Friday, April 26, 2024

బంగారం లాంటి బతుకు చిన్నాభిన్నం..

- Advertisement -
- Advertisement -

మక్తల్ :  అప్పటి వరకు అందరి మధ్య ఆడుతూపాడుతూ గడిపిన యువకుని జీవితం.. ఒకే ఒక్క కారణంతో తోటివారు సైతం దగ్గరకు రాని పరిస్థితి కలిగి బతుకును చిన్నాభిన్నం చేసింది. ఆపద సమయంలో అయినవారు సైతం కానరాకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల నడుమ దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్‌కు చెందిన దశరథ్.. కన్నవారు చిన్నప్పుడే దూరమై, అయినవారు సైతం అక్కున చేర్చుకోని విపత్కర పరిస్థితుల్లో మేమున్నామంటూ చిన్ననాటి స్నేహితులే అన్నీ తామై ఆదుకుంటుండడంతో అతనికి కొంతైనా ఉపశమనం కలుగుతోంది. ప్రస్తుతం అతని దీనస్థితిపై మన తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం..
చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం..
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్‌కు చెందిన మ్యాతరి వెంకటమ్మ, వీరన్నల ఏకైక కుమారుడైన దశరథ్ చిన్ననాటి నుంచే చదువులో చురుగ్గా ఉండేవాడు. అయితే అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ దూరం కావడంతో చదువును మధ్యలోనే ఆపివేసి కూలీపనులకు వెళ్తూ గ్రామంలోని తమ గుడిసెలోనే జీవనం కొనసాగించాడు. ఆ తర్వాత సోదరికి వివాహం జరగడంతో బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి ఆటోను నడపడం ప్రారంభించాడు.
సోరియాసిస్‌తో బతుకు ఆగమాగం..
అయితే 2016 సంవత్సరం దశరథ్ జీవితాన్ని తలకిందులు చేసింది. అప్పటి వరకు తన కష్టంతో ప్రశాంతంగా సాగుతున్న అతని జీవితంలోకి సొరియాసిస్ రూపంలో పెద్ద కష్టమే వచ్చిపడింది. దశరథ్‌కు సొరియాసిస్ సోకడంతో అతని రూపురేఖల్లో అనుకోని మార్పులు వచ్చి, అయినవారు సైతం దగ్గరకు రాని పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ అద్దెకు ఆటో తీసుకుని నడుపుతూ జీవనం సాగించే దశరథ్‌కు వ్యాధి సోకడంతో అద్దెకుంటున్న ఇంటిని సైతం ఖాళీ చేయించారు. దీంతో మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ ముందు ఆటోలోనే జీవనం కొనసాగిస్తున్నాడు దశరథ్. వ్యాధి ఇప్పట్లో నయం కాదని, చాలాకాలం వరకు మందులు వాడితే ఫలితం ఉంటుందని గాంధీ ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో చేసేది ఏమీలేక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఆదుకుంటున్న చిన్ననాటి స్నేహితులు..
అవివాహితుడైన దశరథ్ ప్రస్తుత పరిస్థితిని చూసి చలించిపోయిన అతని చిన్ననాటి స్నేహితులు దశరథ్‌కు ఆపద సమయంలో అన్నీ తామై చూసుకుంటున్నారు. దశరథ్‌కు నెలవారీ మందులు, ఖర్చుల కోసం ప్రతినెలా కొంతమొత్తం నగదు రూపంలో ఇస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న దశరథ్ స్నేహితులు ఎల్.రాజేశ్వర్‌రెడ్డి, రమేష్, లక్ష్మీకాంత్‌రెడ్డితో పాటు అబ్దుల్ ఖాదర్, నరేందర్, రాజశేఖర్, గోవర్ధన్, ఉసేన్, ఖదీర్, నర్సోజీ, శేఖర్, శ్రీదేవి, సుమతి, నర్మద, లోక్‌నాథ్‌లు గత రెండేళ్లుగా ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.80వేలు దశరథ్‌కు అందించి అతనికి ఆపదకాలంలో అండగా ఉంటున్నారు. దశరథ్ ప్రస్తుతం అద్దెకు ఆటోను తీసుకుని నడుపుతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని తామే ఆటోను సహాయంగా అందించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం దశరథ్ దీనస్థితిని గుర్తించి అండగా ఉండాలని అతని స్నేహితులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి..
నేను గత ఏడేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నాను. ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. దీంతో ఆటోలోనే దుర్భర జీవనం గడుపుతున్నాను. నాకు ప్రస్తుతం ఎవరూ లేకపోవడంతో నా స్నేహితులు అండగా నిలబడ్డారు. ప్రభుత్వం, దాతలు మానవతా హృదయంతో స్పందించి నన్ను ఆదుకోవాలి.
దశరథ్, సొరియాసిస్ బాధితుడు
మాలో ఒకడిగా..
దశరథ్‌కు వ్యాధి సోకడంతో అతడిని ఎవరూ దగ్గరకు రానివ్వడం లేదు. అతడి పరిస్థితిని తెలుసుకున్న మేము మాకు తోచిన సహాయం అందిస్తూ మాలో ఒకడిగా చూసుకుంటున్నాం. త్వరలోనే మేమంతా కలిసి స్వంతంగా ఆటోను ఇప్పించే ప్రయత్నంలో ఉన్నాం. ప్రభుత్వపరంగా ఆదుకుని చేయూతనివ్వాలి.
..ఎల్.రాజేశ్వర్‌రెడ్డి, దశరథ్ స్నేహితుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News