Tuesday, April 30, 2024

నిరసన తెలుపుతున్న మల్లయోధులతో ప్రియాంక గాంధీ భేటీ!

- Advertisement -
- Advertisement -
డబ్లుఎఫ్‌ఐ చీఫ్‌ని తొలగించాలని పిలుపు

న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మల్లయోధులను(రెజ్లర్స్) శనివారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కలుసుకుని సంఘీభావం ప్రకటించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను తొలగించాలని పిలుపునిచ్చారు. మహిళా మల్లయోధులను ఆయన లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణ ఉంది. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను ప్రభుత్వమే కాపాడుతోంది అని నిందించారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న ప్రియాంక గాంధీ శనివారం ఉదయం జంతర్ మంతర్ చేరుకుని రెజ్లర్‌లతో మాటామంతీ జరిపారు. ప్రముఖ మహిళా రెజర్లయిన సాక్షి మలిక్, వినేష్ ఫోగట్ చెప్పింది ఆమె విన్నారు. జంతర్‌మంతర్ వద్ద విలేకరులతో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ శుక్రవారం దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రెజర్లతో షేర్ చేయాలన్నారు.

‘ఈ యువతులు మెడల్స్ గెలిచినప్పుడు వారు దేశానికి ఖ్యాతి తెచ్చారని అందరూ ట్వీట్ చేస్తారు. కానీ నేడు వారు రోడ్డు మీద కూర్చుని తమ వెతలు వెల్లబోసుకుంటున్నారు. కానీ ఎవరూ వినిపించుకోవడం లేదు. ఒకవేళ ఎఫ్‌ఐఆర్ దాఖలై ఉంటే దాని ప్రతిని వారితో పంచుకోవాలి’ అని ప్రియాంక గాంధీ అన్నారు.

“డబ్లుఎఫ్‌ఐ చీఫ్ పైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆయన రాజీనామా అన్నా చేయాలి లేక ఆయన్ని పదవి నుంచైనా తొలగించాలి. ఆయన ఆ పదవిలో ఉన్నంత కాలం వీరి కెరీర్‌పై ఒత్తిడి పెంచుతూనే ఉండగలరు’ అని ఆమె అన్నారు. ‘నావరకైతే ప్రధాని నుంచి ఎలాంటి ఆశలు లేవు. ఆయనకి రెజర్ల సమస్య గురించి చింత ఉంటే వారిని పిలిచి మాట్లాడి ఉండేవారు. పతకాలు గెలిచినప్పుడు మాత్రం ఆయన టీ విందుకు పిలిచి మాట్లాడతారు. ఆయన ఇప్పటికైనా వీరిని పిలిచి మాట్లాడి సమస్యను అర్థం చేసుకోవాలి’ అన్నారు. జంతర్ మంతర్ వద్ద ఇటీవల కాంగ్రెస్ నాయకులు భూపేందర్ హుడా, దీపేందర్ హుడా , ఉదిత్ రాజ్ కూడా వచ్చి రెజర్లకు సంఘీభావం ప్రకటించారు.

నిరసన తెలుపుతున్న రెజర్లకు మద్దతు పెరుగుతుండడంతో ఢిల్లీ పోలీసులు శుక్రవారం డబ్లుఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఆయనపై ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఢిల్లీ పోలీసుల తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేశారు. కేసు శుక్రవారం నమోదయినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఇప్పటికే డబ్లుఎఫ్‌ఐ చీఫ్‌గా 12ఏళ్లు పూర్తిచేసుకున్నందున ఆయన మరో పదవి కాలానికి పోటీచేయడానికి అనర్హుడు. ఆ బిజెపి ఎంపీని అన్ని పదవుల నుంచి తొలగించాలన్న డిమాండ్ కూడా ఉంది.

Brij Bhushan Sharan Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News