Tuesday, May 7, 2024

ముసురు ముసుగులో తెలంగాణ.. మరో 2, 3రోజులు ఇలాగే!

- Advertisement -
- Advertisement -

మనతెలగాణ/హైదరాబాద్: ఈ శాన్య రుతుపవనాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వాతావరణం మారిపోయింది. తెలంగాణ అంతటా ముసురు ముసుగేసింది. అకాల వర్షాలు రైతుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు కేరళ, ఏపితోపాటు బంగాళాఖాతం సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రభావం కొంత తెలంగాణపై కూడా పడింది. రాష్ట్రమంతటా ఆకాశం మేఘావృతంగా మారింది. గురువారం గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలోని పలు చోట్ల వర్షం కురిసింది.

రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురసింది. కిందిస్థాయిలో గాలులు తూర్పు ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. రాగల 48గంటల పాటు రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఈ నెల 26న దక్షిణ అండమాన్ సమీపంలోని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

అకాల వర్షాలతో ఆగం ఆగం!
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. వానాకాలంలో సాగు చేసిన పలు రకాల పంటకోతలు జోరుగా సాగుతున్నాయి. వరికోతలు ముమ్మరం అయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ముసురు పట్టి వర్షాలు కురుస్తుండటంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారు. వర్షంతో వరికోతల పనులకు ఆటంకం ఏర్పడింది. కోత యంత్రాలు ఎక్కడివక్కడ నిలిపివేశారు. ఇప్పటికే కోసిన ధాన్యం ఆరబెట్టుకునే పనిలో ఉన్న రైతులకు ఈ వర్షాలు ఆందోళన పుట్టిస్తున్నాయి.

బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం రాసులను తడిపేసింది. రైతులు పట్టాలు తీసుకుని అరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో వానాకాలం సాగు చేసిన వరిపంటతోపాటు జొన్న, మొక్కజొన్న పంటకోతలు కూడా జరుగుతున్నాయి. పెసర, మినుము, వేరుశనగ,సోయాబీన్ పంట కోతలు కూడా జరుగుతున్నాయి .పత్తి చేలమీదే ఉంది. ఆకాల వర్షాలతో రైతులు బేజారెత్తిపోతున్నారు. నోటికాడికొచ్చిన పంట వర్షంలో తడిసిపోతే రంగు మారి నాణ్యత చెడిపోతుందని ఆందోళన చుందుతున్నారు.

నాగులవంచెలలో 26.8 మి.మి వర్షం:
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో పలు చోట్ల ఒకమోస్తరు వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలోని నాగులవంచెలో 26.8 మి.మి వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లాలో నడిగూడెంలో 25,రెడ్డిగూడెంలో 21, శాంతినగర్‌లో 21, జాజిరెడ్డిగూడెంలో 20,ముకుందాపురంలో 19.5, ఫణిగిరిలో 16.5, పెద్దవీడులో 13 మి.మి వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా గండిపల్లిలో 23, దర్మిట్టలో 13.8, కొమరవెళ్లిలో 13, కష్కరలో 12.5, మి.మి వర్షం కురిసింది. హన్మకొండ జిల్లా ఆత్మకూరులో 16, చింతగట్టులో 13.5 మి.మి వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి ఒకమోస్తరు వర్షం కురిసింది.
#

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News