Saturday, April 27, 2024

మన స్పోర్ట్స్ అకాడమీలు ఆదర్శంగా నిలవాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న క్రీడా అకాడమీలు స్పోర్ట్ స్కూళ్ల పని తీరు మెరుగుపడటానికి నిరంతర పర్యవేక్షణ అవసరం ఉందని, పతకాలు (మెడల్స్ ) సాధించే ప్రాంగణాలుగా అకాడమీలను తీర్చిదిద్దాలని స్పోర్ట్స్అథారిటి ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. ఎల్‌బి స్టేడియంలో తన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్ స్కూళ్లు దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచి, క్రీడల్లో కాకుండా విద్యాపరంగా కూడా మంచి ఫలితాలు సాధించే సంస్థలుగా తీర్చి దిద్దాలని ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్దేశనం, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచనలను అనుసరిస్తూ అకాడమీలు, స్పోర్ట్స్ స్కూళ్ల పనితీరు, మెరుగుదలకు నిరంతర పర్యవేక్షణతో పాటు పారదర్శక విధానాలతో ముందుకు వెళ్లాలని ఛైర్మన్ అధికారులకు సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడారంగ మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలని ఆయన అన్నారు. మూసధోరణి వీడి సిఎం కెసిఆర్ స్ఫూర్తితో నూతన దృక్పదాన్ని అలవరుచుకుంటూ, అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా నూతన బోధన శిక్షణ విధానాలను అలవర్చుకోవాలని అకాడమీలు,స్పోర్ట్ స్కూళ్ల అధికారాలను ఆదేశించారు. కాగా అకాడమీలు, స్పోర్ట్ స్కూళ్లలో క్రీడాకారుల ఎంపికకు వివిధ రంగ నిష్ణాతులు, అనుభవజ్ఞులచే ‘సెలక్షన్ కమిటి’ ఉండాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

అకాడమీలు స్పోర్ట్స్ స్కూళ్ల విద్యార్ధిని విద్యార్ధులకు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని ప్రతి విద్యార్ధి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని, డైట్ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఛైర్మన్ ఆదేశించారు. అకాడమీలలో అవసరమైన క్రీడా సామాగ్రి అందుబాటులో ఉండాలని, శిక్షణ విషయంలో ఎటువంటి అలసత్వం ఉండరాదని, ఎక్కడైనా కోచ్‌ల కొరత, సామాగ్రి కొరత ఉంటే వెంటనే అధికారులు దృష్టికి తీసుకురావాలని ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ ఆదేశించారు. ప్రతి అకాడమి స్పోర్ట్స్ స్కూళ్లలో దీర్ఘకాలిక , స్వల్పకాలిక లక్ష్యాలను నిర్ధేశించుకొని నిరంతరంగా సమీక్షించుకోవాలని, ఆయా అకాడమిల్లో క్రీడాకారుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించాలని ఆయన సూచించారు. రెండురోజుల సమావేశంలో వ్యక్తమైన వివిధ అభిప్రాయాలు చర్చకు వచ్చిన అంశాలన్ని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు చేపడతామని ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ వెల్లడించారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ అథారిటి ఓఎస్‌డి, ఐఏఎస్ డా. కె. లక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి, స్పోర్ట్ స్కూల్ ప్రత్యేక అధికారి డా. హరికృష్ణ, ఛైర్మన్ ఓఎస్‌డి కె.నర్సయ్య, స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్‌కె. బోస్, అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్, కరీంనగర్ డివైఎస్‌ఓ రాజవీరు, ఆదిలాబాద్ డివైఎస్‌ఓ వెంకటేశ్వర్ రావు, వనపర్తి డివైఎస్‌ఓ టి.సుధీర్ కుమార్ ఇంకా వివిధ అకాడమీల స్పోర్ట్స్ స్కూళ్ల అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News