Saturday, April 27, 2024

యువతుల వివాహ వయసుపై త్వరలోనిర్ణయం

- Advertisement -
- Advertisement -

PM Modi releases commemorative coin of Rs 75

 

ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన
ఎఫ్‌ఎఓ వజ్రోత్సవాల సందర్భంగా రూ.75 ప్రత్యేక నాణెం విడుదల
17 కొత్త పంటలను ఆవిష్కరించిన ప్రధాని

న్యూఢిల్లీ: ఆడపిల్లల కనీస వివాహ వయసుపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. గత ఆరేళ్లుగా తమ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల కారణంగా దేశంలో మొట్టమొదటిసారిగా విద్యా రంగంలో ఆడపిల్లల సగటు నమోదు మగపిల్లలకన్నా ఎక్కువ అయిందని ప్రధాని చెప్పారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎఓ) 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో 75 రూపాయల ప్రత్యేక నాణేన్ని ప్రధాని విడుదల చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఆడపిల్లలు వివాహం చేసుకోవడానికి ఏది సరయిన వయసు అనే దానిపై దేశంలో ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోందని అన్నారు.

కమిటీ నివేదిక గురించి, ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నిస్తూ తనకు చాలా మంది మహిళలనుంచి ఉత్తరాలు అందుతున్నాయని మోడీ చెప్పారు. ‘నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని వాళ్లందరికీ నేను హామీ ఇస్తున్నాను’ అని ప్రధాని చెప్పారు. ఆడపిల్లలు వివాహం చేసుకోవడానికి కనీస వయసు ఎంత ఉండాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, ఈ విషయాన్ని పరిశీలించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ప్రధాని తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వివాహానికి కనీస వయసు అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 సంవత్సరాలుగా ఉన్న విషయం తెలిసిందే.

కాగా పోషకాహార లోపంపై పోరాటానికి తమ ప్రభుత్వం గత ఆరేళ్లలో తీసుకున్న చర్యలను మోడీ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. పోషకాహార లోపం సవాలును ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం, సమగ్రమైన, సంపూర్ణమైన విధానాన్ని అనుసరించిందని, పోషకాహార లోపం ఎక్కువగా ఉండడానికి కారణమైన అన్ని అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక బహుముఖ వ్యూహాన్ని అమలు చేసిందని, జాతీయ పోషకాహార మిషన్‌ను ప్రారంభించిందని చెప్పారు. తమ ప్రభుత్వం సాధించిన ఇతర విజయాల గురించి ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని, కుళాయిల ద్వారా పరిశుభ్రమైన తాగు నీటిని అందించడం కోసం జల్‌జీవన్ మిషన్‌ను ప్రారంభించించామని చెప్పారు. పేద మహిళలకు ఒక్క రూపాయికే శానిటరీ న్యాప్‌కిన్స్‌ను అందిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. దేశంలో పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి దశాబ్దాలుగా ఎఫ్‌ఎఓ పాలు పంచుకుంటోందని ప్రధాని అన్నారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చేసిన 17 రకాల కొత్త పంటలను ఆయన ఆవిష్కరించారు. వీటివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ధాన్యం, గోదుమల ఉత్పత్తిలో దేశంలో పాత రికార్డులన్నీ చెరిగిపోయాయన్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆహార భద్రతకు ఇది ఎంతో ముఖ్యమని చెప్పారు. సరయిన వసతులు లేనందున ఆహార ధాన్యాలను నిల్వ చేయడం సమస్యగా మారుతోందని, దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని చెప్పారు. ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలవల్ల రైతులకు మరింత లబ్ధి చేకూరుతుంని చెప్పారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని ప్రపంచ ఆహార కార్యక్రమానికి ప్రకటించడం పట్ల ప్రధాని స్వాగతించారు. దీనిలో భారత్ కూడా భాగస్వామి అయినందుకు హర్షం వ్యక్తం చేశారు.

 

PM Modi releases commemorative coin of Rs 75

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News