Saturday, April 27, 2024

న్యాయవ్యవస్థ ఆధునీకరణలో తెలంగాణ భేష్

- Advertisement -
- Advertisement -

CJI inaugurates new building at Warangal district court in Hanamkonda

రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ప్రశంసనీయం

కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన, భవనాల నిర్మాణానికి ప్రతిపాదనాలు పంపినా కేంద్రం నుంచి స్పందనలేదు
దేశానికి రోల్ మోడల్‌గా వరంగల్ కోర్టు భవనాలు
: టెన్-కోర్టు భవనాన్ని ప్రారంభిస్తూ సిజెఐ ఎన్.వి.రమణ ప్రశంసలు

మన తెలంగాణ/వరంగల్ : దేశవ్యాప్తంగా పెండింగ్ కేసులు పరిష్కరించాలంటే కోర్టులను ఆధునీకరించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ పేర్కొన్నారు. ఆదివారం హన్మకొండలోని వరంగల్ కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో రూ.23 కోట్ల వ్యయంతో నిర్మించిన టెన్ కోర్టు భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో జస్టిస్ ఎన్‌వి రమణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల కొరతతో పాటు కోర్టుల్లో సౌకర్యాలు లేకపోవడంతో పెండింగ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాల్సి ఉందని, పలు రాష్ట్రాలు తనవంతు నిధులను కేటాయించడంలో నిర్లక్షం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు..

న్యాయవ్యవస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అవసరమైన నిధులు మంజూరు చేసి మద్దతు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈవిషయంలో ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ కోర్టు కాంప్లెక్స్ పరిధిలో 71 వేల పైచిలుకు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామన్నారు. కోర్టుల పునర్నిర్మాణం ఆవశ్యకతపై దేశవ్యాప్తంగా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించామని తెలిపారు. దేశ వ్యాప్తంగా కోర్టుల్లో సౌకర్యాలు, భవనాల నిర్మాణానికి జ్యూడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామని తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రం నుండి స్పందన లేదన్నారు. నాఆలోచనలకు, భావాలకు తగినవిధంగా వరంగల్ కోర్టు కాంప్లెక్స్ ఆధునీకరించబడిందని తెలిపారు.

– దేశవ్యాప్తంగా ఇదొక నమూనా..

కోర్టుల ఆధునీకరణకు వరంగల్ నూతన టెన్ కోర్టు భవనాన్ని మాడల్‌గా తీసుకొని ఆధునీకరించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈకోర్టు భవనంలో ఫోక్సో కోర్టు, ఫ్యామిలీ కోర్టుల నమూనాలను దేశ వ్యాప్తంగా ఇదేవిధంగా చేయాలని నమూనా తీసుకుంటున్నట్లు తెలిపారు. న్యాయవాదులు స్వాతంత్య్ర సమరయోధుల వారసులని తెలిపారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మగాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్‌లతో పాటు వేలాది మంది న్యాయవాదులు ఉద్యమించారని, తెలంగాణలోనూ నిజాంపాలనపై ఎంతోమంది న్యాయవాదులు తమ ఆప్తులు త్యజించి ఉద్యమించి త్యాగాలు చేశారన్నారు. స్వాతంత్య్రం అనంతరం న్యాయవాదులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని కేవలం కోర్టులకే పరిమితమవుతున్నారన్నారు. న్యాయవాదులు సమాజంలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, సమాజాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

యువ, పేద, గ్రామీణ ప్రాంత న్యాయవాదులకు కోవిడ్ వలన న్యాయవాద వృత్తికి దూరమవుతున్నారని గుర్తించి సహాయం చేయాలని కేంద్రానికి సూచించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత మొబైల్ నెట్‌వర్కింగ్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. సుప్రీంకోర్టులో గ్రామీణ ప్రాంత న్యాయవాదులు తమ ఉండే ప్రాంతం నుండే కేసు నమోదు చేసి ఆర్గనైజ్ చెప్పే విధంగా సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. న్యాయవాదులు మాతృభాషను ప్రేమించి సాహిత్యం చదవాలని, మాతృభూమిని ప్రేమించాలని సూచించారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్‌వీ రమణ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో కోర్టులను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు.

మరో హైకోర్టు న్యాయమూర్తి, వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి జస్టీస్ నవీన్‌రావు మాట్లాడుతూ.. కాకతీయుల చారిత్రక ప్రాశస్తానికి అనుగుణంగా టెన్‌కోర్టు బిల్డింగ్ నిర్మించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు రాజశేఖర్‌రెడ్డి, ఉజ్వల్ భూయాన్, వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పశుపతి ఈశ్వర్‌నాధ్, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News