Tuesday, April 30, 2024

రాహుల్, ప్రశాంత్ కిషోర్ తదితరులపై పెగాసస్ స్పైవేర్

- Advertisement -
- Advertisement -

పెగాసెస్ మరో కలకలం
రాహుల్, పికె, ఇద్దరు కేంద్రం మంత్రులపైనా నిఘా
మాజీ సిఇసి లావాసా, మమత మేనల్లుడు అభిషేక్ కూడా బాధితులు
వైరాలిజిస్టు, సుప్రీం ఉద్యోగిని ఫోన్లపైనా నేత్రం
‘ది వైర్’ మరో సంచలనం
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్‌తో ప్రభుత్వం టార్గెట్ చేసుకున్న ప్రముఖుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ నేత రాహుల్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మాజీ సిఇసి అశోక్ లావాసా, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ పటేల్ వంటి వారు ఈ భారీస్థాయి హ్యాకింగ్‌కు గురైనట్లు ది వైర్ వార్తాసంస్థ పెగాసస్ ప్రాజెక్టు రెండో వార్తాకథనంలో తెలిపింది. పశ్చిమ బెంగాల్ సిఎం మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ప్రముఖ వైరాలజిస్టు గగన్‌దీప్ కాంగ్ పేరు కూడా ఉంది. ఇజ్రాయెల్ స్పైవార్ హ్యాకింగ్ లిస్టులో రాహుల్‌వాడే రెండు ఫోన్ నెంబర్లు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే ఇంతకు ముందటి వరకూ ఆయన వాడిన నెంబర్లు ఇప్పుడు లేకపోవడంతో అప్పటి సమాచారం పూర్తిగా నిర్థారితం కావడం లేదని ఈ పరిశోధనాత్మక కథనంలో తెలిపారు. అయితే రాహుల్‌కు అత్యంత సన్నిహితులైన ఐదుగురు ఫోన్ నెంబర్లు కూడా ఈ స్పైవార్ టార్గెట్ అయిన 300 మంది జాబితాలో ఉన్నాయని నిర్థారించారు. ముందు రోజున వైర్ ప్రచురించిన కథనంలో జర్నలిస్టులు, ప్రముఖ నేతలు, హక్కుల ఉద్యమ నాయకులు అధికారులు జాబితాలో ఉన్నారని ఓవరాల్‌గా తెలిపారు. ఇది సంచలనాత్మకం అయింది. అయితే మరుసటి రోజున ( సోమవారం ) ఈ కథనం రెండో భాగంలో భాగంగా ఈ కథనం పొడిగింపునకు పెగాసస్ ప్రాజెక్టు అని పేరుపెట్టి వెలువరించింది. ఈ అత్యంత శక్తివంతమైన స్పైవేర్ ప్రశాంత్ కిషోర్, మమత మేనల్లుడు బెనర్జీల స్మార్ట్‌ఫోన్లలో నిర్థారితం అయినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే పలు ప్రభుత్వ ఆధీనపు సంస్థలు తమ వేగు చర్యల కోసం సాధారణంగా స్పైవేర్‌ను కొనుగోలు చేస్తాయి. ఇటువంటి స్పైవేర్‌లలో ఇజ్రాయెల్ స్పైవేర్ మెగాసస్ ఉంది.

దీనిని ఇజ్రాయెల్ ఎన్‌ఎస్‌ఒ గ్రూప్ ప్రభుత్వ సంస్థలకు కట్టబెడుతోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వానికి కూడా అందినట్లు వెల్లడించారు. జాబితాలోని ఇద్దరు మంత్రులలో ఒకరైన వైష్ణవ్ ఇటీవలే రైల్వే, ఐటి మంత్రి అయ్యాచరు. ఇక ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు చెందిన సన్నిహిత వర్గాల దాదాపు 18 ఫోన్లు కూడా హ్యాకింగ్‌కు గురయినట్లు తెలిపింది, 2019 లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని మోడీ ఎన్నికల నియామావళిని ఉల్లంఘించారనే విషయాన్ని ప్రస్తావించిన ఎన్నికల ప్రధానాధికారి అశోక్ లావాసా పేరు కూడా జాబితాలో ఉంది. ఇక ఎడిఆర్ వ్యవస్థాపకులు జగదీప్ ఛోక్‌హర్ ఫోన్లు కూడా హ్యాక్ అయ్యాయి. ఇక సుప్రీంకోర్టులో ఉద్యోగిని అయిన ఒకరి, వారి సమీప బంధువులకు చెందిన 11 మందికిపైగా ఫోన్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు దిగిన ఉద్యోగిని ఆమె కావడం కీలకం అయింది. ఆవిడ ఫోన్ నెంబర్లు వలలో పడ్డాయి. ఇక మమతకు ఎన్నికల వ్యూహకర్తగా మారి ఎన్నికల విజయాలకు కీలకంగా మారుతోన్న ప్రశాంత్ కిషోర్ ఫోను నెంబర్లు బాగానే హ్యాకింగ్ అయి, ఆయన స్నూపింగ్ జాబితాలో ప్రముఖంగా ఉన్నట్లు తేల్చారు. వైరాలిజిస్టు గగన్‌దీప్ కాంగ్ ఈ జాబితాలో ఉన్నారు. 2018లో ఆమె ఫోన్లు హ్యాక్ అయ్యాయి. నిఫా వైరస్‌కు వ్యతిరేకంగా ఈ వైరాలిజిస్టు పాటుపడుతున్న దశలో ఈ పరిణామం జరిగింది. ఇక స్పైవేర్ లక్షంలో ఇండియాకు చెందిన బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అధినేత హరి మీనన్, ఈ సంస్థకు చెందిన ప్రముఖ ఉద్యోగి ఒకరు ఉన్నట్లు గుర్తించారు.

Rahul and Prashant Kishor among Pegasus Target

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News