Friday, April 26, 2024

సన్‌రైజర్స్‌ ‘మారలేదు’

- Advertisement -
- Advertisement -

Rajasthan Royals win over Sunrisers

బట్లర్ వీర విహారం
చెలరేగిన మోరిస్, ముస్తఫిజుర్
హైదరాబాద్‌పై రాజస్థాన్ జయకేతనం
కెప్టెన్‌ను మార్చినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసి రాలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 55 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసి సీజన్‌లో మూడో విజయం అందుకుంది. మరోవైపు హైదరాబాద్ ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరింటిలో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం పాలైంది. సెంచరీతో రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన జోస్ బట్లర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

న్యూఢిల్లీ : క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు మనీష్ పాండే, జానీ బెయిర్‌స్టో శుభారంభం అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఇటు మనీష్ అటు బెయిర్‌స్టో దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీ జోరును చూస్తుంటే హైదరాబాద్ లక్షం దిశగా సాగుతున్నట్టే కనిపించింది. అయితే 20 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసిన మనీష్ పాండేను ముస్తఫిజుర్ రహ్మాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 57 పరుగుల తొలి వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. ఆ వెంటనే మరో ఓపెనర్ బెయిర్‌స్టో కూడా పెవిలియన్ చేరాడు. 21 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన కేన్ విలియమ్సన్ ఒక ఫోర్‌తో 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. మిగతా వారు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ ఏ దశలోనూ లక్షం దిశగా అడుగులు వేయలేక పోయింది. ముస్తఫిజుర్, క్రిస్ మోరిస్ మూడేసి వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు.

బట్లర్ విధ్వంసక శతకం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను ఓపెనర్ జోస్ బట్లర్ ఆదుకున్నాడు. యశస్వి జైస్వాల్ (12) ఆరంభంలోనే పెవిలియన్ చేరినా కెప్టెన్ సంజు శాంసన్‌తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఆరంభం నుంచే బట్లర్ చెలరేగి పోయాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన బట్లర్ స్కోరును పరిగెత్తించాడు. శాంసన్ కూడా మెరుగైన బ్యాటింగ్‌తో అతనికి అండగా నిలిచాడు. ఈ జోడీని విడగొట్టేందుకు హైదరాబాద్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆకాశమే హద్దుగా చెలరేగిన బట్లర్ వరుస ఫోర్లు, సిక్సర్లతో సన్‌రైజర్స్ బౌలర్లను హడలెత్తించాడు. అతని ధాటికి స్కోరు వేగంగా పరిగెత్తింది. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ 33 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే సమయంలో బట్లర్‌తో కలిసి రెండో వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. ఇక చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ 64 బంతుల్లోనే 11 ఫోర్లు, మరో 8 భారీ సిక్సర్లతో 124 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రియాన్ పరాగ్ 15 (నాటౌట్) కూడా దూకుడుగా ఆడడంతో రాజస్థాన్ స్కోరు 220 పరుగులకు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News