Monday, April 29, 2024

జిమ్నాస్టిక్స్‌లో రాణిస్తున్న తెలంగాణ క్రీడాకారిణి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జిమ్నాస్టిక్స్ క్రీడల్లో తెలంగాణ మహిళా క్రీడామణలు రాణిస్తున్నారు. పలు బంగారు పతకాలు సాధించి రాష్ట్రం తద్వార దేశం పేరుతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్నారు. ఇటీవల ఈజిప్టులోని కైరోలో జరిగిన 3వ ఫారోస్ కప్‌లో టేబుల్ వాల్ట్ -జిమ్నాస్టిక్స్ క్రీడలలో హైదరాబాద్‌కు చెందిన నిష్కా అగర్వాల్ బంగారు పతకం సాధించడం ద్వారా జిమ్నాస్టిక్స్‌లో ప్రపంచంలో ఎదుగుతున్న స్టార్ క్రీడాకారిణిగా గౌరవం అందుకుంది. హైదరాబాద్‌కు చెందిన అతిపిన్న వయస్కురాలైన నిష్కా అగర్వాల్‌ను ప్రతి ఒక్కరు ప్రశంసల వర్గం కురిపించడం విశేషం. పదో తరగతి చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన ఈ అమ్మాయి పలు బంగారు పతకాలను సాధిస్తూ తెలంగాణ క్రీడాకారిణిగా మంచి పేరుతెచ్చుకుంటోంది. రానున్న రోజుల్లో ఒలింపిక్స్‌లో వరల్డ్ కప్‌ను సాధించాలన్నది తన ఆశయమని నిష్కా అగర్వాల్ ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఉత్కంఠభరితమైన టేబుల్ వాల్ట్ ఈవెంట్‌లో ప్రతిష్టాత్మకమైన స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం మామూలు విషయం కాదని, తన కోచ్ మనోజ్ రానా చూపిన బాటలో ఆడుతూ స్టేడియంలోని ప్రేక్షకులను, తోటి అథ్లెట్లను మెప్పించానన్నారు. జిమ్నాస్టిక్ కీర్తి వైపు 7 సంవత్సరాల వయస్సులోలో తన ప్రయాణం ప్రారంభమైందని, కోచ్ మనోజ్ రానా యొక్క నైపుణ్యమైన కోచింగ్ ద్వారా ఇప్పటికే సుమారు 20 వరకు బంగారు, వెండి పతకాలను ఈ జిమ్మాస్టిక్స్‌లో సాధించానన్నారు. వారి మార్గనిర్దేశంలో ఆడుతూ భవిష్యత్తులో తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ , తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ తదితర సంస్థల సహకారంతో తెలంగాణకు మరింత మంచి పేరుతేవాలన్నదే తన లక్షం అని నిష్కా అగర్వాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు, శాట్స్ అధికారులకు మరీ ముఖ్యంగా కోచ్ మనోజ్ రానాకు ధన్యవాదములు తెలియజేస్తున్నానన్నారు.

కిందటి ఏడాది కేరళలో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించడం ద్వారా జాతీయ వేదికపై తన ఉనికిని అంతర్జాతీయ స్థాయిలో చాటుతున్నట్లు తెలిపారు.ఈ గెలుపు తనను 3వ ఫారోస్ కప్‌లో గ్లోబల్ స్పాట్‌లైట్‌కి బాట చూపిందన్నారు. నిష్కా అగర్వాల్ కోచ్ మనోజ్ రానా మాట్లాడుతూ నిష్కా అగర్వాల్ ఒక యువ ఔత్సాహికురాలి నుండి గ్లోబల్ గోల్డ్ మెడలిస్ట్ వరకు ఎదిగిందని, ఈ అమ్మాయికి జిమ్మాస్టిక్స్‌లో ఎంతో భవిష్యత్తు ఉందని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోందని, ఇంకా ఎన్నో బంగారు పతకాలు సాధించి నిష్కా అగర్వాల్ తెలంగాణ పేరును జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలపాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News