Sunday, April 28, 2024

గప్ చిప్ గా గ్యాంబ్లింగ్

- Advertisement -
- Advertisement -

petrol pump chip scam in hyderabad

 

పెట్రోల్ బంక్‌ల్లో మోసాల ముఠా గుట్టురట్టు

లీటర్ పెట్రోల్‌కు 970మి.లీటర్లు మాత్రమే వచ్చేలా ఎలక్ట్రానిక్ చిప్‌ల అమరిక
వినియోగదారులను ముంచుతున్న యాజమాన్యాలు
తెలంగాణలో 11, ఎపిలో 19 బంకులపై చర్యలు
నలుగురు అరెస్టు, పరారీలో బంకుల యజమానులు

హైదరాబాద్: పెట్రోల్ బంకుల్లో చిప్పులు అమర్చి తక్కువ పెట్రోల్ వచ్చే విధంగా చేసి మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. పెట్రోల్ బంక్‌ల యజమానులు ఏడుగురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 14ఐసి చిప్పులు, ఎనిమిది డిస్‌ప్లేలు, మూడు జిబిఆర్ కేబుళ్లు, మథర్‌బోర్డు, కారును స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని ఏలూరుకు చెందిన ఎస్‌కె సుభానీ భాష గత 10 ఏళ్ల నుంచి పెట్రోల్ బంక్ మిషన్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఏలూరుకు చెందిన ఎస్‌కె బాజి బాబా, మాదాసుగురి శంకర్, ఇప్పిలి మల్లేశ్వర్ రావు అలియాస్ నాని కలిసి పెట్రోల్ బంక్‌ల్లో చిప్పులు అమర్చి తక్కువగా పెట్రోల్ వచ్చే విధంగా చేస్తున్నారు. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్ట పోతున్నారు.

ఈ ముఠా తెలంగాణలోని 11బంక్‌లు, ఎపిలో 19బంకుల్లో చిప్పులు అమర్చారు. వీరు చిప్పులను అమర్చేందుకు రూ.80,000 నుంచి రూ.1,20,000వరకు వసూలు చేస్తున్నారు. మ్యానిపులేటెడ్ చిప్పులను అమర్చడంతో సుభానీ నిపుణుడు. వీరికి చిప్పుల్లో సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చేది ముంబాయికి చెందిన జో జోసెఫ్, సిబు థామస్,2018లో ఆయిల్ కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ను మార్చడంతో అప్పటి నుంచి వీరు చిప్పులు అమర్చుతున్నారు. దీంతో వినియోగదారులు ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు నష్టపోయారు. లీటరు పెట్రోల్ పోస్తే అందులో వారికి 970మి.లీటర్లు మాత్రమే వస్తుంది. అదే బాటిళ్లు, క్యాన్లలో పోస్తే మాత్రం సరిగ్గా పోసేవారు. డిస్‌ప్లేలో సరిగ్గా చూపించడంతో వినియోగదారులు అనుమనించడంలేదు.

ఈ విధంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోల్ పంప్, హిందూస్థాన్ పెట్రోల్ పంపుల్లో అమర్చారు. విజిలెన్స్ టీములు పెట్రోల్ పంపులను సందర్శించారు. అనుమానం వచ్చి తనిఖీ చేయడంతో విషయం బయటపడింది. నిందిగామ, అల్లాదుర్గ్, దోమకొండ, కొత్తపల్లి, మైలచెరువు, చిలుకూరు, మోటకొండూరు, బిబినగర్, ఆర్‌సి పురం, బిడిఎల్ భానూర్‌లోని బంకుల్లో అమర్చారు. శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, ఎస్‌ఓటి ఎడిసిపి సంధీప్, షాద్‌నగర్ ఎసిపి సురేందర్, ఎస్‌ఓటి బాలానగర్ ఇన్స్‌స్పెక్టర్ రమణారెడ్డి, నందిగామ ఇన్స్‌స్పెక్టర్ రామయ్య తదితరులు నిందితులను అరెస్టు చేశారు.

నిందితులపై పిడి యాక్ట్‌ః విసి సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్

నిందితులపై పిడి యాక్ట్ పెట్టనున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. చిప్ మోసాలపై అన్ని కార్పొరేషన్లను అప్రమత్తం చేశామని తెలిపారు. ఈ ముఠా వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. విచారణలో ఎక్కడెక్కడ చిప్‌లు అమార్చారో తెలుసుకుంటామని అన్నారు.

petrol pump chip scam in hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News