల్పనకు భారీగా కేటాయింపు
విదేశీ పెట్టుబడులకు గేట్టు బార్లా
2 పబ్లిక్ రంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీ ప్రైవేటు
పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా రూ.1.75లక్షల కోట్ల రాబడి లక్ష్యం

కరోనా కాటుకు విలవిలలాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చే పేరిట సోమవారం నాడు 2021-22 బడ్జెట్ రూపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వేసిన టీకా ఆశించిన ఫలితాలను ఇచ్చేదిగా కనిపించడం లేదు. సంపన్నుల కార్పొరేట్ పన్నును యథావిథిగా కొనసాగించిన నిర్మల బడ్జెట్ నికర ఆదాయ వర్గాల వ్యక్తిగత ఆదాయపు పన్నులోనూ ఎటువంటి మార్పులు చేయకుండా వేతన జీవులకు నిరాశ మిగిల్చారు. ఆర్థిక సంస్కరణల బాటలో అమితమైన జోరును కనపరిచారు. ప్రైవేటైజేషన్‌కు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ సహా అనేక వస్తువులపై వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన సెస్సును విధించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ లాంటి రాష్ట్రాలకు భారీగా వరాలు ప్రకటించారు. అలాగే గిట్టుబాటు ధర గ్యారంటీ లాంటి పలు డిమాండ్లతో గత రెండు నెలలకు పైగా ఉద్యమిస్తున్న అన్నదాతల ఆగ్రహాన్ని చల్లబరిచే చర్యలు కూడా బడ్జెట్‌లో లేక పోవడం గమనార్హం.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారితో కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే లక్షంగా కేంద్ర ఆర్థి క మంత్రి నిర్మలా సీతారామన్ దేవాభివృద్ధికి మూల స్తంభాలుగా ఉన్న ఆరు రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ ప్రతిపాదించారు. సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ చేసిన ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి మూల స్తంభాలుగా ఉన్న ఆరోగ్యం, ఆర్థిక సంస్కరణలు, ఉద్యోగ కల్పన, మూలధనం, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తూ బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆమె చెప్పారు. ఆయా రంగాలకు కేటాయింపులను కూడా భారీగానే పెంచారు. మొత్తం రూ.34,83,236 కోట్ల అంచనా వ్యయంతో 2021 22 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ప్రతిపాదించారు.అయితే ఈ కేటాయింపు లకు అవసరమైన నిధుల కోసం పెద్దగా పన్నుల భారం వేయక పోయినప్పటికీ ఐరావతంలాంటి ఎల్‌ఐసితో పాటుగా ఐడిబిఐ బ్యాంకు, ఎయిర్ ఇండియా, బిపిసిఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ లాంటి పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటాలను విక్రయించడం ద్వారా లక్షా 75 వేల కోట్లను, పెట్రోల్, డీజిల్, దిగుమతి చేసుకునే వంటనూనెలు, ఆలహాల్ లాంటి వాటిపై కొత్తగా అగ్రిసెస్ పేరుతో మరో 30 వేల కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకోవాలనుకోవడం అటు ప్రతిపక్షాలతో పాటుగా ఇటు ఆర్థిక నిపుణుల విమర్శలకు కారణమవుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ లాంటి రాష్ట్రాలకు భారీగా వరాలు ప్రకటించడం కూడా రాజకీయ దుమారానికి దారితీసే అవకాశం ఉంది. వీటన్నిటికి మించి బడ్జెట్ అనగానే తమకేమైనా కాస్తో కూస్తో ఊరట లభిస్తుందేమోనన్న ఆశగా ఎదురు చూసే వేతన జీవులకు ఈ సారి బడ్జెట్‌లో పూర్తిగా మొండి చెయ్యే చూపించారు. పన్ను రాయితీల ఊసే లేకపోగా అదనపు భారం పడేలా అగ్రిసెస్‌ను ప్రతిపాదించడం కూడా మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది.

అలాగే గిట్టుబాటు ధర గ్యారంటీ లాంటి పలు డిమాండ్లతో గత రెండు నెలలకు పైగా ఉద్యమిస్తున్న అన్నదాతల ఆగ్రహాన్ని చల్లబరిచే చర్యలు కూడా బడ్జెట్‌లో లేక పోవడం గమనార్హం. మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసా రుణాల లక్షం పెంపు లాంటివి ఆచరణలో రైతులకు పెద్దగా మేలు చేసేవి కావని అనుభవాలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి సమయంలోను గణనీయమైన వృద్ధిని సాధించి దేశ ఆర్థిక వ్యవస్థను కొంత మేరకు ఆదుకున్న వ్యవసాయ రంగానికి మరింత మేలు చేసి ఉండాల్సిందని నిపుణుల అభిప్రాయం. మొత్తంమీద పైకి చూడడానికి నిర్మలా సీతారామన్ నేల విడిచి సాము చేయకుండా ఉన్న వనరుల్లోనే మౌలిక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షించదగ్గ పరిణామమే అయినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా కుదేలయిన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేలా చేయడంలో ఆచరణలో ఎంత మేరకు ఫలితాన్ని ఇస్తాయన్నది లక్ష డాలర్ల ప్రశ్న.
ఆరోగ్య రంగానికి అగ్రపీఠం
కొవిడ్ మహమ్మారి కారణంగా దేశ ఆరోగ్య రంగం తీవ్ర ఒత్తిడికి గురైన నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో భాగంగా ఈ రంగానికి రూ. 2,23, 846 కోట్లను కేటాయించారు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే 137శాతం పెరుగుదల అని మంత్రి తన ప్రసంగంలో చెప్పారు. తద్వారా ఆరోగ్యం, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కోసమే రూ.35 వేల కోట్లను కేటాయించామని, అలాగే ‘ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ స్వాస్థ్ భారత్ యోజన’కు రూ.64 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వీటితో పాటుగా మిషన్ పోషణ, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.
మౌలిక సదుపాయాలు
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే పదేళ్లలో రూ.1.97 లక్షల కోట్లను దాదాపు 13 రంగాల్లో ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. తద్వారా ప్రపంచ సప్లై చైన్‌లో తయారీ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రానున్న మూడేళ్లలో భారీ పెట్టుబడులతో ఏడు టెక్స్‌టైల్ పార్కులను ప్రారంభిస్తామని,జాతీయ మౌలిక సదుపాయాలకల్పన కింద దాదాపు 7400 ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వీటిలో లక్ష కోట్ల విలువైన 217 ప్రాజెక్టులు పూర్తయినట్లు వెల్లడించారు. వీటితో పాటుగా గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షా 18 వేల మూలధనంతో జాతీయ రహదారుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థిక కారిడార్‌లను అభివృద్ధి చేయడంతో పాటుగా రైల్వేలలో మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు.
వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం
దేశ ఆశయాలకు అనుగుణంగా సమగ్రాభివద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగానికి తోడ్పాటును ఏటా పెంచుతున్నామని, ముఖ్యంగా పంటలకు కనీస గిట్టుబాటు ధరలను ప్రతి ఏటా పెంచుతున్నామన్నారు. వీటితో పాటుగా ప్రతి ఏటా వరి, గోదుమ, పప్పుధాన్యాల సేకరణను కూడా పెంచుతున్నామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్షాన్ని గత ఏడాద్తి పోలిస్తే 10% పెంచుతున్నామన్నారు. అనుబంధాల రంగాలు ముఖ్యంగా చేపల పెంపకంలో పెట్టుబడుల ద్వారా హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని, వలస కార్మికులు, కూలీలకు అండగా ఉండడం కోసం ‘ ఒకే దేశం ఒకే రేషన్ ’ కూడా అమలు చేస్తున్నామన్నారు.
మూలధనం పెంపు
మానవ వనరుల విభాగంలో మూలధన వ్యయం పెంచడంలో భాగంగా వారికి కావలసిన చదువు, నైపుణ్యాల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. జాతీయ విద్యావిధానం ద్వారా 15 వేల పాఠశాలలను అభివృద్ధి పరచడంతో పాటుగా వంద సైనిక్ పాఠశాలలను కూడా నెలకొల్పనున్నట్లు తెలిపారు. వీటితో పాటుగా ఉన్నత విద్య, ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమం కో సం ఏకలవ్య మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో బిజెపి పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బిజెపి ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేసింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో లక్ష కోట్లకు పైగా వ్యయంతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, అసోంలకూ బడ్జెట్‌లో ప్రాధాన్యత లభించింది.
పెరిగిన ద్రవ్య లోటు
కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై పోవడంతో దాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా వివిధ రంగాలో ఖర్చును భారీగా కొనసాగించిన కారణంగా గత ఆర్థిక సంవత్సరం ద్రవ్య లోటు ఆశించిన విధంగా కట్టడి చేయలేకపోయామని నిర్మలా సీతారామన్ స్పష్ట చేశారు.

రక్షణ భళా

దేశ రక్షణ రంగానికి 202122 బడ్జెట్‌లో రూ.4.78 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులకన్నా ఇది 19 శాతం అధికం. ఇందులో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల పింఛన్లు కూడా కలిసి ఉన్నాయి. పింఛన్లకు రూ.1.15 లక్షల కోట్లు కేటాయించారు. పింఛన్ల మొత్తం పోగా, సైనిక విభాగానికి రూ.3.62 లక్షల కోట్లు కేటాయించినట్టు. వీటిలో రూ. 1.36 లక్షల కోట్లు ఆయుధాలు, యుద్ధ విమానాలు, నౌకలు, ఇతర రక్షణ సామగ్రి కొనుగోలు కోసం పక్కకు పెట్టనున్నారు. కొత్తగా 100 సైని క పాఠశాలల ఏర్పాటుకు ఆర్థికమంత్రి ప్రతిపాదించడం పట్ల రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ రంగానికి 2020 21లో రూ.4.71 లక్షల కోట్లు కేటాయించారు.

రైల్వేకు రూ. 1.10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: 202122 బడ్జెట్‌లో రైల్వేశాఖకు 1,10,055 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.1,07,100 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు కానున్నట్టు అంచనా. కరోనా వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు గూడ్స్ రైళ్లపై రైల్వేశాఖ దృష్టి సారించిన విషయం తెలిసిందే. కరోనా కాలంలో నిత్యావసర వస్తువుల సరఫరాలో రైల్వేశాఖ అందించిన సేవలను ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ సందర్భంగా కొనియాడారు. 2030 వరకల్లా డిమాండ్‌కు తగ్గట్టు రైల్వేల సామర్థాన్ని పెంచడానికి సంబంధించి రైల్వేశాఖ రూపొందించిన జాతీయ రైల్వే ప్రణాళిక గురించి నిర్మల ప్రస్తావించారు. భవిష్యత్ అవసరాల కోసం మేకిన్ ఇండియాలో భాగంగా లాజిస్టిక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆమె తెలిపారు. దీంతో, సరుకు రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు. 2022 జూన్ వరకల్లా ఈస్టర్న్(ఇడిఎఫ్‌సి), వెస్టర్న్(డబ్లూడిఎఫ్‌సి) రవాణా కారిడార్లు ఏర్పాటు కానున్నట్టు ఆమె తెలిపారు. ఇడిఎఫ్‌సిలో భాగంగా సోనేనగర్‌గోమో సెక్షన్‌లో 263 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పిపిపి) కింద ఈ ఏడాదే ప్రారంభించనున్నట్టు ఆమె తెలిపారు. దాని తర్వాత త్వరలోనే గోమోదాన్కునీ సెక్షన్‌లో 274.3 కి.మీ. రైల్వే లైన్ పనులు ప్రారంభం కానున్నాయన్నారు.
విజయవాడకు రెండు కారిడార్లు
బెంగాల్‌లోని ఖారగ్‌పూర్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మధ్య ఈస్ట్‌కోస్ట్ కారిడార్‌ను, మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ, విజయవాడ మధ్య నార్త్‌సౌత్ కారిడార్‌ను, భూసావల్ నుంచి ఖారగ్‌పూర్,దాన్కునీకి ఈస్ట్‌వెస్ట్ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. తొలిదశలో వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డిపిఆర్)ను రూపొందించనున్నట్టు ఆర్థికమంత్రి తెలిపారు.
2023 వరకల్లా 100 శాతం విద్యుదీకరణ
2023 డిసెంబర్ వరకల్లా బ్రాడ్‌గ్వేజ్ రైల్వే లైన్‌ను 100 శాతం విద్యుదీకరించాలని లక్షంగా నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి తెలిపారు. ఇది 46,000 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఇం దులో 41,548 కిలోమీటర్ల మేర 2021 చివరికల్లా విద్యుతీకరణ పూర్తి కానున్నది. అంటే నిర్దేశించుకున్న లక్షంలో ఇది 72 శాతం. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలపై రైల్వేశాఖ దృష్టి సారించిందని ఆర్థికమంత్రి అన్నారు. అందులో భాగంగానే పర్యాటక మార్గాల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అధునాతన విస్టాడోమ్ ఎల్‌హెచ్‌బి కోచ్‌లను ప్రవేశపెట్టనున్నట్టు ఆమె తెలిపారు. ఎక్కువ రద్దీ, వినియోగం ఉన్న మా ర్గాల్లో ప్రయాణికుల భద్రత కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన ‘యాంటీ కొలిజన్ సిస్టమ్’ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం గత కొన్నేళ్లుగా రైల్వేశాఖ చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు.

హోంశాఖకు రూ.1.66 లక్షల కోట్లు
జనాభా లెక్కలకు రూ.3700 కోట్లు
కేంద్ర హోంశాఖకు ఈ బడ్జెట్‌లో రూ.1,66,546.94 కోట్లు కేటాయించారు. వీటిలో 1,03,802.62 కోట్లు సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్, సిఐఎస్‌ఎఫ్ దళాల కోసం ఖర్చు చేయనున్నారు. 2021 జనాభా లెక్కల కోసం రూ.3768.28 కోట్లను కేటాయించారు. హోంశాఖకు కేటాయించినవాటిలో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్‌కు రూ.30,757 కోట్లు, లడఖ్‌కు రూ.5,958 కోట్లు కేటాయించారు.
రోదసీ విభాగానికి రూ.13,949 కోట్లు
రోదసీ విభాగానికి ఈ బడ్జెట్‌లో రూ.13,949.09 కోట్లు కేటాయించారు. 202021 బడ్జెట్ కేటాయింపులకన్నా ఇది రూ.4449 కోట్లు అధికం. గత బడ్జెట్‌లో మొదట రూ.13,479.47 కోట్లు కేటాయించి, ఆ తర్వాత రూ.9500 కోట్లకు సవరించారు. 201920 బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.13,017.61 కోట్లు కేటాయించారు.
సిబిఐకి రూ.835 కోట్లు
కేంద్ర దర్యాప్తు విభాగానికి రూ.835.39 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో సిబిఐకి రూ.835.75 కోట్లు కేటాయించారు. ఈసారి ఈ మొత్తాన్ని స్వల్పంగా తగ్గించారు. గతేడాది సిబిఐ ఆధ్వర్యంలో రూ.67,000 కోట్ల బ్యాంక్ మోసాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.
సిబ్బంది శిక్షణకు రూ. 257 కోట్లు
కేంద్ర వ్యక్తిగత సిబ్బంది, శిక్షణ విభాగానికి రూ.257.35 కోట్లు కేటాయించారు. ఉన్నతాధికారుల శిక్షణ, ప్రాథమిక వసతుల కల్పనకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఇందులో రూ.178.32 కోట్లను ముస్సోరీలోని నేషనల్ అకాడమీ, ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్‌మెంట్, తదితర శిక్షణ సంస్థల్లో వసతుల మెరుగుదలకు ఖర్చు చేయనున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కోసం పరీక్షలు నిర్వహించే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌కు రూ.382.59 కోట్లు కేటాయించారు.
జల్‌జీవన్ మిషన్‌కు రూ.2.87 లక్షల కోట్లు
పట్టణ ప్రాంతాల్లో జల్‌జీవన్ మిషన్ ద్వారా 2.86 కోట్ల కుటుంబాలకు ట్యాప్ వాటర్ కనెక్షన్ల కోసం రూ.2,87,000 కోట్లు కేటాయించారు. ఐదేళ్ల కాలంలో ఈ లక్షాన్ని సాధించాలని నిర్దేశించారు. దేశంలోని 4,378 పట్టణాల్లోని స్థానిక సంస్థలకు ఈ నిధుల్ని కేటాయిస్తారు. ఇందులో 500 అమృత్ నగరాలు కూడా ఉన్నాయి. ఈ నగరాల్లో ఐదేళ్ల కాలానికి లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కోసం ఈ నిధుల్లోంచి కొంత ఖర్చు చేయనున్నారు. జల్‌జీవన్ మిషన్‌ను 2019లో ఏర్పాటు చేశారు. 2024 వరకల్లా గ్రామీణ ప్రాంతాల్లో ట్యాప్ వాటర్ కనెక్షన్ల కోసం దీనిని ప్రారంభించారు. ఇప్పటివరకు మూడు కోట్ల ట్యాప్ కనెక్షన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ పథకాన్ని పట్టణాలకు విస్తరిస్తున్నారు.

Nirmala Sitharaman presents Union Budget 2021-22

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News