Friday, April 26, 2024

ఆధార్, ఓటరు ఐడి అనుసంధానం బిల్లుకు పార్లమెంట్ ఓకే

- Advertisement -
- Advertisement -

Parliament approves Bill on Aadhaar-voter ID linking

విపక్షాల వాకౌట్ మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం

న్యూఢిల్లీ: బోగస్ ఓట్లను నిరోధించడం కోసం ఆధార్‌తో ఓటర్ల జాబితా డేటాను అనుసంధానం చేయడానికి ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. లోక్‌సభ సోమవారం ఆమోదించిన ఈ బిల్లుకు మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరుతూ తాము ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినందున బిల్లుపై ఓటింగ్ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే వారి డిమాండ్‌ను మూజువాణి ఓటుతో తిరస్కరించారు. ఓటింగ్ చేపట్టడానికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరిక్ ఒబ్రియాన్ నిబంధనలు ఉటంకించారు. ఓటింగ్ చేపట్టడానికి వీలుగా విపక్ష సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవలసిందిగా డిప్యూటీ చైర్మన్ కోరారు. అయితే విపక్ష సభ్యులు వెల్‌లో నినాదాలు కొనసాగించారు. ఒబ్రియాన్ కోపంతో రూల్‌బుక్‌ను అధికారులు కూర్చుని ఉన్న టేబుల్‌పైకి విసిరేసి వాకౌట్ చేశారు. అయితే అధికార పక్ష సభ్యులు ఆయన ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా కాంగ్రెస్, టిఎంసి, వామపక్షాలు, డిఎంకె, ఎన్‌సిపిలకు చెందిన సభ్యులు వాకౌట్ చేశారు.

అయితే బిజెపి, జెడి(యు), వైఎప్‌ఆర్ సిపి, అన్నా డిఎంకె, బిజెడి,టిఎంసిఎం సభ్యులు బిల్లును సమర్థించారు. అంతకు ముందు కాంగ్రెస్, టిఎంసి, సిపిఐ, సిపిఎం, డిఎంకె, సమాజ్‌వాది పార్టీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ, గోప్యతకు సంబంధించి ఓటరుకున్న హక్కును ఈ బిల్లు హరిస్తుంని ఆరోపించారు. అయితే వారి ఆరోపణలను న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు తోసిపుచ్చారు. ఈ చట్టం వల్ల దేశంలో బోగస్, నకిలీ ఓట్లను ఏరివేయడానికి తోడ్పడుతుందని, ఎన్నికల ప్రక్రియను అర్థవంతం చేస్తుందని ఆయన అన్నారు. బిల్లుపై ప్రతిపక్షాల భయాలు అర్థం లేనివని మంత్రి అంటూ, వ్యక్తిగత స్వేచ్ఛపై సుప్రీంకోర్టు తీర్పుకు విపక్షాలు తప్పుడు భాష్యం చేబుతున్నాయని మంత్రి అన్నారు.

బహుళ ఓటు నమోదు సమస్య పరిష్కారం
ఆధార్‌తో ఓటర్ల జాబితా లింక్‌పై ప్రభుత్వ వర్గాల వివరణ

న్యూఢిల్లీ: ఆధార్‌తో ఓటర్ల జాబితా అనుసంధానం చేయడానికి ఉద్దేశించిన బిల్లుపై ప్రతిపక్షాలు విమర్శలుపెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ బిల్లు ఒకే వ్యక్తి ఒకటికన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేసుకోవడం అనే ప్రధాన సమస్యను పరిష్కరిస్తుందని, ఓటర్ల జాబితాను చాలా వరకు ప్రక్షాళన చేస్తుందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం స్పష్టం చేశాయి. ఈ బిల్లును సార్లమెంటు స్థాయీ సంఘానికి పంపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ మధ్య స్వల్ప చర్చ అనంతరం లోక్‌సభ సోమవారం ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం ఈ వివరణ ఇవ్వడం గమనార్హం. చాలా కాలంగా చర్చిస్తున్న వివిధ ఎన్నికల సంస్కరణలను ఈ బిల్లులో చేర్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, వివిధ ఎన్నికల సంస్కరణలపై గుర్తింపు పొందిన అన్నిజాతీయ, ప్రాంతీయ రాజకీయ పక్షాలతో చర్చల అనంతరం ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటనను కూడా ఆ వర్గాలు తమ వివరణతో పాటుగా పంచుకున్నాయి.

‘ఎన్నికల జాబితాలను మరింత మెరుగ్గా నిర్వహించడం కోసం ఎన్నికల జాబితాల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని రాజకీయ పార్టీలు కమిషన్‌ను కోరాయి’ అని ఆ ప్రకటనలో ఇసి పేర్కొంది. సాధారణంగా ఓటరుగా నమోదు చేయడానికి అర్హుడైన వ్యక్తి చేసుకున్న దరఖాస్తు ఆధారంగా ఓటరు జాబితాలో ఆ వ్యక్తి పేరును రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకునే వ్యక్తి దరఖాస్తుతో పాటుగా తన ఐడెంటిటీ కోసం స్వచ్ఛందంగా ఆధార్ నంబరు వివరాలు ఇవ్వడానికి ఈ బిల్లులో ఒక నిబంధన ఉంది. అయితే ఆధార్ నంబర్ ఇవ్వలేదన్న కారణంగా ఏ దరఖాస్తును తిరస్కరించడం జరగదని ఆ వర్గాలు తెలిపాయి. ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల ఒకే వ్యక్తి పలు చోట్లు ఓటరుగా నమోదు చేసుకోవడం అనే ప్రధాన సమస్య పరిష్కారం అవుతుందని ఆ వర్గాలు తెలిపాయి. ఓటర్లు తరచూ తమ నివాసాలను మార్చడం, పాత ఓటును తొలగించకుండా కొత్త చోట ఓటరుగా నమోదు చేసుకోవడం కారణంగా ఈ సమస్య వస్తుంది. అందువల్ల ఒకే వ్యక్తి పేరు ఒకటికన్నా ఎక్కువ చోట్ల కనిపిస్తే ఆ పేర్లను తొలగించడం జరుగుతుంటుంది.

అయితే ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఒక వ్యక్తి కొత్తగా ఓటరుగా నమోదు కావడం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఓటర్ల జాబితా నమోదు సిస్టమ్‌ను తక్షణం అలర్ట్ చేస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. దీనివల్ల ఓటర్ల జాబితాను చాలా వరకు ప్రక్షాళన చేయడంతో పాటుగా ఓటరు సాధారణంగా తాను ఎక్కడ నివసిస్తున్నాడో ఆ ప్రాంతంలోనే ఓటరుగా నమోదు చేసుకోవడానికి వీలు కలుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News