Monday, April 29, 2024

నా బిడ్డ చావుకు కారణమైన వాడికి ఉరిశిక్ష వేయండి: ప్రవళిక తల్లి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తన బిడ్డ చావుకు కారణమైన వాడికి ఉరిశిక్ష వేయాలని మర్రి ప్రవళిక తల్లి విజయ డిమాండ్ చేశారు. మీ రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగకండి.. మమ్మల్ని టార్చర్ పెట్టకండి అని ఆమె విజ్ఞప్తి చేశారు. రెండు సంవత్సరాల నుంచి తన బిడ్డను హైదరాబాద్‌లో చదివించుకుంటున్నానని, నా కుమారుడు కూడా అక్కడే చదువుకుంటున్నాడని తెలిపారు. తాము ఎండలో కాయ కష్టం చేసి పిల్లలను చదివిస్తున్నామని, తమ కష్టం తమ పిల్లలకు రాకూడదనే తాము కష్టపడుతూ వారిని హైదరాబాద్‌కు పంపి చదివించుకుంటున్నామని పేర్కొన్నారు.

కానీ, తమ బిడ్డను ప్రేమించిన వాడు ఆమెను వేధించాడని, వాడి టార్చర్ భరించలేక, కనీసం తమతో కూడా ఆమె అనుభవిస్తున్న బాధను చెప్పుకోలేక తమ కుమార్తె ప్రవళిక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. తమ బిడ్డ చావుకు కారణమైన వాడిని శిక్షించాలని, వాడిని బయటకు రాకుండా చేయాలని కోరారు. తన బిడ్డ కష్టం వేరే వాళ్లకు రాకూడదని, రాజకీయ నాయకులు పార్టీల పరంగా ఏమైనా గొడవలు ఉంటే మీరు చూస్కోండి…అంతే కానీ అందులోకి తమ కుటుంబాన్ని లాగకండని విజ్ఞప్తి చేశారు. తమ కుమార్తె చావుకు కారణమైన వాడిని మాత్రం బయటకు రానీయకండి.. వాడికి శిక్ష వేయండి అని ప్రవళిక తల్లి విజయ డిమాండ్ చేశారు.

మా అక్క ఆత్మహత్యకు శివరామే కారణం: ప్రవళిక సోదరుడు
మా అక్క ఆత్మహత్యకు శివరామే కారణం అని ప్రవళిక సోదరుడు కుమార్ స్పష్టం చేశారు. తమకు న్యాయం జరగాలంటే అతన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ ఇతర పార్టీలు కూడా మా ఇంటికి రావొద్దు.. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దని కుమార్ విజ్ఞప్తి చేశారు. తన అక్కడ హాస్టల్‌కు తాను కొంచెం దూరంలోనే ఉంటానని, ఐదు నిమిషాల్లోనే అక్క హాస్టల్‌కు చేరుకుంటానని, వారానికి మూడు నాలుగు సార్లు ఇద్దరం కలిసి మాట్లాడుకుంటామని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా అక్క ప్రవళిక చనిపోవడానికి కారణం శివరామ్ అనే వ్యక్తి అని పేర్కొన్నారు.

అతను వేరే అమ్మాయి వల్ల పరిచయం అయ్యాడని, అప్పటి నుండి అక్కకి ఇష్టం లేకపోయినా తనతో మాట్లాడడం, కాల్ చెయ్యడం, హాస్టల్‌కు వచ్చి అందరి ముందు మాట్లాడమని ఇబ్బంది పెట్టడం వల్ల తన అక్క ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆఖరికి అమ్మకు, నాన్నకు, తనకు.. ఎవరికి చెప్పిన ఏమంటారో, ఇంట్లో ఏం సమస్య వస్తుందో అని చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందని చెప్పారు.

హాస్టల్ దగ్గర చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏడిపించడం, కాల్ చెయ్యడం, ఫ్రెండ్స్ ఫోన్ నుండి ఇలా వేరే వేరే నెంబర్స్ నుండి కాల్ చెయ్యడమే తన అక్క చనిపోవడానికి కారణమని అన్నారు. తన అక్కకి ఇప్పుడు న్యాయం జరగాలంటే శివరామ్ ఎక్కడ ఉన్నా పట్టుకుని తన అక్క చనిపోయిన్నట్టుగా ఉరి గానీ, ఎన్‌కౌంటర్ గానీ చేసి ప్రభుత్వం తమకు న్యాయం చెయ్యాలని కోరారు. తమకు న్యాయం జరగాలంటే శివరామ్‌ను శిక్షించాలని కుమార్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News