Wednesday, May 1, 2024

కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోని భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన కీలక మార్పుల బిలులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆమోదం తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి) ఇతర కమిషనర్ల స్థాయి అధికారుల నియామక సంబంధిత కార్యాచరణ యంత్రాంగం ఏర్పాటుకు పార్లమెంట్‌లో ఈ బిల్లులను తీసుకువచ్చారు. ఇటీవలి శీతాకాల సమావేశాల ముగింపు దశలోనే ఈ బిల్లుకు ఆమోదం దక్కింది. సిఇసి, ఇసిల నియామకాలు, సర్వీసు నిబంధనలు షరతులు , పదవీ కాల పరిమితి సంబంధిత అంశాలతో ఈ బిల్లును తీసుకువచ్చారు. దీని మేరకు ఎన్నికల ప్రధానాధికారుల నియామకానికి సెర్చ్ కమిటీ ఏర్పాటు జరుగుతుంది.

దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అధ్యక్షత వహిస్తారు. ఇందులో సెక్రెటరీ ర్యాంకుకు తక్కువ కాని ఇద్దరు అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరు ఎన్నికల సంఘం నిర్వహణాధికారుల నియామకానికి ఐదుగురు సభ్యుల ప్యానల్‌ను ఖరారు చేస్తారు. ఈ ప్యానల్ ద్వారానే ఎన్నికల సంఘం సిఇసి, ఇసిల నియామకాలు జరుగుతాయి. ఈ బిల్లుకు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడిక్ బిల్లుకు కూడా రాష్ట్రపతి సంతకం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రపతి ఇప్పుడు జిఎస్‌టి సవరణల బిల్లుకు , పన్నుల వసూళ్ల బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. ఎన్నికల సంఘం ప్రధానాధికారి, ఇతర కమిషనర్ల నియామకంలో నేరుగా కేంద్ర ప్రభుత్వ ప్రమేయానికి ఇప్పటి బిల్లు దారితీస్తుందని విపక్షాలు మండిపడ్డా, బిల్లుకు ఆమోదం దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News