Monday, April 29, 2024

రజనీ పార్టీ ‘మక్కల్ సేవాయి కచ్చి’!

- Advertisement -
- Advertisement -

Rajini party 'Makkal Sevai Katchi' symbol 'Auto Rickshaw'

 

అభిమానుల పేరుతో ఏడాది క్రితమే రిజిస్టరైన పార్టీ

చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీపై ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 31న రజనీ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు. అయితే, ఇప్పటికే రజనీ అభిమానులు ఆయన పెట్టబోయే పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేశారని చెబుతున్నారు. పార్టీ పేరు ‘మక్కల్ సేవాయి కచ్చి’ (ప్రజా సేవకుల పార్టీ) కాగా, పార్టీ గుర్తు ఆటోరిక్షాగా ప్రచారం జరుగుతోంది. రజనీ అభిమానుల సంఘం రజనీ మక్కల్ మంద్రం పేరుతో రెండేళ్ల క్రితం ఏర్పాటైంది. ఈ సంఘానికి చెందిన ఓ కుటుంబమే పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసింది. పార్టీ గుర్తు కోసం ప్రాధాన్యతా క్రమంలో రెండింటిని దరఖాస్తులో ప్రతిపాదించారు.

మొదటిది విక్టరీ గుర్తుగా రెండు చేతి వేళ్లను చూపించడం. ఇటీవల తన అభిమానుల సమావేశానంతరం కూడా రజనీ అలాగే తన చేతి వేళ్లను చూపించడం గమనార్హం. తనకు బాగా పేరు తెచ్చిన బాబా సినిమాలో రజనీ పదేపదే ఆ స్టైల్‌ను ప్రదర్శించారు. రెండో ప్రాధాన్యతగా ఆటోగుర్తును ప్రతిపాదించారు. అభిమానుల మన్ననలు పొందిన మరో చిత్రం బాషాలో రజనీ ఆటో డ్రైవర్‌గా నటించారు. ఎన్నికల సంఘం ఆటో గుర్తుకే ఆమోదం తెలిపింది. అయితే, గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన దరఖాస్తులో రజనీ పేరు ఎక్కడా ప్రస్తావించలేదని అధికారి ఒకరు తెలిపారు. కవరింగ్ లెటర్‌పై మాత్రం రజనీకాంత్ పేరు ఉన్నట్టుతెలిపారు.

2019 ఫిబ్రవరిలోనే అనైతిండియా మక్కల్ శక్తి కజగమ్ పేరుతో పార్టీని రిజిస్టర్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దాని పేరు మక్కల్ సేవాయి కచ్చిగా మార్చారు. చెన్నైలోని ఉత్తర ప్రాంతానికి చెందిన అడ్రస్‌తో పార్టీని రిజిస్టర్ చేశారు. మక్కల్ మంద్రంకు చెందిన ఎజె స్టాలిన్ కుటుంబసభ్యుల పేరుతో పార్టీని రిజిస్టర్ చేశారు. ఎస్‌పి జేమ్స్ పార్టీ అధ్యక్షుడిగా, ఆంటోనీ జో రాజా ప్రధాన కార్యదర్శిగా పార్టీని రిజిస్టర్ చేశారు. ఆధ్యాత్మిక, లౌకిక రాజకీయాలు నడుపుతానంటున్న రజనీకాంత్‌ను తమిళ ప్రజలు ఏవిధంగా స్వీకరిస్తారో మరో ఆరు నెలల్లో తేలిపోనున్నది. మరో ఆరు నెలల్లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో కమల్‌హాసన్ కూడా తన భవిష్యత్‌ను తేల్చుకోనున్నారు. హేతువాద భావాలున్న కమల్‌కూ, ఆధ్యాత్మిక భావాలున్న రజనీకి రాజకీయంగా పొత్తు కుదిరే అవకాశాలు తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News