Sunday, April 28, 2024

పాక్ ప్రధాని చర్చల మాట

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్ళీ చర్చల ఊసు తెచ్చారు. ఇండియా పేరెత్తకుండా పొరుగు దేశమంటూ ఈ ప్రస్తావన చేశారు. రెండు దేశాల మధ్య గల తీవ్ర వివాదాస్పద సమస్యలను శాంతియుతమైన, అర్థవంతమైన చర్చల ద్వారా పరిష్కరించుకోలేకపోతే అవి మామూలు పొరుగు దేశాలు కాబోవని షెహబాజ్ ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ అన్నారు. పాక్‌లో ఎన్నికలు అతి చేరువలోనే వున్నాయి. అందుకోసం షెహబాజ్ ప్రభుత్వం ఈ నెలలోనే రద్దు కానున్నది. ఈ ఎన్నికల్లో పాలక పక్షానికి ఇమ్రాన్‌ఖాన్ అతి పెద్ద సవాలు కానున్నాడు. ఇటువంటి నేపథ్యంలో షెహబాజ్ మరొకసారి చర్చల ప్రతిపాదన చేయడం విశేషం. ఆరు మాసాల క్రితం ఆయన సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ అల్ అరేబియా వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మొదటిసారి ఇండియాతో చర్చల ప్రతిపాదన చేశారు. ఈసారి యుద్ధం వల్ల కలిగే అనర్థాల గురించి ఆయన వివరంగా పేర్కొన్నారు.

రెండు దేశాలకూ యుద్ధం ప్రత్యామ్నాయం కాబోదని, అణు యుద్ధమే వస్తే ఎవరూ బతకరని కూడా అన్నారు. పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం, అయితే మేము ఎవరి మీదనో ప్రయోగించడానికి అణ్వాయుధాలను సమకూర్చుకోలేదు. ఆత్మరక్షణ కోసం మాత్రమే వాటిని తయారు చేసుకొన్నాము. 75 ఏళ్ళలో మూడు యుద్ధాలు జరిగాయి, వాటి వల్ల పేదరికం, నిరుద్యోగం మరింతగా ప్రబలాయి. విద్యకి, ఆరోగ్యానికి, జనహితానికి అవసరమైన డబ్బు కూడా కరవైంది. నేను ఈ విషయాన్ని అత్యంత నిజాయితీతో చెబుతున్నాను అని షెహబాజ్ అన్నారు. ఆయన మాటల్లో అసత్యమేమీ లేదు. అయితే పాక్ ఈ రోజున అత్యంత ఆర్థిక సంక్షోభంలో కూరుకొని వున్నది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. విదేశీ ద్రవ్య నిల్వలు అడుగంటిపోయాయి. ఐఎంఎఫ్ నుంచి రుణాన్ని అత్యంత కష్టంగా సాధించుకొన్నది. ఈ నేపథ్యంలో షెహబాజ్ చర్చల అవసరాన్ని ఎప్పటి కంటే ఎక్కువగా గుర్తించడం అర్థం చేసుకోదగినదే. ఏ పరిస్థితుల్లోనైనా యుద్ధం వద్దు, శాంతియుత సహజీవనమే ముద్దు అని ఏ దేశాధినేత అనుకొన్నా అది స్వాగతించవలసిందే. ప్రపంచ శాంతికి ఎంతో ఉపయుక్తమయ్యేదే. అయితే షెహబాజ్ చెప్పిన తీవ్ర సమస్యల్లో కశ్మీర్ అతి ముఖ్యమైనది.

అలాగే టెర్రరిజం సమస్య కూడా కీలకమైనదే. పాక్ వైపు నుంచి వచ్చి జమ్మూ కశ్మీర్‌లో మృత్యు దాడులు చేస్తున్న టెర్రరిస్టులు అసంఖ్యాకంగా వున్నారు. చర్చలు జరపాలని రెండు దేశాలు నిర్ణయించుకొన్నప్పుడెల్లా వారు రంగంలోకి దిగి చెప్పనలవికాని మారణ కాండను సృష్టిస్తుంటారు. పాకిస్తాన్‌లోనే సురక్షిత శిబిరాలు ఏర్పాటు చేసుకొని వారు మన దేశంలో ప్రవేశిస్తున్నారని ఇండియా గట్టిగా భావిస్తున్నది. బొంబాయిలో బాంబు పేలుళ్ళ వంటివి ఇప్పటికెన్నో జరిపించారు. ఆ సమస్యకు పరిష్కారం చూపించవలసిన బాధ్యత పాకిస్తాన్‌దేనని భారత ప్రభుత్వం పదేపదే చెబుతున్నది. 2008లో ముంబైపై టెర్రరిస్టులు విరుచుకుపడినప్పటి నుంచి భారత్, పాకిస్తాన్‌ల మధ్య చెప్పుకోదగిన స్థాయి చర్చలు జరగలేదని కూడా షెహబాజ్ అన్నారు. షెహబాజ్ ఈ ప్రసంగం చేసిన సభకు పాకిస్తాన్ సైన్యాధినేత జనరల్ ఆసిమ్ మునీర్ కూడా హాజరయ్యారు. అలాగే అనేక దేశాల రాయబారులూ వున్నారు.

జమ్మూ కశ్మీర్ పరిస్థితి రెండు దేశాలనూ మరింత దూరం చేస్తున్నది. పాకిస్తాన్‌లో స్థావరాలు ఏర్పరచుకొన్న జైష్ మొహ్మమద్ వంటి టెర్రరిస్టు సంస్థలు కశ్మీర్‌లో సృష్టిస్తున్న మారణ హోమం అసాధారణమైనది. 2019లో పుల్వామా వద్ద ఉగ్రవాదులు సిఆర్‌పిఎఫ్ వాహన శ్రేణిపై బాంబు దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకొన్న దారుణ ఘటన తెలిసిందే. షెహబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానిగా వున్నప్పుడు ప్రధాని మోడీ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి గట్టిగానే ప్రయత్నించారు. 2015లో ప్రధాని మోడీ రష్యా నుంచి తిరిగి వస్తూ ఆకస్మికంగా లాహోర్‌లో దిగి నవాజ్ షరీఫ్‌ను కలిశారు.1999 ఫిబ్రవరిలో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ లాహోర్‌కు బస్సు యాత్ర జరిపారు.

అంతకు ముందు సంవత్సరం కొలంబోలో జరిగిన సార్క్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో భారత, పాకిస్తాన్ల మధ్య పరస్పర విశ్వాస కల్పన చర్యల అవసరం గురించి ప్రస్తావనకు రావడం ఆ మేరకు వాజ్‌పేయీ లాహోర్ బస్సు యాత్రకు వెళ్ళడం జరిగాయి. ఆ తర్వాతే కార్గిల్ యుద్ధం జరిగింది.ఆ యుద్ధంలో ఇండియా గెలిచింది.ఆ తర్వాత ఢిల్లీ కఠ్మండ్ ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్ చేశారు. అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ టెర్రరిస్టులు కోరిన విధంగా వారి సహచరుడు, కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజర్‌ను విడుదల చేశారు. ఈ విధంగా రెండు దేశాల మధ్య రక్తం పారుతూనే వుంది. దీని మూలాల్లోకి వెళ్ళకుండా పాకిస్తాన్ చర్చల ప్రతిపాదన ఆచరణ రూపం ధరించడం కష్టం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News