Saturday, April 27, 2024

మువ్వన్నెల జెండాకు అవమానం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

మువ్వన్నెల జెండాకు అవమానం.. యావత్తు దేశాన్ని బాధించింది
ఎర్రకోట ఘటనపై ‘మన్‌కీ బాత్’లో ప్రధాని వ్యాఖ్య
బోయిన్‌పల్లి మార్కెట్‌ను మోడీ ప్రశంసలు

PM Modi slams Insult of Tricolour Flag

న్యూఢిల్లీ: ‘జనవరి 26న ఢిల్లీలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని చూసి యావత్ భారతావని బాధపడింది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో భాగంగా కొంతమంది ఎర్రకోటపై ఇతర జెండాలను ఎగునరవేసిన ఘటనను ప్రస్తావిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనపై మోడీ నేరుగా స్పందించడం ఇదే మొదటిసారి.ప్రతినెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే ‘మన్‌కీ బాత్’కార్యక్రమంలో భాగంగా ప్రధాని ఈ రోజు తన మనసులో భావాలను ప్రజలతో పంచుకున్నారు. పద్మ పురస్కారాలకు ఎంపికయిన వారికి అభినందనలు తెలియజేశారు. అలాగే టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన అద్భుత విజయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పండుగలు, ఉత్సవాలు, గణతంత్ర వేడుకలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం వంటి కార్యక్రమాలతో జనవరి నెల వేగంగా గడిచిపోయిందని మోడీ గుర్తు చేశారు.దేశం కోసం వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని పద్మ పురస్కారాలతో సత్కరించుకున్నామన్నారు. పద్మ పురస్కారాలు పొందిన వారి గురించి అందరూ తెలుసుకోవాలన్నారు. తొలుత ఎదుర్కొన్న అపజయాలను అధిగమించి టీమిండియా క్రికెట్‌లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ఇలాంటి ఉత్సాహభరిత వాతావరణం మధ్య జనవరి 26న మువ్వన్నెల జెండాకు జరిగిన అవమానం ప్రతి ఒక్కరినీ బాధించిందన్నారు. గత ఏడాది ప్రతి ఒక్కరూ అద్భుతమైన ధైర్య సాహసాలు, సహనాన్ని ప్రదర్శించారంటూ కరోనా కష్టకాలాన్ని గుర్తు చేశారు. అదే స్ఫూర్తిని ఈ ఏడాది కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో ప్రారంభమైందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యంత వేగంగా ప్రజలకు టీకాను అందిస్తున్నామన్నారు. కేవలం 15 రోజుల్లో 30 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన అమెరికాలో 30 లక్షల డోసులు అందించడానికి 18 రోజులు, బ్రిటన్‌లో 36 రోజులు పట్టిందన్నారు. కరోనాపై భారత్ సాగిస్తున్న పోరాటం యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అదే విధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినిస్తోందన్నారు. కొవిడ్ టీకా ఉత్పత్తి భారత్ టీకా తయారీ సామర్థాన్నిప్రపంచానికి చాటిందన్నారు. సరైన సమయంలో టీకాను అందించి ఆదుకున్నందుకు ప్రపంచ దేశాలు భారత్‌పై ప్రశంసలు కురిపిస్తుండడాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌కు ప్రశంస
ఇక ఎప్పటిలాగే దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో కృషి చేస్తున్న పలువురిని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో చెత్తనుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న తీరును ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే హర్యానాలోని బదౌతి గ్రామంలో మురుగునీటిని సాగునీరుగా మారుస్తున్న వైనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేరళలో రాజప్పన్ అనే దివ్యాంగుడు ఓ సరస్సును ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. అలాగే ఎయిరిండియాకు చెందిన మహిళా పైలట్లు ఉత్తరధ్రువం మీదుగా సుదీర్ఘ ప్రయాణం సాగించిన సాహసాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. జబల్పూర్‌లో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన మహిళలంతా కలిసి రైస్‌మిల్లును కొనుగోలు చేసి నడుపుతున్న తీరును ప్రధాని అభినందించారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో విద్యార్థినులు చేపట్టిన స్ట్రాబెర్రీ సాగును మోడీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశం75వ స్వాతంత్య్ర దినోత్సవానికి చేరువవుతూ ఉన్న విషయాన్ని ప్రధాని గుర్తు చేస్తూ ప్రజలు ముఖ్యంగా యువత స్వాతంత్య్ర పోరాట యోధులు, వారి పోరాటంతో ముడిపడి ఉన్న సంఘటనల గురించి రాయాలని కోరారు. ఈ నెల 18నుంచి ఫిబ్రవరి 17 వరకు దేశంలో రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని పాటిస్తున్న విషయాన్ని మోడీ గుర్తు చేస్తూ, రోడ్డు ప్రమాదాలు మనదేశంలోనే కాకు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న విషయమన్నారు.

PM Modi slams Insult of Tricolour Flag

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News