Monday, April 29, 2024

పొడిచే పొద్దువై తిరిగిరా..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్ ః కళామతల్లి ముద్దు బిడ్డ ప్రజా గాయకుడు గద్దర్ ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. గద్దర్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖలు, అభిమానులు ఎల్బీ స్టేడియానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అశేష జనవాహిని మధ్య పార్ధివదేహాన్ని మధ్యాహ్నం 12:30 గంటలకు స్టేడియం నుంచి అల్వాల్‌లోని ఆయన నివాసానికి అంతిమయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది అభిమానులు,సన్నిహితులు పార్దివదేహాన్ని అనుసరిస్తూ ఆయన అంతియాత్రలో జోహార్ గద్దర్ అన్న అంటూ నినదించారు. తెలంగాణకు చెందిన జానపద, ఒగ్గు, చిందు, లంబాడీ కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై తన గళాలకు పదును పెట్టి గద్దర్ పేరుతో పాటలు ఆలపించారు. ఒగ్గు కళాకారులు డోలు విన్యాసాలతో గద్దర్‌తో వారికున్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇంతటి కళాకారుడు దేశంలో పుట్టడం అరుదని నేటి కళాకారులు ఆయన బాటలో నడిచి పేదల పక్షం నిలబడాలని పాట రూపంలో వివరించారు. నగర ప్రజలే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, పాలమూరు, ఖమ్మం, శ్రీకాకుళం, విజయనగరం, అనంతరపురం, కర్నూల్ జిల్లాల నుంచి అభిమానులు తరలివచ్చి జోహార్లు అర్పించారు. మాదిగ దండోరా, మాలమహానాడు, బంజారా సంఘాల నాయకులు నీల జెండాలు ధరించి, చేతిలో గద్దర్ చిత్రాల చేతపట్టి డప్పు కళాకారులు వేసే దరువులకు అడుగులేస్తూ పొడుస్తున్న పొద్దు స్మరిస్తూ కంటతడి పెట్టారు. ఆయనతో పాటను చూసి వేలాది కళాకారులు పుట్టారని ఎందరికో గద్దర్ ఆదర్శమని ప్రశంసించారు. అనంతరం గన్‌పార్కు అమరవీరుల స్ధూపం చేరుకుని అమరులకు నివాళ్లుర్పించి అక్కడ నుంచి బషీర్‌బాగ్, ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం, సికింద్రాబాద్, జేబీఎస్, తిరుమలగిరి మీదుగా ఆల్వాల్ వరకు యాత్ర సాగింది. సుమారు 15 కిమీ మేర జనంతో దారులు కిక్కిరిసిపోయాయి.

అంతిమ యాత్ర వాహనానికి జై బీం జెండాలతోపాటు గౌతమ బుద్దుడి పంచశీల జెండాలను జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. కాగా, అల్వాల్లోని గద్దర్ ఇంటి వద్ద బారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఎం కెసిఆర్ సాయంత్రం 4 గంటలకు గద్దర్ ఇంటికి చేరుకుని పుష్పాంజలి ఘట్టించి ఆయన భార్య విమల, కుమారుడు సూర్యంను ఓదార్చి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. అనంతరం అక్కడి నేరుగా గద్దర్ పేద విద్యార్థుల కోసం అల్వాల్‌లోని భూదేవి నగర్‌లో స్థాపించిన మహాబోధి విద్యాలయ ఆవరణలో రాత్రి 7 గంటలకు పోలీసుల గౌరవ వందనం చేసి మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిగి తరువాత అంత్యక్రియలు బౌద్ద సాంప్రదాయ పద్దతిలో బుద్దుడు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాలు పెట్టి నిర్వహించారు.

గద్దర్ అంతియాత్రలో విషాదం సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి ః
అంతిమయాత్రలో ఒక సీనియర్ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. గద్దర్ అంత్యక్రియలు జరిగే అల్వాల్ మహాబోధి స్కూల్ వద్ద జనం పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు అదుపు చేయలేక పోవడంతో తొక్కిసలాట జరిగింది. భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు స్కూల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. స్థలం సరిపోదని పోలీసులు చెప్పిన వినకుండా ముందుకు భారీ తోసుకు రావడంతో ఘటన జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జనాల మధ్యలో నీరసంతో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ ఉండటంతో ఊపిరిరాడక పోవడంతో వెంటనే ఆయన ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. జహీరుద్దీన్ అలీఖాన్, గద్దర్ మంచి స్నేహితులు.
గద్దర్‌కు రాజకీయ, సినిమా ప్రముఖుల నివాళ్లు ……..
కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ శానససభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బోయినిపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రసమయి బాలకిషన్, చంటి క్రాంతి కిరణ్, మైనంపల్లి హన్మంత్‌రావు, గోరెటి వెంకన్న, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ,కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి,మల్లు రవి, మధుయాష్కీ, సీతక్క, వి.హనుమంతరావు, బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు, టి టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సినీ ప్రముఖులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, మంచు మోహన్ బాబు, మనోజ్, కొణిదెల నాగబాబు, నిహారిక, అలీ, సీపీఐ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెదేపా నేత పరిటాల శ్రీరామ్ తదితరులు గద్దర్ పార్ధివదేహం వద్ద నివాళులర్పించారు. అణగారిన వర్గాలు, తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా పలువురు మంత్రులు గుర్తుచేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News