Friday, April 26, 2024

నితీష్ వైఖరితో బిజెపి కలవరం!

- Advertisement -
- Advertisement -

Nitish

పాట్నా: బీహార్‌లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన బిజెపి నిశితంగా గమనిస్తోంది. రెండు రోజుల్లో ప్రతిపక్ష ఆర్‌జెడి నాయకుడు తేజస్వి యాదవ్‌తో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండో సారి సమావేశం కావడం బిజెపిని కలవరపెడుతోంది. గురువారం అసెంబ్లీ స్పీకర్ విజయ్ చౌదరి కార్యాలయంలో ముఖ్యమంత్రితో తేజస్వి భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక సందర్శనగా తేజస్వి అభివర్ణిస్తున్నప్పటికీ దీని వెనుక తెరచాటు మంత్రాంగమేదో ఉందని బిజెపి అనుమానిస్తోంది.

నితీష్, తేజస్వి మధ్య భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది తెలియరానప్పటికీ తేజస్వి మాత్రం ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం మాత్రం చేశారు. అమిత్ షాను అరవింద్ కేజ్రీవాల్ కలవగా లేంది తాను నితీష్‌జీని కలిస్తే తప్పేంటని ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. తాను మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిశానని, ఇందులో వేరే అంతరార్థం వెతకవద్దని ఆయన కోరారు. దాదాపు మూడేళ్ల అనంతరం నితీష్, తేజస్వి మధ్య మొదటిసారి సమావేశం గత మంగళవారం నితీష్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించిన రోజున ముఖ్యమంత్రి ఛాంబర్‌లో జరిగింది. ఈ భేటీతో మళ్లీ నితీష్ తన పాత దోస్తీని సమీప భవిష్యత్తులో పునరుద్ధరించుకుంటారన్న ఊహాగానాలకు ఊతమిచ్చినట్లయింది.

అయితే జెడియు, ఆర్‌జెడి మధ్య పొత్తు సాధ్యం కాదని ఆర్‌జెడి వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఆ అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతోంది. నితీష్ కుమార్ లౌకిక వైఖరిని ఎవరం ప్రశ్నించలేమని, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన తొలి ఎన్‌డిఎ రాష్ట్ర ప్రభుత్వం బీహార్ అని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే అవధేష్ సింగ్ చెప్పారు. ఆయన 2017 వరకు ఆర్‌జెడి, జెడియు, కాంగ్రెస్ మహాకూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కాగా, కాంగ్రెస్ నేతల ప్రకటనలు బిజెపి ఎమ్మెల్యేలలో కలవరం పుట్టిస్తున్నాయి.

అసెంబ్లీలో ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదిస్తున్న విషయం తమకు చివరి నిమిషం వరకు తెలియదని బిజెపి ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను ప్రధాన ఎన్నికల నినాదం చేసుకోనున్న బిజెపికి నితీష్ తీసుకున్న వైఖరి మింగుడుపడడం లేదు. రానున్న రోజుల్లో నితీష్ మళ్లీ మహాకూటమి పంచన చేరతారా అన్నది వేచి చూడాల్సిందే.

 

Nitish moves gave anxious movements to BJP, BJP worried over meeting between Nitish and Tejaswi Yadav

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News