Friday, April 26, 2024

పార్ల’మంట’

- Advertisement -
- Advertisement -

వ్యవసాయ చట్టాలు, చమురు ధరలు తదితర సమస్యలపై ఉభయసభల్లో వెల్‌లోకి దూసుకెళ్లిన విపక్షాలు
ముందుగా కొత్త మంత్రులను సభలకు పరిచయం చేయనివ్వాలని విజ్ఞప్తి చేసిన ప్రధాని
ప్రతిపక్షాల వైఖరిపై మండిపాటు, సభాసంప్రదాయాన్ని కాలరాస్తున్నారని కొత్త మంత్రుల్లో మహిళలు, దళితులు, బిసిలు ఎక్కువగా ఉండడం వారికి కంటగింపుగా ఉందని మోడీ విమర్శ
ఎన్నడూ లేని తిరోగమన చర్య అని వ్యాఖ్య
వాయిదాలతో ఆరంభమైన వర్షాకాల సమావేశాలు
పెగాసస్ ఒక సృష్టి, ఆధారాల్లేకుండా బురద చల్లుతున్నారు:ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
స్వతంత్ర దర్యాప్తుకు కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాల తొలిరోజే పార్లమెంట్ దద్దరిల్లింది. సోమవారం ఉభయ సభలు ప్రారంభం కాగానే నలుగురు కొత్త ఎంపిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొత్త మంత్రులను లోక్‌సభకు పరిచయం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్యుక్తుడవ్వగానే విపక్షాలు అడ్డుకున్నాయి. వ్యవసాయ చట్టాలు, ఇంధన ధరల పెంపు, పెగాసస్ స్పైవేర్ ఆధారంగా పాత్రికేయులు, రాజకీయ ప్రముఖులపై ప్రభుత్వం నిఘా పెట్టడం తదితర అంశాలను లేవనెత్తుతూ ప్రతిపక్షాలు సభను స్తంభింపజేశాయి. ఆరంభంలోనే వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు అందుకున్నారు. సభా సంప్రదాయం ప్రకారం ప్రధాని లోక్‌సభలో తన కేబినెట్‌లోని కొత్త మంత్రులను పరిచయం చేయాల్సి ఉండగా విపక్షాలు అడ్డుకోవడంతో ప్రధాని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు సముచిత రీతిలో వ్యవహరించడం లేదన్నారు. పార్లమెంట్‌లో ఇటువంటి తిరోగమన మానసిక స్థితి ప్రదర్శితం కావడం తానెప్పుడూ చూడలేదని విరుచుకుపడ్డారు. కొత్త మంత్రులు ఎక్కువగా మహిళలు, దళితులు, ఎస్‌సి, ఎస్‌టిలు బిసి వర్గాలకు చెందిన వారని, వారికి కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పించడం, ప్రాధాన్యతను ఇవ్వడం ప్రతిపక్షాలకు రుచించినట్లుగా లేదని, ఇటువంటి సామాజిక న్యాయాన్ని వారు జీర్ణించుకున్నట్లుగా లేదని దుయ్యబట్టారు. అందుకే గందరగోళానికి దిగి, మంత్రుల పరిచయ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని, ఇదేం పద్థతి అని నిలదీశారు. కొత్త మంత్రులకు ప్రతిపక్షాలు బల్లలు చరుస్తూ స్వాగతం చెపుతారని భావించానని, ఎక్కువ మంది రైతుకుటుంబాలకు, దళిత వర్గాలకు చెందిన వారని, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మహిళలు, ఎంపిలు కొత్త మంత్రులు అయ్యారని, వారిని సభకు పరిచయం చేయడాన్ని కూడా ప్రతిపక్షం అడ్డుకుంటుందా? అని ప్రశ్నించారు. పేదలు, దళితులు అణగారిన వర్గాలకు చెందిన వారు మంత్రులు కావడం ప్రతిపక్షాలకు నచ్చనట్లుగాఉందని విమర్శించారు. ప్రతిపక్షాల నినాదాలు, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి స్పందనలేదనే విమర్శల నడుమనే పరిచయ కార్యక్రమాన్ని సభల వాయిదా తరువాత ప్రధాని లోక్‌సభలో కొనసాగించారు. అయితే తరువాత కూడా ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో ప్రధాని స్పీకర్‌తో మంత్రుల పరిచయం ముగిసినట్లుగా భావించాలని, తాను సభకు మంత్రుల జాబితాను అందిస్తానని తెలిపారు.
రాజ్యసభలోనూ ఇదే వాతావరణం
ఎగువసభ రాజ్యసభలోనూ ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకువెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలకు దిగారు. దీనితో పలుసార్లు సభ వాయిదా పడింది. మంత్రులను సభకు పరిచయం చేయడాన్ని ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయనేది అర్థం కావడం లేదని ప్రధాని మోడీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం దళిత, మహిళ మంత్రుల పేర్లు వారి వివరాలను కూడా వినడానికి వారి గురించి తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేతలకు ఇష్టం లేనట్లుగా ఉందని విమర్శించారు. ఇదేం మనస్తత్వం అని మండిపడ్డారు. ఇటువంటి ధోరణిని తాను సభలలో చూడటం ఇదే తొలిసారి అన్నారు. రాజ్యసభలో ప్రతిపక్షాల నినాదాలు కొనసాగుతున్న దశలో కొత్త మంత్రుల పేర్లు వివరాలతో కూడిన జాబితాను ప్రధాని సభకు సమర్పించారు.
నెహ్రూ కాలం నాటి పద్ధతి ఇది
కొత్త మంత్రులను పార్లమెంట్‌కు పరిచయడం చేయడం అనేది పార్లమెంటరీ సాంప్రదాయం అని, ఇది తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుంచి ఆనవాయితీగా వస్తోందని ఎగువ సభ అధికార పక్ష నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇటువంటి ధోరణి మంచిది కాదని, గర్హనీయం అని తెలిపారు. ప్రజాస్వామిక విలువలకు ఇది విఘాతం అన్నారు.
11 గంటలకు సభల ప్రారంభం
ఉదయం 11 గంటలకు లోక్‌సభ ఆరంభం అయింది. ఇటీవలి ఉప ఎన్నికలలో ఎంపిలు అయిన నలుగురు ముందుగా ప్రమాణస్వీకారం చేశారు. తరువాత స్పీకర్ ఓం బిర్లా ప్రధానిని ఉద్ధేశించి కొత్త మంత్రులను సభకు సాంప్రదాయం ప్రకారం పరిచయం చేయాలని సూచించారు. కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి లేదని, ధరలు, దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిపై ముందు చర్చ జరగాలని, ఈ మేరకు తాము ఇచ్చిన నోటీసులపై స్పందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకం, వాటిని ఉపసంహరించుకుని తీరాలి. కీలక అంశాలపై చర్చ ముఖ్యం అని తెలిపే ప్లకార్డులను సభలో కాంగ్రెస్, టిఎంసి ఇతర పక్షాలు ప్రదర్శించాయి. అయితే పద్ధతి ప్రకారం ముందు సభకు మంత్రులను ప్రధాని పరిచయం చేయాల్సి ఉంది. దీనికి ప్రతిపక్షాలు అడ్డుతగలరాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు. తరువాత ప్రధాన అంశాలను ఎవరైనా ప్రస్తావించవచ్చునని చెప్పారు. ఇంతకు ముందటి సాంప్రదాయాన్ని ఈ విధంగా దెబ్బతీస్తారా? అని ప్రశ్నించారు. ఇంతకు ముందు అధికారంలో ఉన్న వారికి వేరుగా చెప్పాలా? అని నిలదీశారు. అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో సభా సాంప్రదాయాలను కించపర్చడం సరికాదన్నారు. అయితే ప్రతిపక్షాలు వినలేదు. ఈ దశలోనే ప్రధాని స్పీకర్‌కు మంత్రుల పరిచయం ముగిసినట్లుగా రికార్డులలోకి చేర్చాలని కోరారు. ప్రతిపక్షాల వైఖరిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తప్పుపట్టారు. తన 24 ఏళ్ల పార్లమెంటరీ అనుభవంలో ఈ విధమైన వైఖరిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అసంబద్ధ వైఖరిని ప్రదర్శిస్తోందని అన్నారు. ఇటీవలి నెలలో మృతి చెందిన 40 మంది మాజీ ఎంపిలకు సభ ఓ నిమిషం మౌనంతో నివాళి పాటించింది.

పార్లమెంట్ వేళ ప్రజాస్వామ్యంపై దాడి: ఐటిశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో భారతీయ ప్రముఖులు, జర్నలిస్టులు, నేతల స్నూపింగ్ జరిగిందనే వార్తలను కేంద్రం ఖండించింది. హ్యాకింగ్, స్నూపింగ్ జరిగినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ఐటి, కమ్యూనికేషన్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం లోక్‌సభలో తోసిపుచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సెషన్‌కు ముందు ఇటువంటి ఆరోపణలను చిలవలుపలువలుగా చిత్రీకరించారని, ఇది కేవలం భారత ప్రజాస్వామ్యాన్ని కించపర్చడానికి, బురద చల్లడానికే అని స్పష్టం చేశారు. స్నూపింగ్ సంబంధిత మీడియా కథనాలపై మంత్రి సభలో తమంత తాముగా స్పందించి ప్రకటన వెలువరించారు. అన్ని అంశాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేసుకున్నట్లు, వివరాలు కూడా సిద్ధంగా ఉంచినట్లు, దేశంఓ అనధికారిక వ్యక్తుల నుంచి ఎటువంటి అక్రమ నిఘా లేదా పర్యవేక్షణలకు వీలు లేదని, దీనిని ప్రభుత్వం ఘంటాపథంగా చెప్పగలదని తెలిపారు. సోమవారం పార్లమెంట్ సెషన్ ఆరంభం కావడంతోనే స్నూపింగ్ అంశాన్ని తీసుకుని ప్రతిపక్షాలు ఉభయసభల్లో తీవ్రస్థాయిలో నిరసనలకు దిగాయి. దీనితో గందరగోళం నెలకొంది. ఈ దశలో కేంద్ర నూతన ఐటి, కమ్యూనికేషన్స్ మంత్రి ప్రకటన వెలువరించారు. ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై నిఘాకు స్పైవేర్ పెగాసస్‌ను వాడినట్లు వచ్చిన వార్తలు కేవలం సంచలనాత్మక రీతిలో ఉన్నాయని, ఒకానొక వెబ్‌పోర్టల్ వీటిని పార్లమెంట్ సెషన్‌కు ముందు రోజు రాత్రి కావాలనే వెలువరించిందని, ఇది కేవలం వారి సంచలనాత్మక కోణాన్ని అంతకు మించి రాజకీయ స్వార్థశక్తులకు వినియోగపడే విధానాన్ని తెలియచేసిందని మంత్రి మండిపడ్డారు. వైర్ వెబ్ ప్రింట్ మీడియా కథనాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి కథనాలు యాదృచ్ఛికం అనుకోవడానికి వీల్లేదు. ఇంతకు ముందు కూడా వాట్సాప్‌లపై ఈ స్పై సాఫ్ట్‌వేర్‌ను వాడినట్లు కథనాలు వెలువడ్డాయి. ఎటువంటి సాక్షాధారాలు లేకుండా వెలువడ్డ వార్తలు కావడంతో ఈ అంశాన్ని అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలూ నిర్థిష్టంగా ఖండించాయని మంత్రి గుర్తు చేశారు. భారతీయ ప్రజాస్వామ్య ప్రక్రియను కించపరిచేందుకు కొన్ని శక్తుల ద్వారా సాగుతున్న యత్నాలలో భాగంగానే ఇటువంటి వార్తలను వెలువరిస్తున్నారని మంత్రి వీటిని తిప్పికొట్టే యత్నాలకు దిగారు.
ఇజ్రాయెల్ స్పైవేర్ …సర్కారు కొన్నది
ప్రత్యర్థులు, వివిధ స్థాయిల వ్యక్తుల కదలికలను వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించుకునేందుకు, హ్యాకింగ్‌కు సమగ్ర రీతిలో ఇజ్రాయెల్ పెగాసస్ స్పై వైర్ రూపొందింది. దీనిని కేవలం ప్రభుత్వ ఆధీన సంస్థలకే విక్రయించడం జరిగిందని, ఈ మేరకు భారత ప్రభుత్వ సంస్థలు దీనిని సేకరించుకుని ఉంటాయని ఇంటర్నేషనల్ మీడియా కాన్సర్టియమ్ తెలిపింది. భారతదేశంలో 300 వరకూ ఎంచుకున్న నిర్థారిత వ్యక్తుల ఫోన్ నెంబర్ల హ్యాకింగ్, ఈ క్రమంలో వారిపై స్నూపింగ్ జరుగుతోందని వార్తలు వెలువడ్డాయి. స్నూపింగ్ జాబితాలో కేంద్రంలోని ఇద్దరు మంత్రులు, 40 మందికి పైగా జర్నలిస్టులు, ముగ్గురు ప్రతిపక్ష నేతలు, ఓ సిట్టింగ్ జడ్జి, పలువురు వ్యాపారవేత్తలు, హక్కుల నేతలను టార్గెట్ చేసుకున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. వీరిపై స్నూపింగ్ ఉచ్చు బిగుసుకుందని వార్త కథనాలు వెలువడ్డాయి. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని ఇవి నిరాధార ఆరోపణలు అని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

Parliament Session 2021 Highlights

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News