Tuesday, April 30, 2024

ఆ ‘ధారం’ తెంపొద్దు

- Advertisement -
- Advertisement -

Proposal to increase GST on Handlooms should be withdrawn:KTR

జిఎస్‌టి పెంపు (5-20%) ప్రతిపాదన విరమించుకోవాలి
కేంద్రం నిర్ణయంతో చేనేత, టెక్స్‌టైల్స్ రంగం కుదేలు

సంక్షోభ సమయంలో ఆదుకోవాల్సింది పోయి చావు దెబ్బ కొట్టడమే
2017 నాటి జీరో పన్ను నిర్ణయానికి కట్టుబడి ఉండండి
వినియోగదారులపై భారం పడితే ఉత్పత్తులకు డిమాండ్ తగ్గే ప్రమాదం
ఇప్పటికే రంగులు, రసాయనాలు, రవాణా ఖర్చులు పెరిగాయి
ఒకేసారి 7శాతం పెంచితే పరిశ్రమలు మూతపడే ముప్పు
పెంపు తప్పదనకుంటే చేనేత, పవర్‌లూమ్ వ్యాపారులకు జిఎస్‌టి మినహాయింపు పెంచాలి, వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన
కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌కు మంత్రి కెటిఆర్ ఆవేదనపూరిత లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : చేనేత మరియు వస్త్ర పరిశ్రమ పైన జనవరి 1, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిఎస్‌టి పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు ఒక లేఖ రాశారు. ఇప్పటికే టెక్స్‌టైల్స్ రంగం ముఖ్యంగా చేనేత రంగం గత రెండు సంవత్సరాలుగా కరోనా సంక్షోభం వలన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జిఎస్టీ పన్ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడం ఆ పరిశ్రమను చావు దెబ్బ కొడుతుందని ఈ సందర్భంగా కెటిఆర్ తన లేఖలో పేర్కొన్నారు. దేశంలోనే వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధిని కల్పించే వస్త్ర పరిశ్రమ, చేనేత రంగానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదనపు ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు కల్పించి ఆదుకోవాల్సిన సందర్భంలో.. ఇలాంటి నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దేశ చరిత్రలో ఏనాడు కూడా చేనేత ఉత్పత్తుల పైన పన్ను లేదని అయితే కేంద్రం ప్రవేశపెట్టిన జిఎస్‌టి ద్వారా తొలిసారి 5 శాతం పన్ను విధించిందని, అప్పుడే చేనేత రంగం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైందని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తాజాగా మరో ఏడు శాతం అదనంగా జిఎస్‌టిని వేయడం వలన చేనేత రంగం పూర్తిగా కుదేలైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్టంలోనూ అద్భుతమైన చేనేత సాంప్రదాయం ఉందని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీరలకు తెలంగాణ ప్రసిద్ధి చెందిందని ఈ రంగంలో ఉన్న నేతన్నలు జిఎస్‌టి పెంపుపైన తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఇప్పటికే చేనేత రంగంలో ఉన్న లాభదాయకత 5 శాతం కంటే తక్కువగా ఉన్నదని ఇలాంటి నేపథ్యంలో అకస్మాత్తుగా 7 శాతం టాక్స్‌ని పెంచడం వలన ఆ రంగంలోని నేతన్నలు పూర్తిగా నష్టాలపాలయ్యే అవకాశం ఉందన్నారు. సాంప్రదాయ చేనేత రంగం టెక్స్‌టైల్ ఉత్పత్తుల నుంచి భారీ పోటీ ఎదుర్కొంటున్నందున, సంక్లిష్టమైన మల్టీ స్టేజ్ ప్రొడక్షన్ వలన చేనేత ఉత్పత్తులకు అధిక అమ్మకపు ధర ఉంటుందని తద్వారా వాటికి క్రమంగా డిమాండ్ తగ్గుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఇప్పటికే పరిమితమైన మార్కెట్ ఉన్న చేనేత రంగంపై మరో 7 శాతం అదనపు భారాన్ని వినియోగదారులపై మోపడం వలన చేనేత ఉత్పత్తులకు మరింత డిమాండ్ తగ్గే ప్రమాదం ఉందన్నారు.

గత సంవత్సర కాలంగా పరిశ్రమకు అవసరమైన కాటన్, యార్న్ వంటి ముడి సరుకుల ధరలు 30 నుంచి 40 శాతం పెరిగాయని కరోనా సంక్షోభం వలన చైనా వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులు తగ్గి పరిశ్రమకు అవసరమైన రసాయనాల ధరలు సైతం భారీగా పెరిగాయన్నారు. గత సంవత్సర కాలంలో భారీగా పెరిగిన ఇంధన ధరల వలన రవాణా ఖర్చులు సైతం భారీగా పెరిగాయన్నారు. ఇలాంటి నేపథ్యంలో పెరిగిన ముడి సరుకు ధరల ప్రభావంతో పాటు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న అదనపు 7 శాతం పెంపు వలన అనేక చిన్న తరహా టెక్స్‌టైల్, హ్యాండ్‌లూమ్ యూనిట్లు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందన్నారు. దేశంలో ఉన్న హ్యాండ్‌లూమ్, టెక్సైల్ పరిశ్రమ సుమారు 80 శాతం వరకు సూక్ష్మ, మధ్యతరహా యూనిట్లుగానే ఉన్నదని, ఇప్పటికే ఎంఎస్‌ఎంఇపై ఉన్న పన్నుల భారం వలన వాటి పునరుద్ధరణ చాలా కష్టంగా మారిందని కెటిఆర్ అన్నారు. ఒకవేళ ఇలాంటి పరిమితులను ఎదుర్కొని పరిశ్రమలో కొనసాగాలనే నేతన్నలకు అదనపు పెట్టుబడి అవసరమయ్యే పరిస్థితి నెలకొందని, అయితే సంప్రదాయకంగా ఎంఎస్‌ఎంఇలకు బ్యాంకుల వంటి ఆర్థిక సంస్థలు నిధులు అందించడంలో చురుగ్గా ఉండవని, దీంతో నేతన్నల కష్టాలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే చేనేత రంగంలో ఉన్న అతి తక్కువ లాభదాయకత, సంక్లిష్టమైన ప్రక్రియ వలన కొత్త తరం చేనేత రంగానికి దూరమవుతుందన్నారు. 2011 లెక్కల ప్రకారం 43.3 లక్షల కుటుంబాలు చేనేత రంగంలో ఉంటే తాజా లెక్కల ప్రకారం కేవలం 30.44 లక్షల కుటుంబాలు మాత్రమే చేనేత రంగంలో ఉన్నాయన్నారు. 25 శాతం కుటుంబాలు చేనేత పరిశ్రమను వీడిపోయాయని, ఇదే ధోరణి కొనసాగితే దేశంలో రానున్న కొద్ది సంవత్సరాల్లోనే చేనేత రంగం అంతర్థానమయ్యే పరిస్థితి ఉందన్నారు. తాజా లెక్కల ప్రకారం చేనేత రంగంలో సుమారు 70 శాత మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఒబిసిలు ఉన్నారని, వారిలో 72 శాతం మంది మహిళలే ఉన్నారన్నారు. ఇలాంటి బలహీన వర్గాలకు బలమైన ప్రోత్సాహకాలతో అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ రంగంలో సుమారు 77 శాతం మంది స్కూల్ విద్య దాటని వారే ఉన్నారని ఇలాంటి వారికి పన్నుల చెల్లింపు సంక్లిష్టమైన ప్రక్రియ పైన పూర్తి అవగాహన ఉండే అవకాశం లేదని, తద్వారా వారికి మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు.

దేశంలో చేనేత రంగంలో పనిచేస్తున్న 67 శాతం కుటుంబాల ఆదాయం ఐదు వేల కన్నా తక్కువగా ఉందని, మరో 26 శాతం మంది కుటుంబాల ఆదాయం 10 వేల న్నా తక్కువగా ఉందని, మొత్తంగా 93 శాతం చేనేత కుటుంబాల ఆదాయం పదివేలకు మించడం లేదని, ఇలాంటి సందర్భంలో వారి ఉత్పత్తులపైన పన్ను భారాన్ని పెంచడం సరైన నిర్ణయం కాదన్నారు. గ్రామీణ ఆధారిత ఉపాధి అవకాశాలు కల్పించే చేనేత రంగాన్ని, దేశ వారసత్వ చరిత్రను ప్రపంచ పటం పైన ఆవిష్కరించే చేనేతను కేవలం ఒక పరిశ్రమగా కాకుండా దేశ సంస్కృతి సాంప్రదాయంగా చూడాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో గాంధీ మహాత్ముని ఆలోచనల మేరకు చేనేత రంగానికి పూర్తి పన్ను మినహాయింపు నివ్వాల్సిన అవసరం ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. 2017 మే 18న జిఎస్‌టి కౌన్సిల్ చేనేత ఉత్పత్తులు పైన ఎలాంటి పన్నులు లేకుండా ఉండాలని తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కెటిఆర్ కోరారు.

జిఎస్‌టి పన్ను పెంపు ప్రతిపాదనను విరిమించుకోవాలన్న మంత్రి కెటిఆర్, ఒక వేళ కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం మేరకు ముందుకుపోవాలని నిర్ణయించుకుంటే, ప్రస్తుతం ఉన్న 20 లక్షల జిఎస్‌టి స్లాబ్‌ను చేనేత, పవర్లూమ్ కార్మికులకు 50 లక్షల వరకు పెంచాలన్నారు. తద్వారా తక్కువ టాక్స్ బేస్ ఉన్న ఈ వర్గంలోని లక్షలాది మంది నేతన్నలకు ప్రయోజనం కలుగుతుందని మరోవైపు ప్రభుత్వానికి పన్ను నష్టం కూడా అతి స్వల్పంగా ఉంటుందన్నారు. 2015లో ప్రధాని మోడీ చేనేతకు కేంద్రం అందిస్తామన్న చేయూతను గుర్తు తెచ్చుకొని, గత సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రి స్వయంగా ‘వోకల్ ఫర్ హ్యాండ్ మేడ్’ అన్న నినాదం ఇచ్చారని, జాతీయ చేనేత ఉత్పత్తులను రెట్టింపు చేసి 1.25 లక్షల కోట్లకు, దేశ చేనేత ఎగుమతులను నాలుగు రెట్లు పెంచి 10 వేల కోట్లకు తీసుకుపోవాలని చేసిన ప్రకటనను దృష్టిలో పెట్టుకోవాలని, ప్రస్తుత చేనేత రంగానికి మరింత అదనపు ప్రోత్సాహం ఇచ్చినప్పుడే ఇది సాధ్యం అవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు.

ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న జిఎస్‌టి పన్ను పెంపు స్థూలంగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మేకిన్ ఇండియా నినాదానికి విరుద్ధమని మంత్రి కెటిఆర్ అన్నారు. దీంతోపాటు ఇప్పటికే మన కన్నా చిన్న దేశాలైన బంగ్లాదేశ్ వంటి దేశాలు టెక్స్‌టైల్ రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పన్ను పెంపు వలన అంతర్జాతీయంగా మన టెక్స్‌టైల్ ఉత్పత్తుల ధర పెరిగి ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీ పడలేని పరిస్థితి నెలకొంటున్నదన్నారు. ప్రస్తుత పన్నుల పెంపు వలన దేశీయంగా ఉత్పత్తి వ్యయం పెరిగే నేపథ్యంలో విదేశీ టెక్స్‌టైల్ పెట్టుబడులు భారతదేశానికి రావడం తగ్గుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా హ్యాండ్ మేడ్, నేచురల్ ఫైబర్, ఈకో ఫ్రెండ్లీ బట్టలపై ఆసక్తి, ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో భారతదేశానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, చేనేత, టెక్స్‌టైల్ రంగాన్ని బలోపేతం చేసినప్పుడే అంతర్జాతీయ స్థాయిలో దేశ వస్త్ర ఉత్పత్తులకు డిమాండ్ సృష్టించి, కేంద్రం ప్రతిపాదించిన ఘనమైన ఎగుమతుల లక్షాన్ని అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News