Home జాతీయ వార్తలు దెబ్బలు తట్టుకునేందుకు సూర్య నమస్కారాలు చేస్తా

దెబ్బలు తట్టుకునేందుకు సూర్య నమస్కారాలు చేస్తా

 

న్యూఢిల్లీ: తమకు ఉద్యోగాలు రాకపోతే మరో ఆర్నెళ్ల తర్వాత దేశంలోని నిరుద్యోగులు ప్రధాని నరేంద్ర మోడీని కర్రలతో కొట్టడం మొదలుపెడతారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ తనదైన శైలిలో స్పందించారు. గురువారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కర్ర దెబ్బలను తట్టుకునేందుకు వీలుగా శరీరాన్ని దృఢపరుచుకునేందుకు వచ్చే ఆరునెలలు సూర్య నమస్కారాలు చేస్తానంటూ ప్రధాని చెప్పడంతో సభలో పెద్దపెట్టున నవ్వులు విరిశాయి. భారత రాజ్యాంగాన్ని తన ప్రభుత్వం నాశనం చేస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణను ప్రధాని తిప్పికొడుతూ 1975లో దేశంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినపుడే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ రక్షించి ఉండవలసిందని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తే కశ్మీరు అగ్నిగోళం అవుతుందని చాలా మంది బెదిరించారని, అలాగే కొందరు రాజకీయ నాయకులను నిర్బంధించడంపై కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారని ప్రధాని అన్నారు.

కశ్మీరుకు భారతదేశం ద్రోహం చేసిందని, 1947లోనే వేరేరకంగా(పాకిస్తాన్‌లో విలీనం) నిర్ణయం తీసుకుని ఉండే బాగుండేదని జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆగస్టు 5న వ్యాఖ్యానించారని, అటువంటి వ్యక్తులను మనం ఆమోదించగలమా అంటూ ప్రధాని ప్రశ్నించారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తే భారత్ నుంచి కశ్మీరు వేరుపడుతుందని ఓమర్ అబ్దుల్లా అంటారని, కశ్మీరులో ఎవరూ భారతదేశ జెండాను ఎగురవేయరని మరో మాజీ సిఎం ఫరూఖ్ అబ్దుల్లా అంటారని, అలాంటి వ్యక్తులను ఎలా సమర్థించగలమని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రాముఖ్యతను కాంగ్రెస్ అర్థం చేసుకోవడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. అనేక దశాబ్దాల పాటు జాతీయ సలహా మండలిని ఉపయోగించి ప్రధాని, పిఎంఓను వారి అధీనంలో ఉంచుకున్నారని, రాజ్యాంగ పరిరక్షణ పేరిట ఢిల్లీలోను, దేశవ్యాప్తంగా ఏం జరుగుతోందో అందరం చూస్తున్నామని ప్రధాని వ్యాఖ్యానించారు.

 

PM Modi retorts at Rahul Gandhis comments, I will do Suryanamaskar to toughen myself up to bear the blows, says Modi