Friday, April 26, 2024

కాంగ్రెస్ రెబెల్స్‌కు గుణపాఠం

- Advertisement -
- Advertisement -

Rajasthan congress rebels

 

సచిన్ పైలట్ కొద్ది మంది మద్దతుదారులైన ఎంఎల్‌ఎలతో హర్యానాలోని ఒక హోటల్‌లో బైటాయింపు జరిపి, తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వని పక్షంలో బిజెపితో చేతులు కలిపి ఆ పదవి దక్కించుకొంటాననే బలమైన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు 30 మంది ఎంఎల్‌ఎల మద్దతున్నట్లు సంకేతాలు పంపారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో బిజెపి సహకారంతో కాంగ్రెస్‌లో తిరుగుబాటు నేతలు భారీ లబ్ధి పొందడంతో తాను కూడా జీవితాశయం నెరవేర్చుకోవాలని కొంచెం తొందరపడిన్నట్లు కనిపిస్తున్నది. అయితే సచిన్‌కు చెప్పుకోదగిన ఎంఎల్‌ఎల మద్దతు లేకపోవడం, ఆ రెండు రాష్ట్రాలలోవలే బిజెపికి సహితం అత్యధికంగా ఎంఎల్‌ఎలు లేక పోవడంతో సచిన్ శిబిరం రాజకీయాలు ఫలించినట్లు కనిపించడం లేదు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో యువతకు ముసలి నాయకత్వం దారి ఇవ్వడంలేదని, అందుకనే ఆ పార్టీ నానాటికీ కుంచించుకుపోతున్నదనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కొందరు కాంగ్రెస్‌లో అసహనంతో ఉన్న నేతలే ఆ విధమైన వాదనలు వినిపిస్తున్నారు. జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ వంటి పేర్లను ప్రస్తావిస్తున్నారు. అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఇటువంటి నేతల పట్ల బిజెపి నాయకత్వం సానుభూతి చూపిస్తుండటం. కాంగ్రెస్‌లోని కుటుంబం (గాంధీ) వారసత్వ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొనే బిజెపి కేవలం కుటుంబం వారసత్వం కారణంగానే కాంగ్రెస్‌లో కీలక పదవులు పొందిన వారి పట్ల సానుభూతి చూపడం ఆ పార్టీ ద్వంద ప్రమాణాలను వెల్లడి చేస్తుంది. జ్యోతిరాదిత్య గాని, సచిన్ గాని తమ తండ్రుల రాజకీయ వారసత్వం అందుకున్నవారే. తండ్రుల కన్నా ఎక్కువ కాలం అధికార పదవులు చేపట్టినవారే కావడం గమనార్హం.

తన రాజకీయ ప్రత్యర్థులను ఏనాడు పేరు పెట్టి విమర్శలు చేయని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సహితం సచిన్ పైలట్ పేరు ప్రస్తావిస్తూ బిజెపితో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేయడం గమనార్హం. కాంగ్రెస్‌లో ఆయన పట్ల పెద్దగా సానుభూతి కనిపించకపోవడం చూస్తే కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎంతగా వేధించారో వెల్లడి అవుతుంది. కాంగ్రెస్‌లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం కోసం రాహుల్‌గాంధీ ప్రయత్నించడం నిజమే అయినప్పటికీ ప్రజలతో సంబంధంలేని, క్షేత్ర స్థాయి వాస్తవాల పట్ల అవగాహనలేని వారసులనే ఎక్కువగా అందలం ఎక్కించే ప్రయత్నం చేసారని మరచిపోలేము. కాంగ్రెస్ నేడు ఇంతటి అధ్వాన్న పరిస్థితులలో ఉండడానికి ప్రజలతో సంబంధంలేని రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న బృంద మే కారణం అని మరువలేము.

డిసెంబర్, 2018లో మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధి యా, రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌లను ముఖ్యమంత్రులుగా చేయాలని రాహుల్ గాంధీ పట్టుబడ్డడంతో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మూడు, నాలుగు రోజుల పాటు నచ్చ జెప్పి వేరే వారిని ఎందుకు ఎంపిక చేశారో ఈ సందర్భంగా గమనించాలి. రాహుల్ అభ్యర్థులను ఎంపిక చేస్తే వారు అహంకార ధోరణితో, ఏకపక్ష విధానాలతో పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించగలరని భయపడటమే కారణం. జ్యోతిరాదిత్య సింధియాకు ఉత్తరప్రదేశ్‌లో సగభాగం అప్పచెబితే ఏమి చేశారు? స్థానిక నాయకుల పట్ల అహంకార ధోరణితో వ్యవహరించి, తన చుట్టూ చేరిన భజనపరులను అందలం ఎక్కించే ప్రయత్నం చేశారు. అందుకనే పలువురు కీలక నేతలు బిజెపిలోకి వెళ్ళేటట్లు ఒక విధంగా వత్తిడి చేశారు. సింధియా, పైలట్ తమ కులాలకు చెందిన నేతలుగా గుర్తింపు పొంది, ఆ కులాల ఆధిపత్యం గల నియోజక వర్గాలలో అభ్యర్థులను గెలిపించే సామర్ధ్యం పెంచుకున్నారు. అంతేగాని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు సమీకరించుకోలేకపోయారు.

సింధియా అయితే తమ రాజ వంశానికి ఉన్న పట్టు కారణంగా సుమారు 30 అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రభావం చూపగలరు. కానీ పైలట్‌కు అటువంటి బలం లేదు. తాను కష్టపడి రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే అశోక్ గెహ్లాట్ అధికారం కైవసం చేసుకుపోయారని అంటూ ఇప్పుడు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవానికి అక్కడ వసుంధరరాజే నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో కాంగ్రెస్ బొటా బోటీ ఆధిక్యతతో గెలుపొందడం పైలట్ కారణమని గుర్తించాలి. పైలట్ సరిగ్గా వ్యవహరించి ఉంటె బిజెపికి 30కి మించి సీట్లు వచ్చి ఉండెడివి కావు. కాంగ్రెస్‌కు 160 వరకు సీట్లు వచ్చి ఉండెడివని పరిశీలకులు భావిస్తున్నారు.

రాష్ట్ర జనాభాలో కేవలం 5 శాతం మంది ప్రజలు మాత్రమే ఉన్న తన కులస్థులకు వీలయిన చోటల్లా సీట్లు ఇవ్వాలని పట్టుబడుతూ, చివరకు రాహుల్ గాంధీని సహితం విసిగించారు. రాహుల్ గాంధీ సొంత బృందం పలు సర్వేలు జరిపి గెలుపొందే అవకాశాలున్న అభ్యర్థుల జాబితాను తయారు చేస్తే, పలు చోట్ల ఆ పేర్లను సచిన్ కొట్టిపారవేశారు. తాను చెప్పిన వారికి సీట్లు ఇవ్వని పక్షంలో ఎన్నికలలో పోటీ చేయనని, ఎన్నికలకు దూరంగా ఉంటాను అంటూ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున కూడా రాహుల్ గాంధీని బెదిరించారు. దానితో విసుగు చెందిన రాహుల్ గాంధీ తన వద్ద ఉన్న జాబితా పత్రాలను విసిరి వేసి ఆగ్రహంతో వెళ్లిపోయారు.
రాజస్థాన్‌లో సుమారు 20 మంది స్వతంత్రులు గెలుపొందారు. వారంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. వారిలో పెద్దగా ఎవ్వరి మద్దతును పైలట్ పొందలేకపోతున్నారు. ఎందుకంటె వారంతా దాదాపుగా పైలట్ కారణంగా కాంగ్రెస్ సీట్ పొందలేకపోయినవారు. వారయితే గెలుస్తారని అంటూ వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయమని ప్రోత్సహించింది రాహుల్ బృందంలోని వారే కావడం గమనార్హం. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా, మంచి పరిపాలన దక్షుడిగా అశోక్ గెహ్లాట్‌కు పేరుంది. అందుకనే ఒక విధంగా కరోనా మహమ్మారి సమయంలో సహితం సమర్ధవంతమైన పాలన అందించగలుగుతున్నారు.

అయితే సచిన్ చెప్పిన్నట్లు అవమానకరంగా ప్రవర్తించడం సహితం వాస్తవమే. ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ సచిన్ కి కీలకమైన మంత్రిత్వ శాఖలు ఏవీ ఇవ్వలేదు. హోం, ఆర్ధికం వంటి కీలక శాఖలను తన వద్దనే ఉంచుకున్నారు. అయన సహితం పాలనలో తన కులస్థులకు పెద్ద పీట వేస్తున్నారు. రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం అంతరించి పోవడం వల్లననే ఇటువంటి ఉపద్రవాలు జరుగుతున్నాయి. సచిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ఆవేదనను అందరి వద్ద చెప్పుకున్నా ఎవ్వరు ఏమీ చేయలేదని వాపోవడం గమనార్హం. ప్రియాంక గాంధీ తనతో మాట్లాడినా కుటుంబం విషయాలు మినహా తాను లేవనెత్తిన సమస్యల గురించి ప్రస్తావించలేదని చెప్పారు.

నేడు మొత్తం ఈశాన్య రాష్ట్రాలలో బిజెపికి ఏ సమస్య వచ్చినా ఆదుకొంటున్న అసోం మంత్రి హిమంతా బిస్వా శర్మ ఒకప్పుడు కాంగ్రెస్‌లో బలమైన నాయకుడు కావడం తెలిసిందే. ఆయన సహితం తన గోడు చెప్పుకుందామని ప్రయత్నిస్తే రాహుల్ గాంధీ సమయం ఇవ్వక పోవడంతో బిజెపిలో చేరి ఆ పార్టీకి అక్కడ మంచి ఆయువుపట్టుగా మారారు. కాంగ్రెస్ నుండి బైటకు వెడుతున్న అనేక మంది నేతలు నేడు ఇదే మాట చెబుతున్నారు.

ఇటువంటి పరిస్థితి కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే పరిమితం కాలేదు. దాదాపు అన్ని పార్టీలలో ఉన్నది. అసంతృప్తితో ఉన్న నేతలను పిలిపించి సముదాయించే ప్రయత్నం చేయడంతో పాటు ఏ సమస్య వచ్చినా చర్చించి, పరిష్కారం కోసం ఉమ్మడిగా కృషి చేస్తే వ్యవస్థలు రాష్ట్ర స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తే అనేక సమస్యలు పరిష్కారం కాగలవు. ముఖ్యమంత్రి మాత్రం చేత ఏకపక్షంగా వ్యవహరించడానికి అవకాశం ఇవ్వరాదు. బిజెపిలో అందుకు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నది. సుదీర్ఘ అనుభవం గల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వంటి వారు సహితం తన మంత్రివర్గ విస్తరణకు మూడు నెలల పాటు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయవలసి వచ్చింది. ఎవ్వరికీ ఏ శాఖ ఇవ్వాలో కూడా ఢిల్లీలో నిర్ణయించే దుస్థితి ఎదుర్కొన్నారు.

ఎంతో ప్రజాదరణ గల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వంలో కూడా కీలక పదవులకు నియామకం ప్రధానమంత్రి కార్యాలయం నుండి జరుగుతున్నది. కీలుబొమ్మ ముఖ్యమంత్రులను నియమించడం ఇందిరాగాంధీ హయాంలో ప్రారంభమైనది. ఆ దుష్ట సంప్రదాయాన్ని ఇప్పుడు బిజెపి కొనసాగిస్తున్నది. అయితే కాంగ్రెస్‌లో కేంద్ర నాయకత్వం బలహీనం కావడంతో రాష్ట్రాల నాయకులు సొంత సామ్రాజ్యాలు ఏర్పర్చుకొంటున్నారు. ముఖ్యంగా పంజాబ్‌లో కెప్టెన్ అమరిందర్ సింగ్, రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ వంటివారి ఆ విధంగా తయారవుతున్నారు. మహారాష్ట్రలో సహితం రాహుల్ గాంధీకి ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు శరద్ పవర్ ప్రభావంతో శివసేనతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పర్చడం చూశాము. రాజస్థాన్‌లో పైలట్ ప్రయత్నం అనుకున్న రీతిలో జరగకపోవడంతో తమకు సంబంధం లేదని బిజెపి నేతలు చెబుతున్నారు. అయితే హర్యానాలో పైలట్ ఉన్న హోటల్ చుట్టూ పోలీసులను కాపలా ఉంచి ఎంఎల్‌ఎలు ఎవ్వరూ జారిపోకుండా చూడడంలో బిజెపి పాత్రలేదా? పైలట్ తిరుగుబాటు సమయంలో జైపూర్‌లో ముఖ్యమంత్రి సన్నిహితులపై కేంద్ర దర్యాప్తు బృందాల సంకేతం ఏమి తెలుపుతుంది?

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బిజెపి నుండి పైలట్ పరోక్షంగా మద్దతు పొందారు. తాను నిలబెట్టిన అభ్యర్థులకు భారీగా నిధులు సమకూర్చారు. ఆ నిధులను సమకూర్చింది బిజెపి వారే అనే ప్రచారం జరిగింది. అక్కడ వసుంధర రాజే తిరిగి ముఖ్యమంత్రి కావడం ఇష్టంలేని అమిత్ షా వంటి నేతలు పైలట్ కు సహకారం అందించారని ప్రచారం జరిగింది. రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం చోటు చేసుకోనని పక్షంలో ప్రజాస్వామ్యం ఈ విధంగా ఎంఎల్‌ఎలను బందీలుగా హోటళ్లలో ఉంచి అపహాస్యంకు గురికాక తప్పదు.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News