Sunday, April 28, 2024

ప్రధాని మోడీ భద్రతకు రూ. 12 కోట్ల విలువైన ఎస్ 650 గార్డ్ కారు

- Advertisement -
- Advertisement -
PM Modi gets new Rs 12-crore car
పేలుళ్లకు, బుల్లెట్ తూటాలకు చెక్కు చెదరని పటిష్టత

న్యూఢిల్లీ : కొన్నేళ్ల క్రితం ప్రధాని మోడీ మేబ్యాచ్ చలవ కళ్లద్దాలను ధరించినప్పుడు వార్తల్లోకెక్కారు. ఇప్పుడు అత్యంత భద్రత కోసం మెర్సిడీస్ మైబహ్ ఎస్650 గార్డు బుల్లెట్ ప్రూఫ్ కారును ఉపయోగిస్తుండడం ప్రముఖ చర్చనీయాంశం అవుతోంది. మోడీ భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సరికొత్త కారును తీసుకొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశానికి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పల్కడానికి ఈ కారు లోనే మొట్టమొదటిసారి మోడీ హైదరాబాద్ హౌస్‌కు చేరుకున్నారు. మళ్లీ ప్రధాని కాన్వాయ్‌లో ఇది కనిపిస్తోంది. విఆర్ 10 స్థాయి భద్రతను కల్పించే ఈ కారు ఖరీదు రూ. 12 కోట్లు నుంచి రూ. 15 కోట్ల వరకు ఉంటుందని లెక్కగడుతున్నారు. భారత్‌లో మెర్సెడీస్ మే బ్యాచ్ గత ఏడాది ఎస్ 600 గార్డును విడుదల చేసినప్పుడు దాని విలువ రూ.10.5 కోట్లు. మరి ఈ ఎస్ 650 గార్డు బుల్లెట్ ప్రూఫ్ రూ. 15 కోట్లు వరకు విలువ చేస్తుందని పోల్చి చెబుతున్నారు.

విఆర్10 స్థాయి భద్రత అంటే సాయుధ దాడుల బుల్లెట్ల వర్షానికి లేదా పేలుళ్లకు ఏమాత్రం చెక్కుచెదరకుండా ఈ కారు గట్టిగా రక్షణ కల్పిస్తుంది. ప్రధాని భద్రతను మరింత పటిష్టం చేయాలన్న తలంపుతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఇంతవరకు ప్రధాని వాడుతున్న వాహనాలను మార్చాలని నిర్ణయించింది. దీనికి తగ్గట్టు రెండు ఎస్650 గార్డు కార్లను కొనుగోలు చేసింది. ఒక దానిలో ప్రధాని ఉండగా, మరో కారును డికాయ్ ( ప్రధాని ఉన్నట్టు తలపించే వాహనం) గా వినియోగిస్తారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహీంద్రా స్కార్పియో వినియోగించేవారు. ప్రధాని అయిన తరువాత బిఎండబ్లు 7 సిరీస్ హైసెక్యూరిటీ ఎడిషన్, రేంజిరోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్‌లను వినియోగించారు. వినియోగదారులకు అత్యున్నత శ్రేణి రక్షణ కల్పించేలా ఈ ఎస్850 గార్డ్ కారును మెర్సిడిస్ రూపొందించింది.

కారు బాడీ, విండోస్, ఎకె 47 తూటాలను తట్టుకొన్ని నిలబడతాయి. కారుకు ఈవీఆర్ (ఎక్సోప్లోజివ్ రెసిస్టెంట్ వెహికల్ ) 2010 రేటింగ్ లభించింది. ఇది దాదాపు రెండు మీటర్ల దూరం లోపు సంభవించే 15 కిలోల టీఎన్‌టీ పేలుడు శక్తిని నుంచి ప్రయాణికులకు రక్షణ కల్పిస్తుంది. కారు విండోస్‌కు పాలీకార్బొనేట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. కారు కింద జరిగే పేలుడు నుంచి తట్టుకునేలా రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. కారు లోపల ఎవరున్నా విషవాయువుల దాడి జరిగితే ఆ ముప్పు నుంచి రక్షించడానికి కారు లోపలే ప్రత్యేకమైన ఆక్సిజన్ సరఫరా విభాగం అమర్చి ఉంది. 516 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేసే అత్యంత శక్తివంతమైన 6.0 లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్ అమర్చారు. 900 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను ఇది అందుకొంటుంది. ఇంత భారీ ఇంజిన్ అమర్చినప్పటికీ కారు వేగం మాత్రం గంటకు 160 కి.మీకే పరిమితి చేశారు. ప్రత్యేకమైన ఫ్లాట్ టైర్లు ఉన్నాయి. పంక్చర్లు పడినా, దెబ్బతిన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సుఖంగా సాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News