Saturday, May 4, 2024

మాస్క్ మస్ట్

- Advertisement -
- Advertisement -

masks

 

ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరి చేసిన రాష్ట్ర ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలు మాస్కులు ఖచ్చితంగా ధరించాలని పేర్కొంది. తాజాగా ఎలాంటి లక్షణాలు లేకపోయినా, కొంత మందిలో వైరస్ పాజిటివ్ వస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శుక్రవారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని, అత్యవసర పరిస్థితుల్లో వస్తే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. జపాన్‌లో మాస్క్‌లు వినియోగించడం ద్వారా తాజాగా అక్కడ కేసుల సంఖ్య తగ్గిందని ఆమె ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు పొరలుగా ఉండే కాటన్‌తో చేసిన మాస్కులు వినియోగం ఆమోద యోగ్యమన్నారు.

దగ్గడం, తుమ్మడం, మాట్లాడే సమయం లో ఎదుట వ్యక్తిపై తుంపర్లు పడే అవకాశం ఉందని, దీంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రభుత్వం ఈ నూతన నిబంధనలను ప్రవేశపెట్టినట్లు శాంతికుమారి పేర్కొన్నారు. ముక్కు, నోరు, గదవను కవర్ చేసే విధంగా మాస్కులు ఉండాలని, అదే విధంగా మాస్కుకు, ముఖానికి ఖాళీ ఉండొద్దని ఆమె ఉత్తర్వుల్లో సూచించారు. ఈ నిబంధనలు ప్రభుత్వ, ప్రైవేట్, అత్యవసర సిబ్బందిలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. అర్బన్‌తో పాటు రూరల్ ఏరియాల్లోని ప్రజలు కూడా మాస్కులు ధరించాలన్నారు.

మాస్కులు ధరించేటపుడు పాటించాల్సిన సూచనలు..
మాస్క్ వేసుకునేటపుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అదే విధంగా ప్రతి రోజు ప్రెష్ మాస్కులను మాత్రమే వేసుకోవాలని ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఒకసారి ఉపయోగించిన మాస్కును క్లీన్ చేయనిది రెండో సారి వినియోగించకూడదన్నారు. దీంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో పాతపడిన మాస్కును కూడా ధరించవద్దని తెలిపారు. అయితే డిస్పోజల్ మాస్కుల కంటే క్లాత్ మాస్కుల ధరించడం ఉత్తమం అని, ఒకవేళ డిస్పోజల్ మాస్కులు ధరిస్తే, ప్రతి ఆరు గంటలకోసారి మాస్కులను మార్చాలన్నారు. తీసివేసిన మాస్కులను నిర్ధేశించిన చెత్తడబ్బాల్లో మాత్రమే వేయాలని ఆమె తెలిపారు.

అదే విధంగా ఒకసారి మాస్కు ధరించిన తర్వాత మాస్కు ముందు భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని సూచించారు. మాస్కులను వాటి లేస్ ద్వారా మాత్రమే విప్పాలని, వాటిని తీసిన తర్వాత వెంటనే 70 శాతం ఆల్కాహాల్ ఉన్న శానిటైజర్లతో గాని సబ్బుతో గాని 40 సెకన్ల పాటు చేతులను శుభ్రపరుచుకోవాలని ఆమె చెప్పారు. మాస్కులను ప్రతి రోజు డెటాల్ , షాంపు నీళ్లతో వాష్ చేయాలని శాంతికుమారి సూచించారు. మాస్కులు ధరించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలని ఆమె అన్నారు. చేతులు శుభ్రం చేయకుండా కళ్లను ఎట్టి పరిస్థితుల్లో తాకవద్దని ఆమె అన్నారు. ఈ నిబంధనలను ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత జిల్లా అధికారులదేనని ఆమె సూచించారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక బాధ్యత తీసుకొని అన్ని జిల్లాల్లో ఈ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి అధికారులను కోరారు.

 

People should wear masks definitely
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News