Tuesday, April 30, 2024

గుండెల్లో పెట్టుకోదగిన ప్రసంగం

- Advertisement -
- Advertisement -

ఉపన్యాసం ఒక కళ. అందంగా ఆకర్షణీయంగా మాట్లాడటం, హృదయాన్ని కదిలించేలాగా, గుర్తుంచుకొని పునః పునః సభా సదులు స్మరించుకొనే లాగా, మహత్పూర్వకంగా, స్ఫూర్తివంతంగా మాట్లాడడం, స్పృహ నుండి చైతన్యం దాకా భావనలు రంగరించి మనుషుల్ని జాగృతం చేయడం మంచి వక్తలు చేసే పని. ఆర్టిస్టా, సైంటిస్టా, ఎకనమిస్టా, ఇండస్ట్రీయలిస్టా, ఆంట్రప్రెన్యుయరా, పొలిటీషియనా, ఎడ్యుకేషనలిస్టా, ఆర్కిటెక్టా, సోషల్ వర్కరా, పాత్రికేయుడా, సాహిత్యవేత్తనా? వక్త ఫీల్డు ఏదైనా కావొచ్చు. ఎవరితో ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఏం మాట్లాడుతున్నాను అనే విషయాలను గమనంలో ఉంచుకుని చేసే ప్రసంగం ఎవరికైనా అవసరమే. విద్యార్థినీ, విద్యార్థులకైతే మరీ అవసరం.

ఎందుకంటే విద్యార్థి ముందు రెండు అంశాలుంటాయి. అవి. మొదటిది జీవితం, రెండోది కెరీర్. ఈ రెండిటికీ కోచింగ్ ఇప్పించాల్సిందే. అయితే, పాఠశాలలో చేరింది మొదలు చదువు పూర్తికావడం, ఉపాధి శిక్షణ, ఉద్యోగ నిర్వహణ, అనుకున్న లక్ష్యం, చేరుకునే గమ్యం, చేతికందే ఫలితం, చేజారే ఆస్తి అంతస్తులు, తృప్తి, అసంతృప్తి, వ్యయ ప్రయాసలు, లాభ నష్టాలు, అవరోధాలు, సహకారం, ఎదురీత, గుర్తింపు, మన్ననలు, అంతిమంగా సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఇవన్నీ కెరీర్‌లోనూ జీవితంలోనూ భాగాలు. వీటిని గురించి పుస్తకాలు చెప్పేది తక్కువ. అనుభవం, అధ్యయనం, పరిశోధనల సమన్వయతో సముచిత రీతిన ప్రాపంచిక విషయాలను తరగతిలో అధ్యాపకులు బోధించేది తక్కువే. అందుకే ఫ్రెషర్స్ డే, ఫేర్ వెల్ డే, ఓరియెంటేషన్లు, ఇండక్షన్లు, అవగాహనా సదస్సులు, వార్షికోత్సవాలు, స్నాతకోత్సవాలు మొదలు ఆయా సందర్భాల్లో విద్యాసంస్థలు ప్రముఖులను రప్పించి విద్యార్థులకు ప్రేరణ కల్పిస్తుంటాయి. టీచర్లు లెక్చరర్లకంటే ఇట్లా ప్రత్యేక సందర్భాల్లో విద్యా సంస్థలను సందర్శించి ప్రసంగించే అతిథులనే కొన్ని పర్యాయాలు పిల్లలు బాగా గుర్తుంచుకుంటారు. ప్రత్యేక ప్రసంగాల ప్రభావం అట్లాంటిది మరి. పాదు తీసి మొక్కకు ఎరువు వేయడం లాంటిది, అభ్యసనాన్ని డయాగ్నసిస్ చేసి అవాంతరాలను తొలగిస్తుంది ప్రేరణ. కాబట్టే, ప్రేరణోపన్యాసాలను పిల్లలూ ఇష్టపడతారు.

మొన్న, జూలై 3న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా సత్యవేడులో గల ‘క్రియా విశ్వవిద్యాలయం’ తన మొదటి స్నాతకోత్సవాన్ని చెన్నైలో జరుపుకుంది. ఈ వేడుకలో వివిధ రంగాల ప్రముఖులతో పాటు సుప్రసిద్ధ ఆర్థికవేత్త, ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. రాజన్ ప్రసంగం విద్యార్థులను జ్ఞానం వైపుకు ప్రోత్సహిస్తూ ఆనందం నింపుతూ కొనసాగింది. ఏ ఉపన్యాసమైతే విద్యార్థలను తట్టిలేపుతూ Insight, Outlook ను ప్రసాదించగలదో అటువంటిదే క్రియా’ర్థుకు రఘురాం రాజన్ ఇచ్చారు. తమిళనాడుకు చెందిన రఘురాం రాజన్ బీహార్ నివాసి.

ఢిల్లీ ఐఐటిలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివిన రాజన్ అహ్మదాబాద్ ఐఐయంలో ఎంబిఎ చేసి, అమెరికాలోని మస్సాచుసెట్స్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ తీసుకున్న ప్రతిభాశాలి. చికాగో విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా, ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకానిమిస్ట్‌గా, ఆర్‌బిఐ కి ఇరవై మూడవ గవర్నర్ (2013 -2016) పని చేశారు. ఆర్థిక రంగానికి సంబంధించి ‘వాట్ ఎకానమీ నీడ్ నౌ’, ‘ద థర్డ్ పిల్లర్’, ‘ఫాల్ట్ లైన్స్’ , ‘ఐ డూ వాట్ ఐ డూ’, ‘సేవింగ్ కాపిలిజం ఫ్రం ద కాపిటలిస్ట్’ వంటి గ్రంథాలు రాజన్‌కు మంచి ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ప్రముఖ ‘టైమ్’ మేగజైన్ రఘురాం రాజన్‌ను 2016 సంవత్సరానికి ప్రపంచ అత్యంత ప్రభావశీలురైన 100 మందిలో ఒకరుగా పేర్కొంది. తమతో విద్యోత్సవంలో పాలు పంచుకుంటున్న వ్యక్తి ప్రతిభాశాలి, అగ్రశ్రేణి ప్రపంచ ఆర్థికవేత్త కావడంతో ‘క్రియా’ గ్రాడ్యుయేట్లకూ, పోస్ట్ గ్రాడ్యుయేట్లకూ, పరిశోధకులకూ, ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పై పెచ్చు విద్యార్థులంతా రాజకీయ, ఆర్థిక, వ్యాపార శాస్త్రాల్ని అధ్యయనం చేస్తున్న వాళ్లవడం రాజన్ కూ ఉత్సాహాన్నిచ్చింది. అన్నిటినీ మించి యూనివర్సిటీకి ‘Krea’ అనే పేరు ఉండడం రాజన్‌కు బాగా నచ్చింది. ఎందుచేతనంటే, తెలుగైనా, సంస్కృతమైనా క్రియ అంటే ఇంగ్లీషులో ‘యాక్షన్’ అని కదా అర్థం. పేరుకు తగ్గట్టుగానే క్రియా ఛాత్రులు రాజన్‌కు వర్తమాన ప్రపంచం -చదువులు, ఉపాధి, మానవ వనరులు, అభివృద్ధి భిన్న దృక్కోణాలపై పలు సంశోధనాత్మక ప్రశ్నలు సంధించారు. ప్రశ్నలన్నిటికీ తాత్వికంగా, సామాజికంగా విస్త్రృత ప్రాతిపదికన ఉల్లాసంగా, నిశితంగా రాజన్ కూడా స్పందించారు.

ఇంటరాక్షన్‌లో ఓ విద్యార్థి దేశ భవిష్యత్తు, అభివృద్ధి గురించి అడిగితే Our development has to build on our unique aspects, more specifically on our liberal democracy and institutions, and that will be our strength. The future is limitless అని బదులిచ్చారు. అంటే వ్యవస్థలకూ, సంస్థలకూ ప్రజాస్వామ్య విలువల ఆవశ్యకత ఎంతగా ఉందో రాజన్ మాటల్లో తెలుస్తుంది. దేశ ఆర్థిక పునరుద్ధరణ కోసం మెరుగైన విద్య, వైద్య వ్యవస్థలను సృష్టించడం తప్ప మరో మార్గం లేదని, పటిష్ఠమైన సంస్థాపనలు మరెన్నో అవసరమని, వర్క్ ఫోర్స్ గణనీయంగా పెరిగి వర్క్ కల్చర్‌లో రావాల్సిన గుణాత్మక మార్పు ల గురించి అనేక కథనాలను రాజన్ యువకులతో ఉదాహరించారు.

మన దేశ శ్రామికశక్తిలో మహిళా భాగస్వామ్యం తనను నిజంగా కలచి వేసిందని, ఇది సౌదీఅరేబియాతో పాటు జి 20 లో మిగతా దేశాలైన అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్, మెక్సికో, రష్యా, దక్షిణాఫ్రికా, టర్కీ, ది యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్‌లతో పోల్చి చూసినప్పుడు అత్యల్పంగా ఉందని, సౌదీ అరేబియా సామాజిక దృక్పథంలో మార్పు వచ్చిన కారణంగా వారి శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం 33% కాగా, మనం ఇప్పటికీ 20% వద్ద ఉన్నామని, ఈ విషయంలో మనం చాలా పరిణతి వికాసం సాధించాల్సివుందని ఆయన అన్నారు.

అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మనకు పెద్ద ఎత్తున ‘రియాలిటీ చెక్’ అవసరముందని ఆ పదాన్ని నొక్కి చెప్పారు. విద్యాసంస్థల మధ్య అనుసంధాన ప్రగతిని ప్రస్తావిస్తూ ‘బలమైన విశ్వవిద్యాలయాల నుండి బలహీనమైన వాటికి తమ విద్యా నాణ్యత వ్యాప్తి చెందేలా కృషి జరగాలి. క్రియా వంటి విశ్వవిద్యాలయాలు పరిశోధనా విశ్వవిద్యాలయాలుగా మారాలి, తద్వారా మీరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వగలరు, డాక్టరేట్లు చేయించగలరు, ఇది ఇతర విశ్వవిద్యాలయాలకు మీ ఘనతన విస్తరించగలరు. ఒక ecosystem సృష్టించబడి ప్రయోజనాలు దశ దిశలా అందాలి. ఇది రాత్రికి రాత్రి జరిగే వ్యవహారం కాదు. కనీసం రెండు మూడు దశాబ్దాలు పడుతుంది. అయితే, ఏదైనా విజన్ తో పాటు మిషన్ ఉంటేనే సాధ్యం. ముందడుగు ఇప్పుడే ఇక్కణ్ణుంచే ఆరంభం కావాల’ ని రాజన్ ఉద్బోధించారు.

కెరీర్ గురించి మా కొత్త తరానికి మీరిచ్చే సలహా ఏమిటన్నప్పుడు “కెరీర్ సలహా కోసం తరుచుగా నన్నెవరైనా అడిగినప్పుడు మూడు ఆలోచనలను వాళ్లతో పంచుకుంటాను. అవే మీతోనూ పంచుకుంటాను. 1. మిమ్మల్ని మీరు తెలుసుకోండి (know yourself). మీరు నిజంగా ఎవరో, ఏది మిమ్మల్ని నిజంగా ఉత్తేజపరుస్తుందో తెలుసుకోండి. 2. మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి. (challenge yourself) విషయాలు తేలికగా ఉంటే, మీరు ఎదగలేరు. మీరు నిజంగా ఎవరో మీకు తెలియదు. మిమ్మల్ని సవాలు చేసే దాన్ని కనుగొనండి. మీలో దాగి ఉన్న లోతులను మీరు కనుగొంటారు. 3. ఇతరులను కూడా మీతో ఎదగనివ్వండి (take others with you). మీరు పెరిగిన సమాజానికి, మిమ్మల్ని పోషించిన దేశానికి, ఏదైనా తిరిగి ఇవ్వడానికి మీరు రుణపడి ఉన్నారు. తిరిగి ఇవ్వడం అనేది ఒక పని కాదు కానీ మనందరం కోరుకునే ఒక ప్రత్యేక హక్కు నెరవేర్పుకు మూలం’ రాజన్ చెప్పిన ఈ మూడింటినీ ఆచరిస్తే విద్యార్థులు సమర్థవంతులుగా మారిపోగలరు.

తమను తాము ‘సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ’ గా రూపొందించుకోగలరు. పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరిది ‘ఎలుక పందెం’ లానే అనిపిస్తుంది, ఏం చేయమంటారని నిరాశ వ్యక్తం చేసిన బృందానికి ‘మీరు ఎలుక రేసులో భాగం కావడానికి నిరాకరించవచ్చు. నేడు చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఒక దేశంగా ధనవంతులుగా ఎదుగుతున్నప్పుడు, మనం చేసే పనిలో, మనం ఎక్కడ ఉన్నా ప్రాథమిక జీవనాన్ని పొందగలుగుతాము. అప్పుడు మీరు పొందుతున్న జీతం నుండి కాకుండా మీరు చేసే పనిలో నేర్పు, నైపుణ్యాల నుండి ఆనందాన్ని పొందగలరు’ అని వ్యాఖ్యానించారు. ఎలుక పందెం అనుకొని ఏమీ చేయకుండా ఉండకూడదు. రొటీన్ లైఫ్‌కు క్రియేటివ్ టచ్ ఇవ్వడం అలవరచుకోవాలనే సూచనే ఈ వ్యాఖ్యలోని అంతరార్థం. కార్యక్రమం చివర ‘యువకులుగా మీరు మెరుగైన భారతదేశం కోసం పోరాడాలి, దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. గతంలోని ఉత్తమమైన వాటిని ప్రతిబింబించే దేశం కోసం పోరాడండి. ఏది ఉత్తమమైనది అనే దానిపై మనకు నిరంతర ఘర్షణ ఉంటుంది. ఉత్తమమైనదెదో, దానిని నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీదే. ఆదర్శమూర్తులు మన దేశ రూపశిల్పులైన మన జాతీయోద్యమ నాయకులు భావించిన భారతదేశం మహోన్నతమైనది, చాలా సాహసోపేతమైనది.

ప్రయోగాత్మకమైంది. ఆ మహనీయులు సృష్టించిన ఉత్తమమైన వాటిని కోల్పోకుండా, ప్రతి దానినీ కాపాడుకుందాం. ఇందుకు మీకున్న శక్తితో ఏది చేసినా ఫరవాలేదు. సామాజిక కార్యకర్తగా ఎన్‌జిఒగానే పని చేయాల్సిన అవసరం లేదు, మీరు మీదైన శైలిలో ప్రజ్ఞావంతంగా ప్రపంచంలోనే అత్యుత్తమ విడ్జెట్ (widget)ను రూపొందించి, దానికి విలువను జోడించండి. మీలోని మేధాసంపత్తిని సృజనాత్మకతను వెలికి తీయండి” అంటూ రాజన్ ఇచ్చిన పిలుపు యువత ఎప్పటికీ గుండెల్లో పెట్టుకోదగినది. అక్కడ నేనైనా సరే, అతి కష్టం మీద సిలబస్ పూర్తి చేయగలనేమో కానీ, భావజాలం, భవిష్యద్దర్శనం ఉట్టిపడే అసలైన పాఠం మిగిలే ఉంటుంది. మిగిలున్న ఆ అసలైన పాఠం చెప్పినందుకు రఘురాం రాజన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు, నా తరఫునా భవిష్యత్తరాల తరఫున కూడా.

డా. బెల్లియాదయ్య
9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News