Tuesday, April 30, 2024

మోడీని తాకిన ఎన్నికలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జులై 3న జరిగే కేంద్ర మంత్రి మండలి భేటీ పలు అంశాలలో మోడీకి తలెత్తిన సమస్యల నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో తలెత్తిన ఓటమి వ్యక్తిగతంగా తనకు తగిలిన దెబ్బగానే మోడీ భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి దక్కుతున్న దశలో జాతీయ స్థాయిలో గ్రాఫ్ దెబ్బతింటున్నదనే విశ్లేషణలు ఆందోళనకరంగా మారడంతో తన ఆంతరంగికులతో చర్చించి కీలక మార్పులు చేర్పులకు సిద్ధం అయినట్లు వెల్లడైంది. ఇటీవలే కొందరు కేంద్ర మంత్రులను పిలిపించి మోడీ వారితో మాట్లాడారు. ఈ వివరాలు వెలుగులోకి రాలేదు. ఈ క్రమంలోనే మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు స్పష్టం అయింది. ఈ ఏడాది అత్యంత కీలక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇవి వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయి

కర్నాటక ఫలితాల తరువాతి నష్టనివారణ ఇంతవరకూ జరగలేదు. మరో వైపు మణిపూర్ పరిణామాలు ఈశాన్య ప్రాంతంలో ఇతర రాష్ట్రాలలో శాంతిభద్రతలకు ముప్పుగా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయిలో విపక్షాలు కూటమిగా అవతరించేందుకు బలీయ సంకేతాలు వెలువడుతున్న దశలో ఈ కూటమి ఏర్పాటు జరిగితే దీనిని మరింత ధీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ పరంగా , కేబినెట్‌పరంగా కీలక మార్పులు అవసరం అని అమిత్ షా, నడ్డాలతో జరిగిన సుదీర్ఘ మంతనాల నేపథ్యంలో మోడీ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడైంది. ఇందులో భాగంగానే మంత్ర మండలి సమావేశానికి పిలుపు నిచ్చినట్లు వెల్లడైంది. కేంద్ర మంత్రులు కొందరిని తీసివేసి వారికి రాష్ట్రాల పార్టీ బాధ్యతలు ఇచ్చే వీలుంది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన ఓ మంత్రిని తప్పించి పార్టీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని వెల్లడైంది.

ముందుగా కర్నాటక ఎన్నికల ఫలితాలు ఇతర రాష్ట్రాలపై ప్రభావం చూపకుండా సంస్థాగతంగా చర్యలు తీసుకోవాలని మోడీ భావిస్తున్నారు. అయితే జులై మూడవ వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభం అవుతాయి. దీనికి ముందు మంత్రి మండలి భేటీ సాధారణ ప్రక్రియనే అవుతుంది. ఇందులో భాగంగానే ఈ భేటీ ఉండి ఉంటుందని లేదా మంత్రివర్గ పునర్వస్థీకరణకు ముందు ఈ కీలక భేటీ ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News