Thursday, May 9, 2024

ఫుట్‌పాత్ పైనే భార్యాబిడ్డలతో నిరసన కొనసాగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలోని దిల్‌షాద్ గార్డెన్‌లో మరో ఇంటిని అధికారులు ఇవ్వజూపగా, రాట్‌హోల్ మైనర్ హస్సన్ తిరస్కరించారు. ఈ విషయాన్ని శనివారం ఆయన పిటిఐకి వెల్లడించారు. కూల్చివేత డ్రైవ్‌లో హస్సన్ ఖజూరీఖాస్‌లో తన ఇంటిని కోల్పోయిన సంగతి తెలిసిందే. “ శుక్రవారం రాత్రి ఎస్‌డిఎంతో సహా నలుగురు అధికారులు వచ్చి సమీపం లోని దిల్‌షాద్ గార్డెన్‌లో మరో ఇంటిని నాకు ఇవ్వచూపారు . కానీ నేను తిరస్కరించాను. తాత్కాలికంగా నన్ను వారు వేరే చోటికి తరలించాలనుకుంటున్నారు ” అని హస్సన్ చెప్పారు. “అది కూడా లిఖిత పూర్వకంగా కాదు. ఆ ఇల్లు ఒక ఎన్‌జిఒకు చెందినది”అని హస్సన్ పేర్కొన్నారు. తానున్న ఇంటిని కూల్చివేసిన కొన్ని గంటలకు డిడిఎ అధికారులు నరేలా లోని ఆర్థిక బలహీన వర్గాల ( ఇడబ్లుఎస్ ) కు చెందిన ఇంటిని హస్సన్‌కు అధికారులు ఇవ్వచూపారు. అది ఈశాన్య ఢిల్లీ లోని ఖజూరీఖాస్‌కు చాలా దూరం. అది దూరమే కాకుండా ఎలాంటి రక్షణ లేనిదని హస్సన్ తిరస్కరించారు. ఖజూర్‌కాస్‌కు సమీపాన గల దిల్‌షాద్ గార్డెన్‌లో మరో ఇంటి ఆఫర్‌ను ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించగా,

ఢిల్లీ డెవలప్‌మెంట్ అధారిటీ (డిడిఎ) కూల్చివేసిన తన ఇల్లు రూ. కోటి కన్నా ఎక్కువ విలువ చేస్తుందని, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలనుకుంటే , కూల్చివేసిన ఇంటి ఖరీదుతో సమానంగా ఉండాలని హస్సన్ వివరించారు. అనేక సంవత్సరాలుగా ఖజూరిఖాస్‌లో హస్సన్ ఉంటున్నారు. బుధవారం నాడు తన ఇంటిని కూల్చివేసిన తరువాత హస్సన్ తన ఇద్దరు పిల్లలు, భార్యతోసహా ఫుట్‌పాత్‌పై గడుపుతున్నారు. కూల్చివేత డ్రైవ్‌కు వ్యతిరేకంగా నిరసన పాటిస్తున్నారు. శనివారం ఢిల్లీలో వర్షం కురియగా, తనకు మద్దతుగా నిలవాలని వీడియో ద్వారా స్థానికులను హస్సన్ అభ్యర్థించారు. తన వస్తువులు, ఇతర గృహోపకరణాలు అన్నీ వర్షంలో ఆరుబయట తడుస్తున్నాయని చెప్పారు. తన నిరసన మూడో రోజుకు చేరిందని, ప్రభుత్వం నుంచి పరిష్కారం లభించే వరకు ఈ నిరసన దీక్షను కొనసాగిస్తానని హస్సన్ స్పష్టం చేశారు. తాను ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి 201213లో రూ.33 లక్షలకు స్థలం కొన్నానని, గదులు నిర్మాణానికి రూ..8 లక్షలు ఖర్చు చేశానని, డిడిఎ ఉద్యోగులకు కూడా కొంత ముట్టచెప్పానని ,

ఇప్పుడు తన ఇంటి విలువ రూ. కోటికి పెరిగిందని హస్సన్ వివరించారు. ఖజూరిఖాస్‌లో అదే ప్రాంతంలో ఉంటున్న వీర్‌దేవ్ కౌశిక్ ఈ సంఘటనపై మాట్లాడుతూఏ కొన్నేళ్ల క్రితమే ఈ ప్రాంతమంతా ఢిల్లీ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిందని, ఆ తరువాత తాను, మరికొందరం ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేశామని వివరించారు. తన లాగే హస్సన్ కూడా ప్లాట్ కొని ఇల్లు కట్టుకున్నాడని, అయితే ఇంకా అతని దగ్గర నుంచి మరికొంత డబ్బులు పిండడానికి అధికారులు వేధిస్తున్నారని , అడిగినంత ఇవ్వక పోవడంతో అతని ఇంటిని కూల్చేశారని కౌసిక్ ఆరోపించారు. కౌశిక్ ఉత్తరప్రదేశ్ ఆరోగ్య విభాగం ఉద్యోగి. ఉత్తరాఖండ్ సిల్కారా సొరంగం కూలి 41 మంది కార్మికులు చిక్కుకున్న ప్రమాదంలో సొరంగం తవ్వి వారిని రక్షించి బృందంలో హస్సన్ కూడా పాలుపంచుకున్నారు. ఎక్కడైతే తన ఇంటిని కూల్చేశారో, అక్కడ మళ్లీ తన ఇంటిని నిర్మించాలని హస్సన్ డిమాండ్ చేశారు. ఒకవేళ తన డిమాండ్ నెరవేరక పోతే నిరాహార దీక్షసాగిస్తానని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News