Monday, April 29, 2024

‘ఆదిపురుష్’పై ఆగని నిరసనలు

- Advertisement -
- Advertisement -

లక్నో/వారణాసి: ఆదిపురుష్ సినిమా నిర్మాతలకు కనకవర్షం కురిసిస్తున్నప్పటికీ ఈ సినిమాపై వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కొంత మంది సినిమాకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించడమే కాకుండా సినిమాకు చెందిన పోస్టర్లను చించి వేశారు. మరో వైపు హిందూ మహాసభ సంస్థ సినిమా నిర్మాతలపై లక్నో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా సమాజ్‌వాది పార్టీ కూడా సినిమాకు వ్యతిరేకంగాతీవ్ర వ్యాఖ్యలు చేసింది. సినిమాలోని చౌకబారు డైలాగులతో హిందూ మత విశ్వాసకుల మనోభావాలు గాయపడ్డాయని, ఈ సినిమా ఓ అజెండాలో భాగమని ఆ పార్టీ ఆరోపించింది. రామాయణం అధారంగా తీసిన ఆదిపురుష్ సినిమాలో పాత్రల చిత్రీకరణ, డైలాగులపై హిందుత్వ వాదులతో పాటు, రాజకీయ పార్టీలు కూడా మండి పడుతున్న విషయం తెలిసిందే.

సోమవారం వారణాసిలో ఓ హిందుత్వ సంస్థకు చెందిన సభ్యులు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేయడమే కాకుండా సినిమా పోస్టర్లను చించేశారు. అంతేకాదు సినిమాను చూడొద్దంటూ జనానికి విజ్ఞప్తి చేశారు. ఓ ఆలయం వద్ద సమావేశమైన వీరంతా సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సినిమాప్రదర్శిస్తున్న సిగ్రాలోని ఓ మాల్ వద్దకు ఊరేగింపుగా బయలుదేరారు. సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేసిన వారంతా మాల్‌లోకి చొరబడడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక రాష్ట్ర రాజధాని లక్నోలో హిందూ మహాసభ కార్యవర్గ సభ్యులు హజరత్ గంజ్ పోలీసు స్టేషన్‌లో ఓ ఫిర్యాదు నమోదు చేశారు. సినిమాలో నటీనటులు, నిర్మాత, దర్శకుడిపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా దీనికి సంబంధించి ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

మరో వైపు తమరాజకీయ బాస్‌లసొమ్మునుఉపయోగించి ఒక అజెండాతో సినిమాలు తీసి ప్రజల విశ్వాసాలతో ఆటలాడుకునే వారి రాజకీయ స్వభావాన్ని సెన్సార్ బోర్డు చెక్ చేయాలని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు, ‘ సెన్సార్ బోర్డు ధృతరాష్ర్టుడిగా మారిపోయిందా?’ అని ఆయన ప్రశ్నించారు. చౌకబారు డైలాగులతో సినిమా ద్వారా కోట్లాది భారతీయులకు స్ఫూర్తిదాయకమైన రాముడి వ్యక్తిత్వాన్ని, ఆయన గాథను తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీకి చెందిన మరో నేత శివపాల్ యాదవ్ ఆరోపించారు. ‘కోట్లాది మంది సనాతన విశ్వాసకుల మనోభావాలు గాయపడ్డారు. దీనికి ‘సనాతనుల’మనిగా చెప్పుకొనే బిజెపి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’అని హిందీలో చేసిన టీట్‌లో శివపాల్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News