Friday, April 26, 2024

ఇమ్రాన్ అరెస్టు!

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్‌లో ప్రధానులు, మాజీ ప్రధానులపై సైన్యం కక్షకట్టి పగ సాధింపుకి పాల్పడడం కొత్త కాదు. అయితే తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై దాని కసి, అక్కసు ఏకపక్షంగా, అప్రతిహతంగా రుజువయ్యే సూచనలు కనిపించడం లేదు. మంగళవారం నాడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టు సందర్భంగా దేశమంతటా చెలరేగిన హింసాకాండను గమనిస్తే ముందు వెనుకలు, మంచి చెడ్డలు చూడకుండా సైన్యం ఇష్టావిలాసంగా వ్యవహరించడాన్ని ప్రజలు ఆమోదించదలచుకోలేదని బోధపడుతున్నది. ఇమ్రాన్ తనపై గల కొన్ని కేసుల్లో హాజరు కావాలని వచ్చిన సందర్భంగా ఇస్లామాబాద్‌లోని హైకోర్టు ఆవరణలో పేరా మిలిటరీ రేంజర్లు ఆయనను కాలరు పట్టుకొని బలవంతంగా తీసుకు వెళ్ళిన తీరు ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీకె ఇనాఫ్ (పిటిఐ) కార్యకర్తలను కోపోద్రిక్తులను చేసింది. దేశమంతటా వారు రెచ్చిపోయి సృష్టించిన విధ్వంసకాండ అసాధారణ స్థాయిలో వుంది. రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయంలోకి కూడా నిరసనకారులు దూసుకుపోయారు.

లాహోర్‌లో సైనిక విభాగాధిపతి ఇంటిపై మూకలు దాడి చేశాయి. ఇమ్రాన్ ఖాన్ నివాసముంటున్న లాహోర్ నగరంలో నిరసనాగులు మిన్నంటడంతో ఆ నగరానికి మిగతా దేశంతో సంబంధాలు తెంచివేశారని వార్తలు చెబుతున్నాయి. మొత్తం మీద అల్లర్లలో నలుగురు మరణించారని, 30 మంది గాయపడ్డారని సమాచారం. 1000 మంది పిటిఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. పాక్ ప్రజల ఆరాధ్య మాజీ క్రికెటర్, 70 ఏళ్ళ ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది ప్రధానిగా పదవీచ్యుతుడయ్యారు. అప్పటి నుంచి సైన్యంపై విమర్శలు గుప్పిస్తూ దానికి అలవికాని నేతగా కొనసాగుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటి వరకు అరెస్టుకు గురైన ఏడవ పాక్ ప్రధాని. ఇమ్రాన్ అరెస్టుతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య హోరాహోరీ ఘర్షణల నేపథ్యంలో పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ అధికార్లు ట్విట్టర్ సహా మొత్తం సామాజిక మాధ్యమాన్ని నిషేధించారు.

బుధవారం నాడు ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు 8 రోజుల పోలీసు నిర్బంధాన్ని విధించింది. ఖాన్‌పై వందకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక అత్యంత ఖరీదైన చేతివాచి సహా తనకు వచ్చిన బహుమతులన్నింటినీ ఖజానా (తోషా ఖానా) నుంచి తీసుకొని అమిత లాభాలకు అమ్ముకొన్నాడన్న కేసు కూడా అందులో ఒకటి. నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో అనే సంస్థ ఇమ్రాన్‌పై ఈ అవినీతి కేసులను దాఖలు చేసింది. గతంలో ఇమ్రాన్ ప్రధానిగా వుండగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కూడా ఈ సంస్థే అవినీతి కేసులో అరెస్టు చేసింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు, ఆయన కుమార్తెకు కూడా ఈ సంస్థే శిక్ష విధింపచేసింది. 50 బిలియన్ రూపాయల అక్రమ సంపాదనను క్రమబద్ధం చేసినందుకు ఒక వ్యక్తి వద్ద నుంచి 5 బిలియన్ రూపాయల లంచం తీసుకున్నారన్న కేసులో ఇప్పుడు అకౌంటబులిటీ సంస్థ ఇమ్రాన్‌ను అరెస్టు చేసినట్టు ఇస్లామాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇదంతా బయటకు కనిపిస్తున్న దృశ్యం కాగా, పాక్ సైన్యం గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) ఉన్నతాధికారి జనరల్ ఫైజల్ నసీర్‌తో పేచీయే ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు దారి తీసిందని తెలుస్తున్నది.

ఇమ్రాన్ ఖాన్ గత శనివారం నాడు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ జనరల్ ఫైజర్ నసీర్ తనను హత్య చేయించడానికి కుట్ర పన్నినట్టు మరోసారి ఆరోపించారు. గత నవంబర్‌లో పంజాబ్ రాష్ట్రంలోని వజీరాబాద్‌లో ప్రధాని షరీఫ్, హోం మంత్రి సనావుల్లా తో కలిసి జనరల్ నసీర్ తనను హత్య చేయించడానికి ప్రయత్నించారని, అప్పుడు తన కాలిలో మూడు బుల్లెట్లు దిగబడ్డాయని ఇమ్రాన్ ఖాన్ ఇంతకు ముందు ఆరోపించి వున్నారు. అయితే ఖాన్ అనవసరంగా సైన్యంపై బురద చల్లుతున్నారని ప్రధాని షహబాజ్ షరీఫ్ తాజాగా ప్రత్యారోపణ చేశారు.అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఇమ్రాన్ సైన్యాన్ని వీధిలోకి లాగుతున్నారని ప్రధాని షహబాజ్ అంటున్నారు.

దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సీనియర్ జర్నలిస్టు అర్షాద్ షరీఫ్‌ను గత అక్టోబర్‌లో కెన్యా లో హతమార్చిన ఘటన వెనుక కూడా సైన్యం హస్తం వుందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అర్షాద్ తరచూ సైన్యాన్ని విమర్శిస్తూ వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ స్వచ్ఛమైన వ్యక్తి అయి వుండక పోవచ్చు. కాని అప్రతిష్ఠపాలైన సైన్యంపై ఆయన చేస్తున్న పోరాటానికి ప్రజల అండదండలు లభిస్తే అది పాకిస్తాన్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర లేపవచ్చు. ఈ ఏడాదిలో పాక్ పార్లమెంటుకు ఎన్నికలు జరగాల్సి వుంది. ఆలోగా ఇమ్రాన్‌ను జైలుకు పంపించాలని సైన్యం చూస్తున్నది. ప్రజలు ఇమ్రాన్‌కు ఏమేరకు వెన్నుదన్నుగా కొనసాగుతారో చూడాలి. ఏమైనప్పటికీ అంతిమంగా పాక్‌పై సైనిక ఉక్కు పాదం తొలగి ప్రజాస్వామ్యం నెగ్గితే హర్షించాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News